Air India: అలా ‘ఎయిరిండియా’గా పేరు పెట్టాం.. వెల్లడించిన టాటా గ్రూప్‌

ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ ఇటీవల టాటాల వశమైన విషయం తెలిసిందే. దాదాపు 69 ఏళ్ల తర్వాత ఈ సంస్థ యాజమాన్య హక్కులు అధికారికంగా టాటా గ్రూప్‌నకు బదిలీ అయ్యాయి. ఈ క్రమంలోనే సంస్థ పేరు ‘ఎయిరిండియా’ వెనుక ఉన్న ఆసక్తికర...

Published : 06 Feb 2022 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’ ఇటీవల టాటాల వశమైన విషయం తెలిసిందే. దాదాపు 69 ఏళ్ల తర్వాత ఈ సంస్థ యాజమాన్య హక్కులు అధికారికంగా టాటా గ్రూప్‌నకు బదిలీ అయ్యాయి. ఈ క్రమంలోనే సంస్థ పేరు ‘ఎయిరిండియా’ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను టాటా గ్రూప్‌ తాజాగా ట్విటర్‌లో పంచుకుంది. ఈ విశేషాలను పొందుపరిచిన ‘టాటా మంత్లీ బులెటిన్’ను ఉటంకిస్తూ ఆదివారం వరుస ట్వీట్లు చేసింది. వీటి ప్రకారం.. టాటా సన్స్‌ విభాగంగా ఉన్న టాటా ఎయిర్‌లైన్స్‌ను 1946 ప్రారంభంలో ఒక కొత్త కంపెనీగా విస్తరించినప్పుడు.. దానికో పేరు పెట్టేందుకు యాజమాన్యానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తొలుత నాలుగు పేర్లను పరిశీలనలో తీసుకున్నారు. అవి.. ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా, పాన్-ఇండియన్ ఎయిర్‌లైన్స్, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్‌లైన్స్.

తదనంతరం టాటా సంస్థ అధినేత ప్రజాస్వామ్య భావనను పరిగణనలోకి తీసుకుని.. నాలిగింటిలో ఒక పేరును ఎంపిక చేసేందుకు ఉద్యోగుల అభిప్రాయ సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే బాంబే హౌస్‌లో టాటా ఉద్యోగులతో ఓటింగ్‌ ప్రక్రియ చేపట్టారు. ఓటింగ్‌ పేపర్లపై మొదటి, రెండో ప్రాధాన్యాలను నమోదు చేయాలని చెప్పారు. మొదటి లెక్కింపులో ఎయిరిండియాకు 64, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 51, ట్రాన్స్-ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 28, పాన్-ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 19 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత చివరి రెండు పేర్లు తొలగించి.. ఫైనల్‌ కౌంట్‌ చేపట్టారు. ఇందులో ఎయిరిండియాకు 72 ఓట్లు, ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు 58 ఓట్లు వచ్చాయి. దీంతో సంస్థకు ‘ఎయిరిండియా’గా పేరు ఖరారు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని