Air India: 470 కాదు.. 840 విమానాలు కొనుగోలు: ఎయిరిండియా

ఇప్పటికే ఒప్పందం చేసుకున్న 470 విమానాలతోపాటు భవిష్యత్‌లో మరో 370 విమానాల కొనుగోలు హక్కులు పొందినట్లు  ఎయిరిండియా వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ ముఖ్య అధికారి నిపుణ్‌ అగర్వాల్‌ (Nipun Aggarwal ) పేర్కొన్నారు.

Published : 16 Feb 2023 23:26 IST

దిల్లీ: భారత విమానయాన చరిత్రలో తొలిసారిగా..470 విమానాలను కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన టాటా (TATA) గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియా (Air India) దశాబ్దకాలంలో మరో 370 విమానాలు కొనుగోలు చేసే హక్కును కూడా పొందింది. దీంతో ప్రముఖ విమాన తయారీ సంస్థలు ఎయిర్‌బస్‌ (AirBus), బోయింగ్‌ (Boeing) నుంచి 470 విమానాల కొనుగోలుతో సహా మొత్తం 840 విమానాలు కొన్నట్లవుతుంది. ఈ మేరకు ఎయిరిండియా చీఫ్‌ కమర్షియల్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అధికారి నిపుణ్‌ అగర్వాల్ (Nipun Aggarwal ) వెల్లడించారు. ఎయిరిండియా చరిత్రలో ఇదే అతిపెద్ద కొనుగోలు ఒప్పందమని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వరంగానికి చెందిన ఎయిరిండియాను టాటా సంస్థలు కొనుగోలు చేసిన తర్వాత జరిగిన తొలి ఒప్పందం కూడా ఇదే కావడం గమనార్హం.

ఎయిర్‌బస్‌, బోయింగ్‌ నుంచి 470 విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించిన రోజుల వ్యవధిలోనే నిపుణ్‌ అగర్వాల్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘‘ఎయిరిండియా 470 విమానాలను కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. అంతేకాకుండా మరో 370 విమానాల కొనుగోలు హక్కులను కూడా పొందింది.’’ అని నిపుణ్‌ లింక్డిన్‌లో పోస్టు చేశారు. అంతేకాకుండా దీర్ఘకాలిక ఇంజిన్‌ నిర్వహణ కోసం సీఎఫ్ఎం ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. భారీ స్థాయిలో విమాన కొనుగోలు ప్రక్రియ.. ఎయిరిండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చేందుకు దోహదం చేస్తుందని అగర్వాల్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని ప్రతి నగరాన్ని భారత్‌తో అనుసంధానం చేయాలనే దృఢ సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

విమానాల కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ప్రధాని మోదీ సమక్షంలో మంగళవారం వర్చువల్‌గా నిర్వహించిన కార్యక్రమంలో 470 విమానాలు కొనుగోలు చేయాలని ఎయిరిండియా నిర్ణయించింది. ఇందులో 40 వైడ్‌ బాడీ విమానాలతో పాటు మొత్తం 250 విమానాలను ఎయిర్‌బస్‌ నుంచి కొనుగోలు చేయగా మిగతా 220 విమానాలను బోయింగ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. ఎయిరిండియా తాజా ప్రకటనతో ఎయిరిండియా విమానాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని