Air India: జులై నుంచి ఎంపిక చేసిన దేశీయ మార్గాల్లో ప్రీమియం ఎకానమీ సేవలు: ఎయిర్‌ ఇండియా

దేశీయ మార్గంలో ప్రయాణించే ఎయిర్‌ ఇండియా విమానాల్లో సరికొత్త శ్రేణిని ప్రవేశపెట్టనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.  

Published : 19 Jun 2024 15:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయంగా ఎంపిక చేసిన కొన్ని మార్గాల్లో జులై నుంచి ప్రీమియం ఎకానమీ సేవలు ఆరంభిస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా (Air India ) ఓ ప్రకటనలో తెలియజేసింది. దేశీయ సంస్థల్లో ప్రస్తుతం విస్తారా మాత్రమే డొమెస్టిక్‌ మార్గాల్లో ఈ శ్రేణి సేవలు అందిస్తోంది. ఇప్పటికే మూడు శ్రేణుల కాన్ఫిగరేషన్‌తో రెండు ఏ320 నియో విమానాల్లో మార్పులు చేయించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. వీటిల్లో 8 బిజినెస్‌ క్లాస్‌, అదనపు లెగ్‌ రూమ్‌లతో మరో 24 ప్రీమియం ఎకానమీ, 132 ఎకానమీ సీట్లు ఉండనున్నట్లు వెల్లడించింది. తమ అతిథులకు మెరుగైన ఆప్షన్లు ఉండాలనే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు  సంస్థ పేర్కొంది. 

తమ చిన్న శ్రేణి విమానాల్లో తొలిసారి ఎయిర్‌ ఇండియా ఇటువంటి సేవలను అందుబాటులోకి తెచ్చింది. ‘‘మా విమానాల్లో ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చేలా చిన్నశ్రేణి విమానాల్లో ఇంటీరియర్‌లో మార్పులు చేసి త్రీక్లాస్‌ క్యాబిన్‌ను అందుబాటులోకి తెచ్చాం’’ అని ఎయిర్‌ ఇండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ పేర్కొన్నారు.

కంపెనీ నిర్వహిస్తున్న దేశీయ, స్వల్పదూరం ప్రయాణించే అంతర్జాతీయ విమానాల్లో ఈ సౌకర్యాలను తొలుత అప్‌గ్రేడ్‌ చేయనున్నాయి. వీటిల్లో ఎయిర్‌ బస్‌ ఏ350, బోయింగ్‌ బీ777 విమానాలు ఉండనున్నాయి. ఇక పెద్ద విమానాల్లో రానున్న రెండేళ్లలో ఇటువంటి అప్‌గ్రేడ్లు చేసే అవకాశం ఉంది. 

వచ్చే ఏడాదిలోపు ఎయిర్‌ ఇండియా త్రీక్లాస్‌ కాన్ఫిగరేషన్‌ను మొత్తం చిన్న ఆకారం విమానాల్లో సిద్ధం చేయాలని ప్లాన్‌ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న విమానాలను మెల్లగా రీఫిటింగ్‌కు పంపనున్నారు. కొత్తగా వచ్చేవి మాత్రం త్రీక్లాస్‌ కాన్ఫిగరేషన్‌తోనే వస్తాయి. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని