AI Express - Air Asia: ఎయిరిండియా , ఎయిర్‌ ఏషియా టికెట్లు ఇకపై ఒకే వెబ్‌సైట్‌లో

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express), ఎయిర్‌ ఏషియా (Air Asia) దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్‌ బుకింగ్‌, చెక్‌-ఇన్‌లను ప్రయాణికులు ఇకపై ఒకే వెబ్‌సైట్‌ ద్వారా చేయొచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 

Published : 28 Mar 2023 19:07 IST

దిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express), ఎయిర్‌ ఏషియా (Air Aisa) విమానాల్లో ప్రయాణించే వారు ఇకపై ఒకే వెబ్‌సైట్‌ నుంచి టికెట్‌ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ (Air India Express) ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సోమవారం నుంచి ప్రయాణికులకు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది అక్టోబరులో ఎయిర్‌ ఏషియాలో వాటాలను ఎయిరిండియా కొనుగోలు చేసింది. ఈ ఏడాది మొదట్లో రెండు కంపెనీల బాధ్యతలను ఒకే సీఈవో పరిధిలోకి తీసుకొచ్చింది. 

‘‘ఎయిరిండియా, ఎయిర్‌ ఏషియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు సంబంధించి టికెట్‌ బుకింగ్‌, చెక్‌-ఇన్‌లను ప్రయాణికులు ఎయిరిండియాఎక్స్‌ప్రెస్.కామ్‌ (airindiaexpress.com) వెబ్‌సైట్‌ ద్వారా చేయొచ్చు. దాంతోపాటు కస్టమర్‌ సపోర్ట్‌, సోషల్‌ మీడియాలు కూడా రెండు సంస్థలకు ఒకటే ఉంటాయి. ఎయిర్‌ ఏషియా కలయికతో కొత్తగా ఏర్పడిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఇకపై సరసమైన ధరలకు విమాన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. దీనివల్ల దేశీయంగా నగరాల మధ్య అనుసంధానం మెరుగవడటంతోపాటు, అంతర్జాతీయ నెట్‌వర్క్ పరిధి కూడా విస్తరిస్తుంది. ప్రస్తుతం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ తక్కువ ధరలకే దేశీయ, అంతర్జాతీయ సర్వీసులను నిర్వహిస్తుంది. తాజా నిర్ణయం లో-కాస్ట్‌ క్యారియర్‌ (LCC) విభాగంలో కంపెనీకి మరింత బలమైన మార్కెట్‌ను ఇస్తుంది’’ అని ఎయిరిండియా సీఈవో, ఎండీ, క్యాంప్‌బెల్‌ విల్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఎయిర్‌ ఏషియా దేశీయంగా 19 నగరాలకు విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ 14 అంతర్జాతీయ సర్వీసులను నడుపుతోంది. గతేడాది టాటా గ్రూప్‌ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటా గ్రూప్‌ ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఏషియా, విస్తారా విమానయాన సంస్థలను నిర్వహిస్తోంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు