AGI Greenpac: అధునాతన సాంకేతికతపై రూ.230 కోట్ల పెట్టుబడులు

అధిక నాణ్యత ఉన్న గాజు ప్యాకేజింగ్‌ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు రూ.230 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌ వెల్లడించింది.

Published : 04 Jul 2024 02:57 IST

ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌

ఈనాడు, హైదరాబాద్‌: అధిక నాణ్యత ఉన్న గాజు ప్యాకేజింగ్‌ ఉత్పత్తులకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని, అందుకు తగ్గట్లుగా సిద్ధం అయ్యేందుకు రూ.230 కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతున్నట్లు ఏజీఐ గ్రీన్‌ప్యాక్‌ వెల్లడించింది. ఈ మొత్తంతో ఫర్నెస్‌లను ఆధునికీకరించడంతోపాటు, ఐఓటీ లాంటి ఆధునిక సాంకేతికతలను అమలు చేయనున్నట్లు సంస్థ సీఈఓ రాజేశ్‌ ఖోస్లా తెలిపారు. పశ్చిమాసియా దేశాల్లో ఈ ఉత్పత్తులకు గిరాకీ ఉందని, ఇప్పటికే అమెరికా, కెనడాలకు ఎగుమతి చేస్తున్నట్లు వివరించారు. వినూత్న, అధిక నాణ్యత గల గాజు ప్యాకేజింగ్‌ ఉత్పత్తులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలోని భువనగిరిలో ఉన్న ప్లాంటులో రోజుకు 154 టన్నుల స్పెషాలిటీ గ్లాస్‌ ఉత్పత్తి జరుగుతోందన్నారు. పలు రంగుల్లోనూ గాజు సీసాలను ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. 3 మిల్లీ లీటర్ల నుంచి 6 లీటర్ల సామర్థ్యం వరకూ తమ ఉత్పత్తులున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా గాజు గ్లాసు ప్యాకేజింగ్‌ మార్కెట్‌ ప్రస్తుతం రూ.5 లక్షల కోట్ల స్థాయిలో ఉందని, 2030 నాటికి ఇది రూ.8 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. గాజు సీసాల పరిశ్రమ ఏటా 25% వృద్ధిని సాధిస్తోందని తెలిపారు. పర్యావరణంపై అవగాహనకు అనుగుణంగా, గాజు ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా హిందుస్థాన్‌ నేషనల్‌ గ్లాస్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతానికి ఈ విషయం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. తెలంగాణలోని మూడు ప్లాంట్లలో కలిసి 4000 మంది పనిచేస్తున్నారన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2,421 కోట్ల ఆదాయం సాధించినట్లు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20% వృద్ధి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని