Amararaja: అమరరాజాకు అత్యాధునిక ఈవీ బ్యాటరీ టెక్నాలజీ

అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జీఐబి ఎనర్జీ ఎక్స్‌ స్లొవేకియా (గోషన్‌ హైటెక్‌ కం.లిమిటెడ్‌  అనుబంధ కంపెనీ) తో సాంకేతిక లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Published : 25 Jun 2024 02:22 IST

స్లొవేకియా సంస్థతో సాంకేతిక లైసెన్సింగ్‌ ఒప్పందం 
ఎల్‌ఎఫ్‌పీ సెల్స్‌ ఆవిష్కరించే అవకాశం 

ఈనాడు, హైదరాబాద్‌: అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ లిమిటెడ్‌కు పూర్తి అనుబంధ సంస్థ అయిన అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జీఐబి ఎనర్జీ ఎక్స్‌ స్లొవేకియా (గోషన్‌ హైటెక్‌ కం.లిమిటెడ్‌  అనుబంధ కంపెనీ) తో సాంకేతిక లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం జీఐబీ ఎనర్జీ ఎక్స్‌ నుంచి లిథియమ్‌ అయాన్‌ సెల్స్‌కు చెందిన ఎల్‌ఎఫ్‌పీ టెక్నాలజీ లైసెన్సు అమరరాజా అడ్వాన్స్‌డ్‌ సెల్‌ టెక్నాలజీస్‌కు లభిస్తుంది. దీనివల్ల అమరరాజా ప్రపంచ స్థాయి ఎల్‌ఎఫ్‌పీ (లిథియమ్‌ ఫెర్రస్‌ఫాస్పేట్‌) సెల్స్‌ ఉత్పత్తి చేయగలుగుతుంది. ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలను తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేయొచ్చు. ఎక్కువ కాలం మన్నుతాయి. భద్రత కూడా ఎక్కువ. అందువల్ల విద్యుత్తు వాహనాల్లో ఈ తరహా బ్యాటరీల వినియోగం పెరుగుతోంది. ఈ ఒప్పందం వల్ల ఎల్‌ఎఫ్‌పీ సెల్‌ టెక్నాలజీ ఐపీ (ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ)తో పాటు గిగాఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతు, బ్యాటరీ మెటీరియల్స్‌ గోషన్‌ సప్లై చైన్‌ నెట్‌వర్క్‌ నుంచి సరఫరా అవుతాయి. వినియోగదార్లకు అవసరమైన సాంకేతిక మద్దతు కూడా జీఐబీ ఎనర్జీ ఎక్స్‌ నుంచి అమరరాజాకు లభిస్తాయి. 

హైదరాబాద్‌ ప్లాంటులోనే ఉత్పత్తి: హైదరాబాద్‌ సమీపంలో దాదాపు రూ.9,500 కోట్ల పెట్టుబడితో అమరరాజా గిగా కారిడార్‌ పేరుతో, గిగా ఫ్యాక్టరీ ఉత్పత్తి సదుపాయాలు నిర్మిస్తున్న విషయం విదితమే. ఇక్కడే అధునాతన బ్యాటరీలు తయారు చేస్తారు. బ్యాటరీల విభాగంలో అత్యాధునిక పరిశోధనల నిమిత్తం ‘ఇ+ ఎనర్జీ ల్యాబ్స్‌’ అనే పరిశోధనా కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రపంచంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తి చేసిన బ్యాటరీలు, బ్యాటరీ ఉపకరణాలు వినియోగదార్లకు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా అమరరాజా గ్రూపు సాంకేతిక భాగస్వామ్యాలు కుదుర్చుకుంటోంది. గోషన్‌ హై-టెక్‌కు ప్రపంచ వ్యాప్తంగా 8 పరిశోధనా కేంద్రాలు, 8,000కు పైగా పేటెంట్‌ హక్కులతో సాంకేతిక పరిజ్ఞానం ఉన్నాయి. 20 ఉత్పత్తి కేంద్రాలు కూడా ఈ సంస్థకు ఉన్నాయి. 2025 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 300 గిగావాట్లకు చేరుతుందని అంచనా. 

మనదేశంలో విద్యుత్తు వాహనాల (ఈవీ) మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తున్నందున, ఈ విభాగంలో క్రియాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నట్లు అమరరాజా ఎనర్జీ అండ్‌ మొబిలిటీ సీఎండీ జయదేవ్‌ గల్లా అన్నారు. వినూత్న సాంకేతిక సత్తా, మూడు దశాబ్దాల అనుభవం ఉన్న గోషన్‌ హై-టెక్‌తో భాగస్వామ్యం ఈ లక్ష్యసాధనలో తమకు ఉపయోగపడుతుందని వివరించారు. ఆటోమోటివ్, ఇండస్ట్రియల్‌ బ్యాటరీల విభాగంలో ఎన్నో ఏళ్లుగా వినియోగదార్లతో,  సాంకేతిక సంస్థలతో అమరరాజాకు బలమైన సంబంధాలు ఏర్పడినట్లు తెలిపారు. ఇంధన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వృద్ధి బాటలో ముందుకు సాగటానికి ఈ భాగస్వామ్యాలు ఉపకరిస్తాయని ఆయన అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని