Mahendra Group: కొత్త వ్యాపారాల్లో అయిదింతల వృద్ధి లక్ష్యం

వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు, సీఈఓ అనిశ్‌ షా తెలిపారు.

Updated : 16 Jun 2024 03:48 IST

మహీంద్రా గ్రూపు ఎండీ అనిశ్‌ షా

దిల్లీ: వ్యాపారాల విలువను గణనీయంగా పెంచుకోవడంపై మహీంద్రా గ్రూపు దృష్టి సారిస్తోందని ఆ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టరు, సీఈఓ అనిశ్‌ షా తెలిపారు. రాబోయే దశాబ్ద కాలంలో భారత వృద్ధిలో 70% వరకు వాటా ఉండొచ్చని భావిస్తున్న వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొన్నారు. ఫలితంగా 2030కు తమ గ్రూప్‌ విలువ ఎంతో పెరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే అయిదేళ్లలో కొత్త వ్యాపారాల విలువను 5 రెట్లు పెంచుకోవాలన్నది మహీంద్రా గ్రూపు లక్ష్యమని షా వెల్లడించారు. ‘వృద్ధి రత్నాలు’గా భావిస్తున్న ఈ కొత్త వ్యాపారాల విలువ 2024 మార్చి నాటికి 4.2 బిలియన్‌ డాలర్లుగా (సుమారు     రూ.35,000 కోట్లు) ఉంది. ‘ప్రస్తుతం మా కంపెనీలన్నీ విపణిలో బలమైన స్థితిలో ఉన్నాయి. ప్రతి ఒక్కటి విలువను పెంచుకోగలిగిన సామర్థ్యమున్న కంపెనీలే అని పీటీఐ ఇంటర్వ్యూలో షా తెలిపారు. ఆయనేమన్నారంటే..

ఆ కంపెనీలు బలమైనవే కానీ..

వాహన (ఆటోమొబైల్‌), వ్యవసాయ సామగ్రి (ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌) విభాగాలు మార్కెట్‌లో అగ్రగామిగా ఎదిగేందుకు అడుగులు వేస్తున్నాయి. టెక్‌ మహీంద్రా, మహీంద్రా ఫైనాన్స్‌ పూర్తి సామర్థ్యాన్ని కనబర్చాల్సిన అవసరం ఉంది. కొన్నేళ్లుగా ఈ కంపెనీల పనితీరు.. పరిశ్రమ తీరు కంటే తక్కువగా ఉంది. మహీంద్రా ఫైనాన్స్‌ మరో ఏడాదిలో పూర్తిగా పుంజుకుంటుంది. టెక్‌ మహీంద్రా కూడా రాణిస్తోంది.

‘వృద్ధి రత్నాల’ విలువ 5 రెట్లు 

మహీంద్రా గ్రూపు ‘వృద్ధి రత్నాలు’గా భావిస్తున్న కంపెనీల మొత్తం విలువ గత నాలుగేళ్లలో 5 రెట్లు పెరిగింది. 2020 మార్చి నాటికి ఈ కంపెనీల మొత్తం విలువ 0.8 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6,500 కోట్లు) కాగా.. 2024 మార్చి నాటికి 4.2 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.35,000 కోట్ల)కు చేరింది. వచ్చే ఐదేళ్లలో వీటి విలువ మరో 5 రెట్లు పెరగాలని అనుకుంటున్నామని షా తెలిపారు.

మహీంద్రా గ్రూపు 10 ’వృద్ధి రత్నాల’ కంపెనీల్లో 3 స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. అవి లైఫ్‌స్పేస్, లాజిస్టిక్, హాలిడేస్‌ కంపెనీలు.

లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ, ఫామ్‌ మెషినరీ (వ్యవసాయ సామగ్రి), ఎయిరోస్ట్రక్చర్స్, క్లాసిక్‌ లెజెండ్స్, సస్టెన్‌ (సౌర వ్యాపారం), యాక్సెలో (వాహన రీసైక్లింగ్‌ వ్యాపారం), కార్‌ అండ్‌ బైక్‌ వ్యాపారాలు నమోదు కాలేదు.

ఐపీఓకు ఆ కంపెనీ 

‘యాక్సెలో’ కంపెనీని పబ్లిక్‌ ఇష్యూకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. వాహన పరిశ్రమలో డీకార్బనైజింగ్‌ కార్యకలాపాలను ఈ కంపెనీ నిర్వహిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూకు గడువు నిర్దేశించుకోలేదు. విలువ పెంచుకోవడంపైనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నాం. ‘తొలుత స్వతంత్రంగా నిలదొక్కుకోవాలి. ఓ పెద్ద వ్యాపార సంస్థగా మారాకే, స్టాక్‌ మార్కెట్లో నమోదుపై యోచిస్తాం’ అని షా వివరించారు.

అలాగైతేనే కొత్త వ్యాపారాల్లోకి.. 

‘కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశిస్తామని మా మదుపర్లకు సంకేతమిచ్చాం. కానీ ఇంకా స్పష్టత రాలేదు. మేం అడుగుపెట్టే ఆ వ్యాపారం/విభాగం మాకు మరింత విలువను జత చేయగలగాలి. పరిశ్రమకు మించి ప్రతిఫలాన్ని సృష్టించగలగాలి. గ్రూపు నిర్దేశించుకున్న ప్రమాణాలు, సూత్రాలను అందుకోవాలి. అలాగైతేనే వాటిల్లోకి మేం అడుగుపెడతాం’ అని షా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని