Investors Summit: ఏపీలో అదానీ సిమెంట్‌ ప్లాంట్స్‌.. అంబానీ సోలార్‌ ప్రాజెక్ట్‌

Andhra Pradesh Global Investors Summit: విశాఖ వేదికగా జరుగుతున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో భాగంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అంబానీ, అదానీ ముందుకొచ్చారు. సిమెంట్‌ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్లు, పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు నెలకొల్పనున్నట్లు ప్రకటించారు.

Published : 03 Mar 2023 15:40 IST

విశాఖపట్నం: ఏపీలో పెట్టుబడి పెట్టేందుకు బడా పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీ ముందుకొచ్చారు. ఏపీలో తాము సిమెంట్‌ ఫ్యాక్టరీలు, డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తామని అదానీ గ్రూప్‌ (Adani group) ప్రకటించగా.. సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ముకేశ్‌ అంబానీ (Mukesh ambani) ప్రకటించారు. విశాఖలో జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు (Global Investors Summit) ఇందుకు వేదికైంది. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో భాగంగా తొలి రోజు ఈ ప్రకటనలు వెలువడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు సిమెంట్‌ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయనున్నట్లు అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ సీఈఓ, గౌతమ్‌ అదానీ తనయుడు కరణ్‌ అదానీ ప్రకటించారు. 10 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో కడప, నడికుడిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. విశాఖలో 400 MW డేటా సెంటర్‌ను నెలకొల్పనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 100 మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో కృష్ణపట్నం, గంగవరం పోర్టులు నిర్వహిస్తున్నామని, రాబోయే ఐదేళ్లలో ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంతో పాటు, ఈ పోర్టులను ఇండస్ట్రియల్‌ పోర్ట్‌ సిటీస్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. రాబోయే ఐదేళ్లలో అనంతపురం, కడప, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో 15వేల మెగావాట్ల పునరుత్పాదక పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదానీ ఫౌండేషన్‌ సేవలను ఏపీకి విస్తరించనున్నట్లు తెలిపారు.

10 గిగావాట్ల సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌

ఏపీలో 10 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. పెట్టుబడిదారుల సదస్సుకు స్వయంగా హాజరైన ఆయన.. ఈ మేరకు దీని గురించి ప్రకటన చేశారు. ఇప్పటికే ఏపీలో కేజీ డి-6 బేసిన్‌లో రూ.1.50 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు గుర్తుచేశారు. ఇక్కడి బేసిన్‌లో ఉత్పత్తి అవుతున్న సహజ వాయువు 30 శాతం మేర దేశీయ అవసరాలను తీరుస్తోందని చెప్పారు. భారత అభివృద్ధిలో ఏపీ ఎంత ముఖ్యమో చెప్పేందుకు ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. 2023 చివరి నాటికి దేశవ్యాప్తంగా జియో ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని