Air india VRS: ఎయిరిండియా ఉద్యోగులకు VRS‌.. టాటాల నిర్ణయం

Air India VRS: శాశ్వత ఉద్యోగులకు ఎయిరిండియా స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (VRS)ను ప్రకటించింది.

Updated : 02 Jun 2022 15:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను (Air India) కొనుగోలు చేసిన టాటా గ్రూప్‌.. దాన్ని పునరుద్ధరించే ప్రక్రియను చేపట్టింది. సంస్థలో శాశ్వత ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (VRS)ను ప్రకటించింది. శాశ్వత ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే సంస్థకు కొత్త రక్తాన్ని ఎక్కించేందుకు వివిధ విభాగాల్లో నియామక ప్రక్రియను ప్రారంభించింది.

ఎయిరిండియాలో 20 ఏళ్ల సర్వీసు పూర్తిచేసుకొని 55 ఏళ్లు పైబడిన వారు ఈ వీఆర్‌ఎస్‌ను ఎంచుకోవచ్చు. క్యాబిన్‌ సిబ్బంది అయితే 40 ఏళ్లు పైబడిన వారు తీసుకోవచ్చని వీఆర్‌ఎస్‌ మెమోలో ఎయిరిండియా పేర్కొంది. వీఆర్‌ఎస్‌ను ఎంచుకున్న వారికి ఎక్స్‌గ్రేషియాతో పాటు అదనంగా ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని దానిలో పేర్కొన్నారు. వీఆర్‌ఎస్‌ తీసుకోవాలనుకుంటున్న ఉద్యోగులు జూన్‌ 1 నుంచి జూన్‌ 30 మధ్య తమ ప్రాంతీయ అధికారిని సంప్రదించాలని సూచించారు.

ఓ వైపు శాశ్వత ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ఇస్తున్న ఎయిరిండియా.. అదే సమయంలో రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కేబిన్‌ సిబ్బంది కోసం కోల్‌కతా, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి చోట్ల వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ప్రత్యర్థి కంపెనీలకు చెందిన ఉద్యోగులతో పాటు టాటా గ్రూప్‌లోని మిగిలిన సంస్థల్లో పనిచేస్తున్న నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఎయిరిండియాలోని కీలక పదవుల్లో నియమిస్తోంది. కంపెనీని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతోనే ఈ నియామకాలను చేపడుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి పేర్కొన్నారు. 2019 నవంబర్‌ నాటికి ఎయిరిండియాలో 9,426 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని