Air India: టాటాల చేతికి ఎయిరిండియా.. అధికారికంగా అప్పగించిన ప్రభుత్వం

ప్రధాని మోదీతో టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ భేటీ అయ్యారు. ఎయిరిండియాను అధికారికంగా టాటాలకు అప్పగించే ప్రక్రియలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు సమాచారం.

Updated : 27 Jan 2022 16:49 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) టాటాల వశమైంది. ఎయిరిండియా యాజమాన్య హక్కులను అధికారికంగా టాటా గ్రూప్‌కు (Tata Group) కేంద్రం గురువారం బదలాయించింది. బిడ్డింగ్‌లో ఎయిరిండియాను దక్కించుకున్న టాటా అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అధికారికంగా ఎయిరిండియాను అప్పగించినట్లు దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత్‌ పాండే గురువారం మీడియాకు తెలిపారు. ఎయిరిండియా అప్పగింత ప్రక్రియ పూర్తయినందుకు సంతోషంగా ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు. ప్రపంచస్థాయి సేవలందించేందుకు టాటా గ్రూప్‌ కట్టుబడి ఉందని చెప్పారు. టాటా గ్రూప్‌ ఉద్యోగులుగా మారనున్న ఎయిరిండియా ఉద్యోగులకు సంస్థలోకి ఆహ్వానించారు. ఎయిరిండియా అప్పగింత పట్ల రతన్‌ టాటా కూడా సంతోషం వ్యక్తంచేశారు. అంతకుముందు అప్పగింత ప్రక్రియలో భాగంగా చంద్రశేఖరన్‌ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.

69 ఏళ్ల తర్వాత మళ్లీ

టాటా గ్రూప్‌ టాటా ఎయిర్‌లైన్స్‌ను 1932లో ప్రారంభించింది. 1946లో దాన్ని ఎయిరిండియా పేరు మార్చారు. 1953లో ఎయిరిండియాను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మళ్లీ 69 ఏళ్ల తర్వాత అదే గ్రూప్‌నకు ఎయిరిండియా చేరింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియాను పూర్తి స్థాయిలో విక్రయించేందుకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు గానూ నిర్వహించిన వేలం ప్రక్రియలో టాటా గ్రూప్‌ ముందు వరుసలో నిలిచింది. టాటా గ్రూపు అనుబంధ సంస్థ ట్యాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గతేడాది అక్టోబరు 8న రూ.18,000 కోట్లకు బిడ్డింగ్‌లో ఎయిరిండియాను దక్కించుకుంది. రూ.15,300 కోట్లను రుణాల రూపంలో, మిగిలిన రూ.2,700 కోట్లు నగదు రూపంలో టాటా ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఎయిరిండియాతో పాటు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌.. గ్రౌండ్, కార్గో హ్యాండ్లింగ్‌ సేవలందించే ఏఐ ఎస్‌ఏటీఎస్‌ సంస్థ కూడా టాటాల సొంతమయ్యాయి.

అప్పులకు కన్షార్టియం ఓకే..

మరోవైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎయిరిండియా కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు టాటా సన్స్‌కు రుణాలు ఇచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని కన్షార్టియం అంగీకరించింది. ఎయిర్‌లైన్‌ నిర్వహణకు కావాల్సినంత మేర టర్మ్‌ లోన్స్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్లను అందించేందుకు కన్షార్టియం సూచనప్రాయంగా ఆమోదం తెలిపిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ కన్షార్టియంలో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని