Air India: యూకే, యూఎస్‌కు ఎయిరిండియా అదనపు విమాన సర్వీసులు

అమెరికా, బ్రిటన్‌కు అదనపు విమాన సర్వీసులు నడపాలని ఎయిరిండియా నిర్ణయించింది. బర్మింగ్‌హామ్‌, లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోకు వారానికి 20 చొప్పున అదనపు విమానాలు అందుబాటులోకి రానున్నాయి.

Updated : 30 Sep 2022 15:04 IST

దిల్లీ: అంతర్జాతీయ విమాన సేవల విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు టాటాల నేతృత్వంలోని ఎయిరిండియా (Air India) సిద్ధమైంది. ఇందులో భాగంగా అమెరికా, బ్రిటన్‌కు అదనపు విమాన సర్వీసులు నడపాలని నిర్ణయించింది. దీంతో బర్మింగ్‌హామ్‌, లండన్‌, శాన్‌ఫ్రాన్సిస్కోకు వారానికి 20 చొప్పున అదనపు విమానాలు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో బర్మింగ్‌హామ్‌కు 5, లండన్‌కు 9, శాన్‌ఫ్రాన్సిస్కోకు 6 విమానాలు బయల్దేరతాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. దీని వల్ల అదనంగా 5వేల సీట్లు అందుబాటులోకి రానున్నాయని పేర్కొంది.

యూకేకు ప్రస్తుతం వారానికి 34 విమాన సర్వీసులను ఎయిరిండియా నడుపుతోంది. సంస్థ తాజా నిర్ణయంతో ఆ సంఖ్య 48కి చేరనుంది. బర్మింగ్‌హామ్‌కు వెళ్లే ఐదు సర్వీసుల్లో దిల్లీ నుంచి మూడు, అమృత్‌సర్‌ నుంచి రెండు విమానాలు బయల్దేరనున్నాయి. లండన్‌కు వెళ్లే 9 అదనపు విమానాల్లో ముంబయి నుంచి 5, దిల్లీ నుంచి 3, అహ్మదాబాద్‌ నుంచి 1 చొప్పున అందుబాటులోకి రానున్నాయి. దీంతో భారత్‌కు చెందిన 7 నగరాల నుంచి లండన్‌కు నాన్‌స్టాప్‌ విమానాలు అందుబాటులోకి వచ్చాయని ఎయిరిండియా తెలిపింది.

అమెరికాకు వారానికి 34 విమానాలను ఎయిరిండియా నడుపుతుండగా.. తాజాగా ఆ సంఖ్య 40కి చేరనుంది. శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లే అదనపు విమానాల్లో ముంబయి, బెంగళూరు నుంచి వారానికి మూడు రోజుల చొప్పున విమానాలు బయల్దేరతాయి. ఈ విమాన సర్వీసులను అక్టోబర్‌ డిసెంబర్‌ మధ్య దశలవారీగా ప్రవేశపెట్టనున్నట్లు ఎయిరిఇండియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని