Air India: మహిళా పైలట్లు ఎయిరిండియాలోనే అధికం

Female pilots: విమానయాన రంగంలో మహిళా సిబ్బందికి ఎక్కువ ప్రాతినిథ్యం కల్పిస్తున్నట్లు ఎయిరియిండియా తెలిపింది. తమ మొత్తం సిబ్బందిలో 40 శాతం మహిళలేనని పేర్కొంది.

Published : 08 Mar 2023 18:02 IST

దిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ, ప్రస్తుతం టాటాల నేతృత్వంలో ఉన్న ఎయిరిండియాలో (Air India) పనిచేస్తున్న మొత్తం పైలట్లలో 15 శాతం మంది మహిళలే ఉన్నారని ఆ సంస్థ తెలిపింది. అత్యధిక మహిళా పైలట్లు (female pilots) కలిగిన సంస్థ తమదేనని వెల్లడించింది. దేశంలో ఎయిరిండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఆసియా విమాన సంస్థలను టాటా గ్రూప్‌ నడుపుతోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 90కి పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను మార్చి 1 నుంచి కేవలం మహిళా సిబ్బందితో నడుపుతున్నట్లు ఎయిరిండియా తెలిపింది. ఇందులో కేబిన్‌ సిబ్బందితో పాటు కాక్‌పిట్‌ సిబ్బంది కూడా మహిళలేనని పేర్కొంది.

ఎయిరిండియాలో మొత్తం 1825 మంది పైలట్లు ఉండగా.. అందులో 275 (15శాతం) మంది మహిళలే ఉన్నారని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే ఎయిరిండియాలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిలోనూ 40 శాతం వారే ఉన్నారని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యధిక కేబిన్‌ సిబ్బంది, మహిళా పైలెట్లు కలిగిన సంస్థ తమదేనని ఎయిరిండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌, ఎయిర్‌ ఏషియా ఇండియాలోనూ మూడో వంతు సిబ్బంది మహిళలేనని టాటా గ్రూప్‌ తెలిపింది. ఫైనాన్స్‌, కమర్షియల్‌, హ్యూమన్‌ రిసోర్సెస్‌, కస్టమర్‌ హ్యాపీనెస్‌, ఫ్లైట్‌ ట్రైనింగ్‌, టెక్నాలజీ, ఫ్లైట్‌ డిస్పాచ్‌, ఇంజినీరింగ్‌, సేఫ్టీ, ఆపరేషన్స్‌ కంట్రోల్‌ తదితర అన్ని విభాగాల్లోనూ మహిళలు కీలక భూమిక పోషిస్తున్నారని టాటా గ్రూప్‌ తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని