Mutual Funds: మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రిస్క్ ఉన్న‌ప్ప‌టీ గ‌త చరిత్ర‌ను ప‌రిశీలిస్తే.. పెట్టుబ‌డిదారులు దీర్ఘకాలంలో మంచి రాబ‌డి సాధించారు. 

Updated : 19 Aug 2022 15:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మార్కెట్ అనుసంధానిత పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్న భారతీయుల సంఖ్య‌ ఏటా పెరుగుతోందని స‌ర్వేలు చెబుతున్నాయి. వివిధ బ్రోకరేజీ సంస్థలు కూడా సులభంగా పెట్టుబడులకు అవకాశాలు కల్పిస్తుండడం, పెట్టుబ‌డుల ఖ‌ర్చు త‌గ్గ‌డం, త‌క్కువ మొత్తాల‌తో నెల‌వారీగా పెట్టుబ‌డులు చేసే అవ‌కాశం ఉండ‌డం కూడా పెట్టుబ‌డుల‌పై ఆస‌క్తి పెర‌గ‌డానికి కార‌ణాలుగా చెప్పొచ్చు. అయితే స్టాక్స్‌లో నేరుగా పెట్టుబ‌డి పెట్ట‌డం వ‌ల్ల నష్టభయం అధికంగా ఉంటుంది. అనుభ‌వ రాహిత్యం కార‌ణంగా డ‌బ్బు పోగొట్టుకునే ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటుంది. అందువల్ల చాలామంది రిస్క్ తక్కువగా ఉండే మార్గాల వైపు మొగ్గుచూపుతుంటారు. ఈ కోవలో ముఖ్యంగా చెప్పుకోవ‌ల‌సింది మ్యూచువల్ ఫండ్ (Mutual Funds) పెట్టుబడుల గురించి. వేరు వేరు పెట్టుబ‌డిదారుల‌ నుంచి నిధులను సేకరించి, వాటిని పెట్టుబడులకు కేటాయించే పద్ధతినే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు అంటారు. వీటిపై వచ్చే రాబడిని సదరు మ‌దుప‌ర్లకు కేటాయిస్తారు. ఇలా మ‌దుపర్ల నుంచి సేక‌రించిన నిధుల‌ను, ఏఎంసీలు సెక్యురిటీల్లో (షేర్లు, బాండ్లు, ఇత‌ర ఆస్తుల్లో) పెట్టుబ‌డి పెట్టి రాబ‌డిని పెంచెందేకు కృషి చేస్తాయి. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో రిస్క్ ఉన్న‌ప్ప‌టికీ గ‌త చరిత్ర‌ను ప‌రిశీలిస్తే.. పెట్టుబ‌డిదారులు దీర్ఘకాలంలో మంచి రాబ‌డి సాధించారు. 

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు.. 

నిపుణుల నిర్వ‌హణ..

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను నిర్వ‌హించేందుకు అనుభ‌వ‌జ్ఞులైన ఫండ్ మేనేజ‌ర్లు ఉంటారు. వారు మార్కెట్ల‌ను ప‌రిశోధించి.. ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేస్తుంటారు. పెట్టుబ‌డుల‌పై వీలైనంత ఎక్కువ‌ రాబ‌డిని సాధించేందుకు స‌రైన‌ షేర్ల‌ను ఎంచుకుని త‌గిన స‌మ‌యంలో కొనుగోలు చేయ‌డం, విక్ర‌యించ‌డం వంటివి చేస్తుంటారు. పెట్టుబ‌డులు చేసేముందు ఫండ్ మేనేజ‌ర్లు సంబంధిత సంస్థ ప‌నితీరును విశ్లేషించి షేర్ల‌ను కొనుగోలు చేయాలా? వ‌ద్దా? అని నిర్ణ‌యిస్తారు. పెట్టుబ‌డిదారులుగా మ‌నం చేయాల్సిన ప‌ని ఏంటంటే.. మంచి ఫండ్ మేనేజ‌ర్ ఉన్న మ్యూచువల్ ఫండ్ ఎంచుకోవ‌డం. ఇందుకోసం మ్యూచువ‌ల్ ఫండ్ స్కీమ్ యూనిట్ల‌ను కొనుగోలు చేసేముందు.. స్కీమ్ స‌మాచార ప‌త్రం (ఎస్ఐడీ)లో ఫండ్ మేనేజ‌ర్ అనుభం, నిర్వ‌హించిన ఫండ్లు, వాటి ప‌నితీరు వంటి వాటి మీద పూర్తి స‌మాచారం ఉంటుంది. దీన్ని పూర్తిగా చ‌దివిన త‌ర్వాత  స‌మాచారం ఆధారంగా నిపుణుడైన‌ ఫండ్ మేనేజ‌ర్‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

అధిక రాబ‌డి

సంప్రదాయ పెట్టుబ‌డి మార్గాలైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు (ఎఫ్‌డీ), రిక‌రింగ్ డిపాజిట్లు (ఆర్‌డీ)ల‌తో పోలిస్తే మ్యూచ్‌వ‌ల్ ఫండ్ల‌లో ఎక్కువ రాబ‌డి ఉంటుంది. అధిక రాబ‌డి సాధించేందుకు ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు మదుప‌ర్లకు ఒక మంచి మార్గం. అదే స‌మ‌యంలో రిస్క్ కూడా ఉంటుంద‌ని గుర్తుంచుకోవాలి. ఎక్కువ రిస్క్ తీసుకోగ‌లిగిన మ‌దుప్ల‌ర‌కు ఇవి స‌రిపోతాయి. త‌క్కువ రిస్క్ తీసుకోగ‌లిగే వారికి డెట్ ఫండ్లు మంచి ఎంపిక‌. ఇవి కూడా ట‌ర్మ్ డిపాజిట్ల‌తో పోల‌స్తే మంచి రాబ‌డినే అందిస్తాయి.

వైవిధ్య‌త‌.. 

మ్యూచువల్ ఫండ్లు అందించే గొప్ప ప్రయోజనాల్లో ఒకటి 'డైవర్సిఫికేషన్'. విస్తృత శ్రేణి ఆస్తి తరగతులు, స్టాక్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా, వైవిధ్యంగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. కాబ‌ట్టి ఒక‌ ఆస్తి/స్టాక్ ప‌నితీరు స‌రిగ్గా లేక‌పోయినా.. ఇతర ఆస్తుల పనితీరు దాన్ని సమతుల్యం చేసే అవ‌కాశం ఉంటుంది. దీంతో న‌ష్ట‌భ‌యం త‌గ్గి అనుకూల‌మైన రాబ‌డికి ఆస్కారం ఉంటుంది. న‌ష్ట‌భ‌యాన్ని మరింత తగ్గించుకునేందుకు, వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం ద్వారా మీ పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచవచ్చు. ఏ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి? పోర్ట్‌ఫోలియోని ఎలా స‌మ‌తుల్యం చేయాలి?  అనే అంశాల‌పై అవ‌గాహ‌న లేక‌పోతే ఆర్థిక సలహాదారుని సాయం తీసుకోవడం మంచిది.

సౌక‌ర్యవంతంగా పెట్టుబ‌డులు..

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ప్ర‌స్తుతం ఆన్‌లైన్ ద్వారా సులువుగా మ‌దుపు చేయొచ్చు. అందువ‌ల్ల ప్ర‌పంచ‌దేశాల‌లో ఎక్క‌డ నుంచైనా ఆన్‌లైన్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను ప్రారంభించ‌వ‌చ్చు. అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఫండ్ల‌ను నిర్వహిస్తాయి. అలాగే, బ్రోక‌రేజ్ సంస్థ‌లు, కార్వీ, క్యామ్స్‌ (సీఏఎంఎస్‌) వంటి రిజిస్ట్రార్లు, ఆన్‌లైన్ మ్యూచువ‌ల్ ఫండ్ ఫ్లాట్‌ఫారంలు, ఏజెంట్లు, బ్యాంకులు ద్వారా అందిస్తున్నందువ‌ల్ల‌ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డుల‌కు డీమ్యాట్ ఖాతా త‌ప్ప‌నిస‌రికాదు. అలాగే కేవైసీ ప్ర‌క్రియ‌ను కూడా ఇ-కేవైసీ స‌దుపాయాన్ని వినియోగించుకుని ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయ‌వ‌చ్చు. అయితే ఇ-కేవైసీ చేసిన వారు రూ. 50 వేల వ‌ర‌కు మాత్ర‌మే మ‌దుపు చేసే వీలుంటుంది. అంత‌కు మించిన పెట్టుబ‌డులకు భౌతికంగా కేవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తిచేయవ‌ల‌సి ఉంటుంది. 

త‌క్కువ మొత్తంతో పెట్టుబ‌డులు..

మ్యూచువ‌ల్ పండ్ల‌లో అధిక మొత్తంతోనే పెట్టుబ‌డులు చేయాల్సిన అవ‌స‌రం లేదు. మీ నిధుల ల‌భ్య‌త‌ను అనుస‌రించి చిన్న మొత్తాల‌తో కూడా మ‌దుపు చేయ‌వ‌చ్చు. సిప్ విధానంలో నెల‌కు రూ. 500 చిన్న మొత్తంతో పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు.

లిక్విడిటీ..

మ్యూచువల్ ఫండ్‌లో మ‌దుపు చేయ‌డం వల్ల కలిగే మ‌రో ముఖ్యమైన ప్రయోజనం నిధుల ల‌భ్య‌త‌ (లిక్విడిటీ). మ్యూచువల్ ఫండ్లు విత్‌డ్రాల‌కు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడిదారులు ఏ సమయంలోనైనా యూనిట్‌లను రిడీమ్ (ఉపసంహరణ) చేయవచ్చు. అయితే, ప్రీ-ఎగ్జిట్ పెనాల్టీ, ఎగ్జిట్ లోడ్ (పెట్టుబ‌డి పెట్టిన స‌మ‌యం నుంచి నిర్ణీత స‌మ‌యం లోపు మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ పెట్టుబడుల‌ను ఉప‌సంహించుకుంటే విధించే ఛార్జీల‌ను ఎగ్జిట్ లోడ్ అంటారు. స్కీమ్ ప‌త్రాల్లో ఈ వివ‌రాలు అందుబాటులో ఉంటాయి.) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. యూనిట్స్ ఉపసంహరించుకున్నాక 2-3 రోజుల్లో డబ్బు మీ ఖాతాలోకి చేరుతుంది.

భద్రత, పారదర్శకత..

పెట్టుబ‌డిదారులు రిస్క్ స్థాయిని సుల‌భంగా తెలుసుకునేందుకు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో క‌ల‌ర్ కోడింగ్ వ్య‌వ‌స్థ‌ను సెబీ తీసుకొచ్చింది. దీంతో పెట్టుబడులు పార‌ద‌ర్శ‌కంగా, సుర‌క్షితంగా ఉంటాయి. ఈ క‌ల‌ర్ - కోడింగ్ వ్య‌వ‌స్థ‌లో మూడు రంగులు (నీలం, ప‌సుపు, గోధుమ రంగులు) ఉంటాయి. 

నీలం (Blue) - త‌క్కువ రిస్క్‌ను సూచిస్తుంది. 
ప‌సుపు (Yellow) - మ‌ధ్య‌స్థ రిస్క్‌ను సూచిస్తుంది.
గోధుమ (Brown) - అధిక రిస్క్‌ను సూచిస్తుంది.

అలాగే మ్యూచ‌వ‌ల్ ఫండ్ భ‌ద్ర‌త‌, పార‌ద‌ర్శ‌క‌త‌ను తెలుసుకునేందుకు మ‌దుప‌ర్లు ఫండ్ మేనేజ‌ర్ల‌ అర్హ‌త ప్ర‌మాణాలు, అనుభవం, ఫండ్ హౌస్ పని తీరు, చరిత్రను పరిశీలించవచ్చు. 

పెట్టుబ‌డులు అల‌వాటుగా మారుస్తుంది..

క్రమశిక్షణతో పెట్టుబడులు చేసేందుకు మ్యూచువల్ ఫండ్స్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) స‌హాయ‌ప‌డుతుంది. చిన్న మొత్తాల‌తోనే పెట్టుబ‌డులు చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. పెట్టుబ‌డుల‌ 'ఫ్రీక్వెన్సీ'ని కూడా ఎంచుకోవ‌చ్చు. ప్ర‌తి వారం, నెలవారీ, త్రైమాసికం.. ఇలా పెట్టుబ‌డిదారులు త‌మ‌కు అనుకూల‌మైన కాలావ‌ధిని ఎంచుకోవ‌చ్చు. సిప్‌లో ఆటో-డెబిట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. దీన్ని ఎంచుకుంటే ప్రతి నెలా మీ బ్యాంక్ ఖాతా నుంచి నిర్ణీత మొత్తం ఆటో డెబిట్ అవుతుంది. ప్రతిసారీ మాన్యువల్‌గా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండ‌దు. కాబ‌ట్టి పెట్టుబ‌డుల‌కు అవాంత‌రాలు ఉండ‌వు. 

చివ‌రిగా: మార్కెట్ అనుసంధానిత పెట్టుబ‌డులను కొత్త‌గా ప్రారంభించేవారికి మ్యూచువ‌ల్ ఫండ్లు మంచి ఎంపిక‌. మీ ల‌క్ష్యం, న‌ష్ట‌భ‌యం, పెట్టుబ‌డుల‌కు ఉన్న స‌మ‌యం ఆధారంగా పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి. పెట్టుబ‌డులు పెట్టే ముందు స్కీమ్‌కి సంబంధించిన అన్ని ప్ర‌తాల‌ను చ‌దివి పూర్తి స‌మాచారం తెలుసుకోవ‌డం మంచిది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని