Airtel 5G: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలు ప్రారంభం

Airtel 5G Now in Vizag: విశాఖ వాసులకు 5జీ సేవలు (Airtel 5G Plus) అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది. దశలవారీగా నగరమంతా ఈ సేవలను విస్తరిస్తామని పేర్కొంది.

Published : 22 Dec 2022 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశాఖ (Visakhapatnam) వాసులకు గుడ్‌న్యూస్‌. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ (Airtel 5G plus) సేవలను నగరంలో ప్రారంభించింది. హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్‌.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో మరో ప్రధాన నగరమైన విశాఖలోనూ ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తమ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన 18వ నగరం విశాఖ అని ఎయిర్‌టెల్‌ తెలిపింది.

విశాఖలోని ద్వారకానగర్‌, బీచ్‌ రోడ్డు, దాబా గార్డెన్స్‌, మద్దిలపాలెం, వాల్తేర్‌ అప్‌ల్యాండ్స్‌, పూర్ణా మార్కెట్‌, గాజువాక జంక్షన్‌, ఎంవీపీ కాలనీ, రాంనగర్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డు, తెన్నేటి నగర్‌ సహా పలు ప్రాంతాల్లో ఈ సేవలు లభిస్తాయని ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. దశలవారీగా నగరంలోని ఇతర ప్రాంతాలకూ సేవలను విస్తరిస్తామని పేర్కొంది.

4జీ సేవలు పొందుతున్న వినియోగదారులు ఉచితంగానే 5జీ సేవలు పొందొచ్చని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న సిమ్‌కార్డు కూడా మార్చాల్సిన అవసరం లేదని పేర్కొంది. 5జీ సపోర్ట్‌తో కూడిన మొబైల్‌, మీరుంటున్న ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ ఉంటే ఈ సేవలను ఆనందించొచ్చని తెలిపింది. నెట్‌వర్క్‌ సెట్టింగ్స్‌లో 5జీ అని సెలెక్ట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ యాప్‌లో సైతం మీ మొబైల్‌ 5జీకి సపోర్ట్‌ చేస్తుందా? మీ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ ఉందా? అనే వివరాలు తెలుసుకోవచ్చని ఎయిర్‌టెల్‌ పేర్కొంది. వైజాగ్‌లో 5జీ సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందని, మరిన్ని నగరాలకు ఈ సేవలను విస్తరిస్తామని ఎయిర్‌టెల్‌ ఏపీ, తెలంగాణ సీఈఓ శివన్‌ భార్గవ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని