Smart meter: స్మార్ట్‌ మీటర్ల తయారీ వ్యాపారంలోకి అదానీ

Adani enters in smart meter business: స్మార్ట్‌మీటర్ల తయారీ రంగంలోకి ప్రవేశించారు గౌతమ్‌ అదానీ. బెస్ట్‌ స్మార్ట్‌మీటరింగ్‌ లిమిటెడ్‌ పేరిట ఓ సంస్థను స్థాపించారు.

Published : 28 Dec 2022 17:52 IST

దిల్లీ: స్మార్ట్‌మీటర్ల (Smart meter) తయారీ వ్యాపారంలోకి ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam adani) ప్రవేశించారు. ఇందుకోసం బెస్ట్‌ స్మార్ట్‌మీటరింగ్‌ లిమిటెడ్‌ (BSML) పేరిట ఓ సంస్థను నెలకొల్పారు. అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ ట్రాన్స్‌మిషన్‌కు ఇది నూరు శాతం అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో డిసెంబర్‌ 27న ఈ సంస్థను నెలకొల్పినట్లు అదానీ ట్రాన్స్‌మిషన్‌ తన బీఎస్‌ఈ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీస్‌ రిజిస్ట్రార్‌ వద్ద నమోదైందని, కార్యకలాపాలు ఇంకా ప్రారంభం కాలేదని తెలిపింది.

ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ మీటర్ల స్థానంలో స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ పథకం (RDSS) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. డిస్కమ్‌ల కార్యకలాపాల సామర్థ్యం మెరుగుపర్చడం, అవి ఆర్థిక స్థిరత్వం సాధించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లు కేంద్రం తెలిపింది. 2021-22 నుంచి 2025-26 మధ్య మొత్తం 250 మిలియన్‌ ప్రీపెయిడ్‌ స్మార్ట్‌మీటర్లు అమర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం లక్షా యాభైవేల కోట్లు కేటాయించేందుకు నిర్ణయించింది. ఈ స్కీమ్‌ కింద 23 రాష్ట్రాల పరిధిలోని 40 డిస్కమ్‌లకు 17.34 కోట్ల ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు, 49.02 లక్షల డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌మిషన్‌ మీటర్లు, 1.68 లక్షల ఫీడర్‌ మీటర్లు మంజూరయ్యాయి. ఈ నేపథ్యంలో అదానీ స్మార్ట్‌మీటర్‌ తయారీ వ్యాపారంలోకి అడుగుపెట్టడం గమనార్హం. మరోవైపు అనుబంధ కంపెనీ ప్రారంభం నేపథ్యంలో బుధవారం అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేరు విలువ 1.88 శాతం పెరిగి రూ.2,548.75 వద్ద స్థిరపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని