Google Layoffs: ఉద్యోగులకే కాదు.. రోబోలకూ గూగుల్‌ లేఆఫ్‌!

Robot Workers: ఖర్చులను తగ్గించుకోవడానికి రోబోట్లకూ గూగుల్‌ ఉద్వాసన పలికింది. ఎవ్రీడే రోబోల పేరిట గతంలో ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది.

Updated : 25 Feb 2023 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాంద్యం భయాల నేపథ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇటీవల గూగుల్‌ (Google) పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 12 వేలమందికి గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ ఉద్వాసన (Layoffs) పలికింది. అయితే, ఈ లేఆఫ్‌లు కేవలం ఉద్యోగులకే పరిమితం కాలేదు.. రోబోట్లకూ (Robots) వర్తింపజేసింది! ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా.. కేఫ్‌టేరియాలో క్లీనింగ్‌ కోసం ఉద్దేశించి రోబోట్లను పక్కన పెట్టింది. ఇందుకు సంబంధించి ప్రాజెక్ట్‌ను అర్ధంతరంగా నిలిపివేసింది.

గూగుల్‌ ఎవ్రీడే రోబోట్స్‌ పేరిట ఓ ప్రాజెక్ట్‌ 2019లో ప్రారంభించింది. ఇందులో భాగంగా 100 రోబోట్లను అభివృద్ధి చేశారు. ఒక చేయి, వీల్స్‌ కలిగిన ఈ రోబోట్లు ఒక చోటు నుంచి మరో చోటుకు సులువుగా వెళ్లగలవు. వీటిని కేఫ్‌టేరియాల్లోని టేబుళ్లు తుడవడానికి, చెత్తను రీసైకిల్‌ చేయడానికి, తలుపులు తెరవడానికి వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో కాన్ఫరెన్స్‌ హాళ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు వీటిని గూగుల్‌ విరివిగా ఉపయోగించుకుంది.

అయితే, రోబోట్లను నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్‌ ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. ఎవ్రీడే రోబోట్స్‌ ప్రాజెక్ట్‌ లాభదాయకం కాదని భావించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేసింది. ‘ఎవ్రీడే రోబోట్స్‌ ప్రాజెక్ట్‌ ఇక ఏమాత్రం అల్ఫాబెట్‌లో ప్రత్యేక ప్రాజెక్ట్‌గా ఉండబోదు’ అని గూగుల్‌ మార్కెటింగ్‌, కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ డెనిస్‌ గంబోవా పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ కోసం వినియోగించిన సాంకేతికతను, టీమ్‌ను గూగుల్‌ రీసెర్చిలో భాగంగా ఉన్న వేరే రోబోటిక్‌ ప్రాజెక్ట్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని టెక్‌ కంపెనీలూ పొదుపుమంత్రం జపిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని