Income Tax: అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లించారా?.. రేపే ఆఖరు తేదీ!

చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను రూ.10 వేల కంటే ఎక్కువ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ముంద‌స్తు పన్ను చెల్లించాలి.

Updated : 14 Mar 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల గ‌డువు రేప‌టి (మార్చి 15)తో ముగియ‌నుంది. మ‌రి మీరు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించారా? అసలింతకీ అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఏమిటి? ఎవ‌రు చెల్లించాలి? గ‌డువులోగా చెల్లించ‌క‌పోతే ఎంత పెనాల్టీ వ‌ర్తిస్తుంది? త‌దిత‌ర విష‌యాల‌ను ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఆదాయ‌పు ప‌న్ను నిబంధ‌న‌ల ప్ర‌కారం ప‌రిమితికి మించిన ఆదాయం ఉన్న వారు.. వ‌చ్చిన‌ ఆదాయంపై ప‌న్ను చెల్లించ‌డం స‌ర్వ‌సాధార‌ణం. అలా కాకుండా రాబోయే ఆదాయాన్ని అంచ‌నా వేసి ముంద‌స్తుగా ప‌న్ను చెల్లించ‌డాన్నే అడ్వాన్స్ ట్యాక్స్ (ముంద‌స్తు పన్ను) అంటారు. ఈ ముందస్తు ప‌న్నును ఒకే సారి సంవ‌త్స‌రం చివ‌ర‌న కాకుండా ద‌శ‌ల వారీగా చెల్లించాల్సి ఉంటుంది.

ఎవ‌రెవ‌రు చెల్లించాలి..?
అంచ‌నా వేసిన ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను రూ.10 వేలు లేదా అంత కంటే ఎక్కువ ఉన్న ప్ర‌తి ఒక్క‌రూ ముంద‌స్తు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు, స్వ‌యం ఉపాధి పొందుతున్నవారు, ఇలా ప్ర‌తి ఒక్క‌రూ ఈ ముంద‌స్తు ప‌న్ను చెల్లించాలి. సాధార‌ణంగా కొన్ని ఆదాయాలు మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌) త‌గ్గింపుతో వ‌స్తాయి. అయితే అన్ని ఆదాయాలూ టీడీఎస్‌కు లోబ‌డి ఉండ‌వు. అటువంట‌ప్పుడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. జీతం ద్వారా ఆదాయం పొందుతున్న ఉద్యోగుల‌కు వారు ప‌నిచేస్తున్న సంస్థ‌.. మూలం వ‌ద్ద ప‌న్ను మిన‌హాయించుకుంటుంది. అందుక‌ని వారు ప్ర‌త్యేకంగా ఈ ముంద‌స్తు ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. ఒక‌వేళ ఇంటి అద్దె లేదా ఇత‌ర మార్గాల నుంచి ఆదాయం వ‌స్తుంటే అటువంటి ఆదాయంపై అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది కూడా మీ ఉద్యోగ సంస్థకు తెలిపి టీడీఎస్ చెల్లించవచ్చు.

ఎవ‌రెవ‌రు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు..?
ఏదైనా ఆర్థిక సంవ‌త్స‌రంలో అంచ‌నా ఆదాయంపై చెల్లించాల్సిన ఆదాయ‌ప‌న్ను విలువ రూ.10 వేల కంటే త‌క్కువ ఉన్న వారు ముంద‌స్తు ప‌న్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 60 సంవ‌త్స‌రాలు పైబ‌డి ఎలాంటి వ్యాపార‌, వృత్తిగ‌త ఆదాయం లేని సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ఈ ముంద‌స్తు ప‌న్ను చెల్లింపు నుంచి మిన‌హాయింపు క‌ల్పించారు.

ఎలా లెక్కించాలి, ఎప్పుడు చెల్లించాలి..?
ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో అందే అన్నిర‌కాల ఆదాయాల‌ను అంచ‌నా వేయాలి. ఇలా అంచ‌నా వేసిన మొత్తం నుంచి అందుబాటులో ఉన్న ప‌న్ను మిన‌హాయింపుల‌ను తీసివేయాలి. ఆ త‌ర్వాత మిగిలిన ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నును లెక్కించాలి. ఈ మొత్తం ప‌న్ను విలువ రూ.10 వేలు లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే ముంద‌స్తు ప‌న్ను చెల్లించాలి. నిర్దేశించిన తేదీలోపు ద‌శ‌ల వారీగా అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి.

అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే గ‌డువు తేదీలు..
జూన్ 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 15 శాతం అడ్వాన్స్ చెల్లించాలి.
సెప్టెంబ‌ర్ 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 45 శాతం లెక్కించి అప్ప‌టికే క‌ట్టిన‌ ముందస్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి.
డిసెంబ‌ర్ 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్నులో 75 శాతం లెక్కించి దాని నుంచి అప్ప‌టికే క‌ట్టిన ముంద‌స్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి.
మార్చి 15 - మొత్తం ఆదాయంపై చెల్లించాల్సిన ప‌న్ను 100 శాతం నుంచి అప్ప‌టికే క‌ట్టిన‌ ముందస్తు ప‌న్నును తీసివేయ‌గా మిగిలిన మొత్తం చెల్లించాలి.

ఆల‌స్యంగా చెల్లిస్తే పెనాల్టీ..
ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌డంలో ఆస‌ల్యం చేస్తే పెనాల్టీ వ‌ర్తిస్తుంది. చెల్లించాల్సిన మొత్తంపై నెల‌కు 1 శాతం వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఒక‌సారి ముంద‌స్తు ప‌న్ను చెల్లించ‌డంలో విఫ‌లమయితే త‌ర్వాతి వాయిదాకు మూడు నెల‌ల స‌మ‌యం ఉంటుంది. కాబ‌ట్టి మూడు నెల‌ల‌కు వ‌డ్డీ చెల్లించాల్సి వ‌స్తుంది. ఉదాహ‌ర‌ణ‌కు మీకు రూ.1 ల‌క్ష ప‌న్ను బాధ్యత ఉంద‌నుకుందాం. జూన్ 15 నాటికి రూ.15 వేల అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాలి. కానీ చెల్లించ‌డంలో విఫ‌లం అయ్యారు. ఇప్పుడు నెల‌కు రూ.150 చొప్పున మూడు నెల‌ల‌కు రూ.450 వ‌డ్డీతో సెప్టెంబ‌రు 15న‌ ముందుస్తు ప‌న్ను చెల్లించాలి. ఒక‌వేళ మీరు ఒక‌రోజు ఆల‌స్యంగా అంటే జూన్ 16న ముంద‌స్తు ప‌న్ను చెల్లించినప్ప‌టికీ ఈ వ‌డ్డీ వ‌ర్తిస్తుంది. ఒక‌వేళ మీరు మార్చి 15 లోపు ముంద‌స్తు ప‌న్ను వాయిదాను చెల్లించ‌క‌పోయినా, చెల్లించాల్సిన మొత్తం కంటే త‌క్కువ చెల్లించిన‌ట్లు గుర్తించినా మార్చి 31 లోపు చెల్లించ‌వ‌చ్చు. అయితే, చెల్లించాల్సిన మొత్తానికి నెల‌కు 1శాతం పెనాల్టీతో క‌లిపి చెల్లించాలి.

చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ చెల్లిస్తే..
ఒక‌వేళ మీరు చెల్లించాల్సిన వాస్త‌వ ప‌న్ను (అడ్వాన్స్ ట్యాక్స్ లేదా టీడీఎస్‌) కంటే ఎక్కువ చెల్లిస్తే, రీఫండ్ క్లెయిమ్ చేసుకోవ‌చ్చు. అయితే రీఫండ్ పొందేందుకు త‌ప్ప‌కుండా ఐటీఆర్ ఫైల్ చేయాలి. అంతేకాకుండా చెల్లించిన అద‌న‌పు ప‌న్నుపై 6 శాతం వ‌డ్డీ పొందేందుకు మీరు అర్హులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని