AI: 30కోట్ల ఉద్యోగాలపై ‘ఏఐ’ ప్రభావం.. గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా..!

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సాంకేతికతలో కనిపిస్తోన్న పురోగతి 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ (Goldman Sachs) అంచనా వేసింది. అయితే, సాంకేతికత పురోగతితో కొత్త ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్పాదకతకు మరింత ఊతమిస్తుందని తెలిపింది. 

Published : 29 Mar 2023 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధలో (Artificial Intelligence) ఇటీవల కనిపిస్తోన్న పురోగతి ఎన్నో రంగాలపై ప్రభావం చూపనుందనే ఆందోళన ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇవి చాలా రంగాల్లో ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేయగలవనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌ (Goldman Sachs) కూడా తాజా నివేదికలో ఇటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) సాంకేతికతలో వస్తోన్న నూతన ఒరవడులు 30కోట్ల ఉద్యోగాలపై ప్రభావం చూపొచ్చని అంచనా వేసింది. ‘ఆర్థికప్రగతిపై కృత్రిమ మేధ ప్రభావాల ముప్పు’ పేరుతో చేసిన పరిశోధనలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఈ అంశాలు వెల్లడించింది.

పెరగనున్న ఉత్పాదకత..

‘కృత్రిమ మేధ అంచనాలకు అనుగుణంగా తన ఉత్పాదక సామర్థ్యాలను నెరవేరిస్తే కనుక శ్రామిక రంగంలో మాత్రం ఒడిదొడుకులు ఉంటాయి. అమెరికా, యూరప్‌లలో వృత్తిపరమైన పనుల సమాచారాన్ని విశ్లేషించి చూస్తే అక్కడ ప్రస్తుతమున్న ఉద్యోగాల్లో మూడోవంతు ఆటోమేషన్‌కు ప్రభావితమవుతాయి. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్నోరకాల పనులకు కృత్రిమ మేధ ప్రత్యామ్నాయంగా మారుతుంది’ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ పేర్కొంది. అయితే, సాంకేతికత పురోగతి అంటేనే కొత్తగా ఉపాధి అవకాశాలు పెరగడంతోపాటు ఉత్పాదకతకు మరింత ఊతమని తెలిపింది. తద్వారా ప్రపంచ జీడీపీని 7శాతానికి పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని అంచనా వేసింది.

చాట్‌జీపీటీ (ChatGPT) వంటి అధునాతన కృత్రిమ మేధ వ్యవస్థలు మానవుల మాదిరిగానే కంటెంట్‌ను సృష్టించగలవని.. వచ్చే దశాబ్దిలో ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. ప్రస్తుతం 60శాతం మంది చేస్తున్న పనులు 1940ల్లో అసలు ఉనికిలోనే లేవని తాజా నివేదిక వెల్లడించింది. 1980 తర్వాత సాంకేతికతలో వచ్చిన మార్పుల వల్ల కలిగిన ఉద్యోగాల సృష్టితో పోలిస్తే వాటి స్థానభ్రంశమే వేగంగా జరిగిన విషయాన్ని ప్రస్తావించింది. జనరేటివ్‌ ఏఐ పురోగతి మునుపటి ఐటీ మాదిరిగా ఉంటే మాత్రం.. రానున్న రోజుల్లో ఉపాధి అవకాశాలను తగ్గించనుందని తాజా నివేదికలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ వెల్లడించింది.

ఏయే రంగాల్లో ప్రభావం..

కృత్రిమ మేధతో ఉద్యోగాల ప్రభావం అనేది ఆయా రంగాల్లో వేర్వేరుగా ఉందని తాజా నివేదిక వెల్లడించింది. అత్యధికంగా కార్యనిర్వహణ, న్యాయ రంగాల్లో ఈ ప్రభావం ఉందని తెలిపింది. అడ్మినిస్ట్రేటివ్‌ రంగంలో 46శాతం, లీగల్‌ ఉద్యోగాల్లో 44శాతం ముప్పు పొంచివుందని పేర్కొంది. నిర్వహణ, ఇన్‌స్టాలేషన్‌, రిపేర్‌, నిర్మాణ రంగ ఉద్యోగాలకు మాత్రం ఏఐతో తక్కువ ప్రభావం ఉండనుందని చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు