Cryptocurrency: ‘క్రిప్టోలతో రిస్క్‌’.. ఇకపై ఈ డిస్‌క్లెయిమర్‌ తప్పనిసరి!

క్రిప్టోకరెన్సీలో మదుపును ప్రోత్సహించే ప్రకటనల్లో ఇకపై ‘డిస్‌క్లెయిమర్లు’ ఉంచాలని ‘అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ASCI)’ ఆదేశించింది.....

Updated : 18 Aug 2022 15:36 IST

ముంబయి: క్రిప్టోకరెన్సీలో మదుపును ప్రోత్సహించే ప్రకటనల్లో ఇకపై ‘డిస్‌క్లెయిమర్లు’ ఉంచాలని ‘అడ్వర్టైజింగ్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ASCI)’ ఆదేశించింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమలు చేయాలని కోరింది. క్రిప్టోలు, ఎన్‌ఎఫ్‌టీలకు సంబంధించిన ఉత్పత్తులు, పథకాలకు సంబంధించిన అన్ని ప్రకటనల్లో కచ్చితంగా హెచ్చరికలు ఉండాలని స్పష్టం చేసింది.

‘‘క్రిప్టో ఉత్పత్తులు, ఎన్‌ఎఫ్‌టీలపై ఎలాంటి నియంత్రణా లేదు. ఇవి నష్టభయంతో కూడుకున్నవి. దీనికి సంబంధించిన లావాదేవీల్లో నష్టం వాటిల్లితే రికవరీకి ఎలాంటి నిర్దిష్ట ప్రక్రియ లేదు’’ అనే అర్థం వచ్చేలా డిస్‌క్లెయిమర్లు ఉండాలని ఆస్కీ ఆదేశించింది. ప్రింట్‌ మీడియాలో అయితే, ప్రకటనలో ఐదో వంతు ఉండాలని తెలిపింది. చిన్న వీడియో ప్రకటనల్లో ఐదు సెకండ్లు, సుదీర్ఘ వీడియోల్లో అయితే ప్రారంభంలో ఒకసారి.. చివర్లో మరోసారి డిస్‌క్లెయిమర్‌ తప్పనిసరని స్పష్టం చేసింది. ఆడియో, సోషల్‌ మీడియా పోస్ట్‌లు, వెంటనే అదృశ్యమయ్యే కథనాల వంటి వాటిలో వచ్చే ప్రకటనల్లోనూ డిస్‌క్లెయిమర్లను ఉంచాల్సిందేనని తెలిపింది.

ఒకవేళ ప్రకటనల్లో అక్షరాలపై పరిమితి ఉంటే ‘‘క్రిప్టో ఉత్పత్తులపై ఎలాంటి నియంత్రణా లేదు. ఇవి నష్టభయంతో కూడుకున్నవి’’ అనే అర్థం వచ్చేలా సంక్షిప్త డిస్‌క్లెయిమర్‌ ఇచ్చి.. పూర్తిస్థాయి హెచ్చరికకు లింక్‌ అటాచ్‌ చేయాలని తెలిపింది. ‘కరెన్సీ’, ‘సెక్యూరిటీలు’, ‘కస్టోడియన్‌’, ‘డిపాజిటరీస్‌’ వంటి పదాలను ప్రకటనల్లో వాడొద్దని స్పష్టం చేసింది. గతంలో ఇచ్చిన రాబడి, 12 నెలల కంటే తక్కువ వ్యవధికి సంబంధించిన ప్రతిఫలాలను ఎట్టిపరిస్థితుల్లో ప్రకటనల్లో ప్రదర్శించొద్దని తెలిపింది. రాబడి, లాభాలపై ఎలాంటి పూచీ కూడా ఇవ్వొద్దని స్పష్టం చేసింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయని పాత ప్రకటనలను సైతం ఏప్రిల్‌ 15 తర్వాత పరిగణనలోకి తీసుకోవద్దని మీడియా హౌజ్‌లను ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని