Spectrum: చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే ఎయిర్‌టెల్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖ

ముందస్తు చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే భారతీ ఎయిర్‌టెల్‌కు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం’ నుంచి 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖ అందినట్లు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ వెల్లడించారు....

Updated : 18 Aug 2022 12:55 IST

దిల్లీ: ముందస్తు చెల్లింపులు చేసిన గంటల వ్యవధిలోనే భారతీ ఎయిర్‌టెల్‌కు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం’ నుంచి 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖ అందినట్లు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ వెల్లడించారు. చెల్లింపులు చేసిన రోజే ఇలా లేఖ అందడం బహుశా చరిత్రలో ఇదే తొలిసారని ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

‘‘స్పెక్ట్రమ్‌ వాయిదాల కింద ఎయిర్‌టెల్‌ రూ.8,312.4 కోట్లు చెల్లించింది. గంటల వ్యవధిలోనే సంబంధిత ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ల కేటాయింపునకు హామీ ఇస్తూ లేఖ అందింది. స్పెక్ట్రమ్‌తో పాటు ‘ఈ’ బ్యాండ్‌ కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎలాంటి గందరగోళం లేదు. ఆరా తీయడాలు లేవు. ఆఫీసుల చుట్టూ తిరగడాలు లేవు. క్షేత్రస్థాయిలో సులభతర వాణిజ్యానికి ఇది నిదర్శనం. డాట్‌తో నాకున్న 30ఏళ్ల అనుభవంలో మొట్టమొదటిసారి పని ఎలా జరగాలో అలా జరిగింది. పై స్థాయితో పాటు టెలికాంలో ఉన్న నాయకత్వం కృషి ఇది. ఎంత మార్పు! ఈ మార్పుతో దేశమే పరివర్తన చెందుతుంది. భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడానికి అదే ఇంధనంగా మారుతుంది’’ అని మిత్తల్‌ అభిప్రాయపడ్డారు.

భారతీ ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, అదానీ డేటా నెట్‌వర్క్స్‌లు టెలికాం విభాగానికి (డాట్‌) రూ.17,876 కోట్ల ముందస్తు చెల్లింపులు చేశాయి. ఇటీవల కేంద్రం నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొన్న ఈ సంస్థలు రూ.1.5 లక్షల కోట్లకు పైగా విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం 20 వార్షిక వాయిదాల్లో చెల్లింపులు చేసేందుకు టెలికాం సంస్థలకు వీలుంది. అయితే, భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం 4 వార్షిక వాయిదాల మొత్తం రూ.8,312.4 కోట్లను ముందే చెల్లించింది. మిగిలిన సంస్థలు ముందస్తు చెల్లింపులు మాత్రమే జరిపాయి.

5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో 7 రోజుల్లో రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 10 బ్యాండ్‌లలో మొత్తం 72,098 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి ఉంచగా.. 51,236 మెగాహెర్ట్జ్‌ (71 శాతం) మేర విక్రయమైంది. ఎయిర్‌టెల్‌ 700 మెగాహెర్ట్జ్‌ మినహా, వివిధ బ్యాండ్‌లలో 19,867 మెగాహెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లతో కొనుగోలు చేసింది.

5జీ సేవల ప్రారంభానికి సిద్ధంకండి: అశ్వినీ వైష్ణవ్‌

స్పెక్ట్రమ్‌ కేటాయింపు లేఖలపై మిత్తల్‌ స్పందించిన కాసేపటికే కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కూడా మాట్లాడారు. వేలంలో విజయవంతమైన బిడ్డర్లందరికీ.. బకాయిల ముందస్తు చెల్లింపులు చేసిన తొలిరోజే కేటాయింపు లేఖలు అందజేసినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్లు 5జీ సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని