Air India jobs: ఎయిరిండియాలో 1000కి పైగా పైలట్ల నియామకాలు

Air India pilot jobs: టాటాల నేతృత్వంలోని ఎయిరిండియా వెయ్యి మందికి పైగా పైలట్లను నియమించుకోనుంది. ఇందుకోసం ఓ ప్రకటనను వెలువరించింది.

Published : 27 Apr 2023 14:00 IST

Air India jobs | దిల్లీ: టాటా గ్రూప్‌నకు (Tata group) చెందిన విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) భారీగా పైలట్లను నియమించుకోనుంది. కెప్టెన్లు, ట్రైనర్లు కలుపుకొని మొత్తం వెయ్యి మందికి పైగా పైలట్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకకు గురువారం ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువరించింది. ఎయిరిండియా తన విమానాల సంఖ్యను, నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించాలన్న నిర్ణయం నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను టాటా గ్రూప్‌ గతేడాది కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సంస్థను లాభాల్లోకి తీసుకురావడంతో పాటు నెట్‌వర్క్‌ను విస్తరించాలని టాటా గ్రూప్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇటీవల పెద్ద సంఖ్యలో విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ పెట్టింది. ఎయిర్‌ బస్‌ నుంచి 250, బోయింగ్‌ నుంచి 220 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మరికొన్నేళ్లలో ఈ విమానాలు అందుబాటులోకి ఆనున్నాయి. ఈ నేపథ్యంలో పైలట్ల నియామకానికి ఎయిరిండియా సిద్ధమైంది. భవిష్యత్తులో 500 విమానాలు అందుబాటులోకి రానున్నాయని, A320, B777, B787, B737 విమానాల కోసం కెప్టెన్లు, ఫస్ట్‌ ఆఫీసర్లు నియమించుకోనున్నామని ఎయిరిండియా తన ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు పైలట్లకు సంబంధించి వేతన విధానాన్ని, సర్వీసు కండీషన్లను మారుస్తూ ఇటీవల ఎయిరిండియా తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోంది. పైలట్లతో పాటు కేబిన్‌ సిబ్బందికి సంబంధించి వేతన విధానంలో ఏప్రిల్‌ 17న ఎయిరిండియా మార్పులు చేసింది. ఈ నిర్ణయాన్ని ఇండియన్‌ కమర్షియల్‌ పైలట్స్‌ అసోసియేషన్‌ (ICPA), ఇండియన్‌ పైలట్స్‌ గిల్డ్‌ (IPG) సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని