Air India: ఎయిరిండియా ప్రగతి ఆశ్చర్యం కలిగిస్తుంది: సీఈఓ క్యాంబెల్‌

టాటా గ్రూప్‌ తిరిగి ఎయిరిండియా (Air India)ను తమ చేతుల్లోకి తీసుకొని నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సంవత్సరం కాలంగా సాధించిన ప్రగతిని సీఈఓ క్యాంబెల్‌ వివరించారు.

Published : 27 Jan 2023 15:23 IST

దిల్లీ: దేశీయ విమానయాన దిగ్గజ సంస్థ ఎయిరిండియా (Air India) తిరిగి టాటా గ్రూప్ చేతుల్లోకి వెళ్లి నేటికి ఏడాది. గత సంవత్సర కాలంలో ఎంతో పురోగతి సాధించామని ఈ సందర్భంగా కంపెనీ సీఈఓ క్యాంబెల్‌ విల్సన్ అన్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని వ్యాఖ్యానించారు. అలాగే కొత్త విమానాల కొనుగోలు కోసం చరిత్రాత్మక ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు.

భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లు ఎదురవుతాయని క్యాంబెల్‌ ఉద్యోగులకు రాసిన సందేశంలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు సాధించిన లక్ష్యాల కంటే.. ఇకపై లోపాలను ఎలా సవరించుకుంటామనేదే ప్రధానమని హితవు పలికారు. విహాన్‌.ఏఐ పేరిట ఎయిరిండియా (Air India) ఐదేళ్ల ప్రక్షాళనా ప్రణాళికను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా వైడ్‌-బాడీ విమానాల ఇంటీరియర్స్‌ను పునరుద్ధరించడం కోసం 400 మిలియన్‌ డాలర్లు వెచ్చించనుంది.

మొత్తంగా చూస్తే గత 12 నెలల్లో సాధించిన ప్రగతి కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తుందని క్యాంబెల్‌ అన్నారు. ఎయిరిండియా (Air India)లో మార్పులు చేస్తూనే.. ఇతర లక్ష్యాలపైనా దృష్టి సారించామని తెలిపారు. ఎయిరిండియా- ఎయిరేషియా విలీనం, విస్తారా- ఎయిరిండియా విలీనం, కొత్త ఇన్ఫోటెక్‌ సెంటర్‌, ఏవియేషన్ అకాడమీ ఏర్పాటు విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదన్నారు. నిర్వహణలో ఉన్న విమానాల సంఖ్యను 27 శాతం నుంచి 100 శాతానికి పెంచామన్నారు. 16 కొత్త అంతర్జాతీయ విమానయాన మార్గాల్లో సేవల్ని ప్రారంభించామన్నారు. రోజువారీ సగటు ఆదాయం రెట్టింపైందని తెలిపారు. కాల్‌సెంటర్‌లో సిబ్బంది సంఖ్యను సైతం రెండింతలకు పెంచామన్నారు. ఇప్పటి వరకు చేసిందంతా తెరవెనుకే జరిగిందన్నారు. చేయాల్సింది ఇంకా చాలా ఉందని స్పష్టం చేశారు.

ఇటీవల ఎయిరిండియా (Air India) పలు ఇబ్బందులను ఎదుర్కొంది. అంతర్జాతీయ విమాన సర్వీసులో ఓ ప్రయాణికుడి మూత్రవిసర్జన ఘటన తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. సంస్థకు డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. మరోవైపు దాదాపు 500 విమానాల కోసం ఎయిరిండియా బోయింగ్‌, ఎయిర్‌బస్‌తో చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నట్లు తాజాగా ప్రకటించినప్పటికీ.. పూర్తి వివరాలను మాత్రం వెల్లడించలేదు. కొత్త విమానాలకు కావాల్సిన ఇంజిన్లను అందించే సంస్థలతో జరుపుతున్న చర్చల్లో జాప్యం జరుగుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని