Patanjali group | ఐదేళ్లలో నంబర్‌.1 కావడమే లక్ష్యం: బాబా రామ్‌దేవ్‌

పతంజలి ఆయుర్వేద గ్రూప్‌ (Patanjali group), దాని అనుబంధ సంస్థ రుచి సోయా (Ruchi Soya)ను రాబోయే ఐదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ రంగంలో అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని కంపెనీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాబా రామ్‌దేవ్‌ వివరించారు.

Published : 24 Mar 2022 20:35 IST

దిల్లీ: పతంజలి ఆయుర్వేద గ్రూప్‌ (Patanjali group), దాని అనుబంధ సంస్థ రుచి సోయా (Ruchi Soya)ను రాబోయే ఐదేళ్లలో ఎఫ్‌ఎంసీజీ రంగంలో అగ్రస్థానంలో నిలపడమే తమ లక్ష్యమని కంపెనీ నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బాబా రామ్‌దేవ్‌ వివరించారు. ప్రస్తుతం ఈ రెండు కంపెనీల టర్నోవర్‌ రూ.35వేల కోట్లుగా ఉందని తెలిపారు. రుచి సోయా ఎఫ్‌పీవో (ఫాలో ఆన్‌ ఆఫర్‌)కు వచ్చిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కంపెనీ భవిష్యత్‌ లక్ష్యాలను వివరించారు.

పతంజలి ఆయుర్వేద, రుచి సోయాను భారత దేశంలోనే అతిపెద్ద ఫుడ్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా నిలపడమే లక్ష్యమని బాబా రామ్‌దేవ్‌ తెలిపారు. ప్రస్తుతం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ తర్వాత రెండో అతిపెద్ద ఫుడ్‌, ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా ఉందని పేర్కొన్నారు. అలాగే, పతంజలి గ్రూప్‌కు చెందిన మరిన్ని కంపెనీలను ఐపీఓకు తీసుకురానున్నట్లు చెప్పారు. అయితే, ఎప్పుడు తీసుకొచ్చేదీ వెల్లడించలేదు. రాబోయే కొన్ని నెలల్లో పతంజలి ఆయుర్వేదకు ఉన్న మొత్తం ఫుడ్‌ బిజినెస్‌ను రుచి సోయాకు బదిలీ చేయనున్నామని తెలిపారు. కేవలం ఆహారేతర, సంప్రదాయ ఔషధాలు, సౌందర్య ఉత్పత్తులు తయారు చేసే సంస్థగా పతంజలి ఆయుర్వేద కార్యకలాపాలు నిర్వహిస్తుందని రామ్‌దేవ్‌ పేర్కొన్నారు.

మార్కెట్‌లోకి రుచి సోయా ఎఫ్‌పీఓ

పతంజలి ఆయుర్వేద్‌ గ్రూప్‌ నియంత్రణలోకి వచ్చిన వంటనూనెల సంస్థ రుచి సోయా ఇండస్ట్రీస్‌ రూ.4,300 కోట్ల ఎఫ్‌పీఓ గురువారం ప్రారంభమైంది. మార్చి 28తో ఇష్యూ ముగుస్తుంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణిని రూ.615-650గా నిర్ణయించారు. ఈ సందర్భంగా బాబా రామ్‌దేవ్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే యాంకెర్‌ ఇన్వెస్టర్ల ద్వారా రూ.1290 కోట్లు సమీకరించినట్లు తెలిపారు. బ్రాండ్‌పై ఉన్న నమ్మకం వల్ల ఇష్యకూ మదుపరుల నుంచి అనూహ్య స్పందన వస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.

ఎఫ్‌పీఓ ద్వారా వచ్చిన మొత్తంలో రూ.3,300 కోట్లు రుణాలు తీర్చడానికి ఉపయోగిస్తామని చెప్పారు. దీనివల్ల రుచి సోయా రుణ రహిత సంస్థగా అవతరిస్తుందని పేర్కొన్నారు.మదుపరులకు మంచి రాబడులు అందించాలన్న ఉద్దేశంతోనే మార్కెట్‌ ధరకంటే తక్కువ ధరను నిర్ణయించినట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రుచి సోయాలో 98.9 శాతం వాటా కలిగిన పతంజలి ఈ ఇష్యూ ద్వారా 18-19 శాతం వాటాను విక్రయించనుంది. కంపెనీలో 25 శాతం వాటాను ప్రజలకు కేటాయించాలన్న సెబీ నిబంధన చేరుకోవడానికి రుచి సోయాలో మరో 6-7 శాతం వాటాను పతంజలి యాజమాన్యం తగ్గించుకోవాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని