బ్యాంక్ వేలంలో పాల్గొంటే ఎన్ని లాభాలో!

బ్యాంకు వేలంలో పాల్గొంటే కొన్ని ప్ర‌యోజ‌నాల‌తో పాటు స‌వాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది​​​​​​........​

Updated : 01 Jan 2021 19:08 IST

​​​​​​​ప్ర‌స్తుతం వాణిజ్య లేదా నివాస ప‌ర‌మైన ఆస్తుల‌ను కొనుగోలు చేయ‌డం క‌త్తి మీద సాము లాగా మారింది. ఎందుకంటే ఈ ఆస్తుల‌లో చాలా వాటికి న్యాయ‌ప‌ర‌మైన‌, ఇత‌ర వివాదాలు ఉంటున్నాయి. ఈ ఇబ్బందులేవీ లేకుండా, స్థ‌లాల‌ను కొనుగోలు చేయాల‌నుకుంటే బ్యాంకుల ఇ-వేలం మంచి అవ‌కాశం. మే 29 న‌ దేశంలో అతి పెద్ద బ్యాంకు ఎస్‌బీఐ మెగా ఇ-వేలం నిర్వ‌హించింది. ఈ వేలం ద్వారా మ‌దుప‌రులు ఎస్‌బీఐ ఆధీనంలో దాదాపు 1000 నివాస‌, వాణిజ్య స్థలాల‌కు బిడ్ల‌ను ఆహ్వ‌నించింది. బిడ్డింగ్‌లో గెలిచిన వారికి, వారి అర్హ‌త‌ల‌ను బట్టి రుణ స‌దుపాయం కూడా ఉంది. ఈ వెయ్యి స్ధ‌లాల‌ను ఎస్‌బీఐ త‌న‌కు రుణం చెల్లించ‌డంలో విఫ‌ల‌మైన రుణ‌గ్ర‌హీత‌ల నుంచి స‌ర్ఫేసీ చ‌ట్టం ప్ర‌కారం స్వాధీనం చేసుకుంది. ఎస్‌బీఐ బాట‌లో ఇత‌ర బ్యాంకులు కూడా వేలం ప్ర‌క‌టించే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం. బ్యాంకులు త‌మ రుణ భారాన్ని త‌గ్గించుకునేందుకు ఇ-వేలాన్ని ప్ర‌క‌టిస్తాయి. బ్యాంకులు ఇ-వేలంపై ఎందుకంత ఆస‌క్తి అంటే భారీగా డిస్కౌంట్ పొంద‌వ‌చ్చు. కొనుగోలుదారుల‌కు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సొంత గృహాల‌ను కొనుగోలు చేసుకునేందుకు ఇదే మంచి అవ‌కాశం.

ఇ-వేలం ద్వారా ప్ర‌యోజ‌నాలు:

బ్యాంకు ఇ-వేలం ద్వారా ఆస్తిని కొనుగోలు చేస్తే మార్కెట్ ధ‌ర‌క కంటే త‌క్కువ ధ‌ర‌కు రావ‌డంతో పాటు, న్యాయ‌, చ‌ట్ట‌ప‌ర‌మైన‌ ఇబ్బందులు కూడా ఏమి ఉండ‌వు. న‌చ్చిన ప్రాప‌ర్టీని బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేయ‌వ‌చ్చు.

ఇ-వేలంలో ఎదురయ్యే స‌వాళ్లు:

బ్యాంకుల ఇ-వేలంలో ప్ర‌యోజ‌నాల‌తో పాటు కొన్ని స‌వాళ్లు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొరుకున్న ఆస్తికి ఎంత విలువ ప‌లుకుతుందో ఎంత గ‌రిష్ఠంగా బిడ్ వేస్తారో అంచ‌నా వేయలేం. అంచ‌నా వేసిన‌ ధ‌ర‌కే దొరుకుతుంద‌న్న న‌మ్మ‌కం లేదు. అయితే మార్కెట్ ధ‌ర‌ల కంటే త‌క్కువ‌గా ఉండ‌టమే వేలం ఉద్దేశ్యం. ఇక్క‌డ మ‌రొక రిస్క్‌తో కూడుకున్న అంశం ఏంటంటే కొనుగోలు చేసిన ప్రాప‌ర్టీ గురించి పూర్తి స‌మాచారం మీకు తెలియ‌క‌పోవ‌చ్చు.

వేలంలో ఆస్తి కొనుగోలు చేసేట‌ప్పుడు ప‌న్నులు, స్టాంపు డ్యూటీతో క‌లిపి మొత్తం డ‌బ్బు సిద్ధంగా ఉంచుకోవాలి. లేదంటే అది ఇంకొక‌రికి వెళ్లే అవ‌కాశం ఉంటుంది. డిస్కౌంట్‌లో వ‌చ్చిన ప్రాప‌ర్టీని కొనుగోలు చేసిన త‌ర్వాత బ్యాంకు, ఆ ఆస్తి య‌జ‌మాని సంతృప్తిగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వు. అదేవిధంగా కొనుగోలుదారుడు ఆస్తి గురించిన మొత్తం వివ‌రాల‌ను తెలుసుకొని అవ‌స‌ర‌మైన కార్య‌క‌లాపాల‌ను పూర్తి చేయాలి. దీంతో భ‌విష్య‌త్తులో ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. బ్యాంకుల వేలం ద్వారా న‌మ్మ‌క‌మైన ఆస్తుల‌ను కొనుగోలు చేయ‌వచ్చు. అయితే దీనిలో ఉండే కిటుకులు తెలుసుకొని వేలంలో పాల్గొంటే మంచిద‌ని విశ్లేష‌కులు అభిప్రాయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని