Airtel Black: ఎయిర్‌టెల్‌ కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌.. ఒకే కనెక్షన్‌పై 2 సిమ్‌లు+ ఫ్రీ DTH

Airtel 799 Black postpaid plan Full details: ఎయిర్‌టెల్‌ కొత్త బ్లాక్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ పథకంలో రెండు సిమ్‌ కార్డులు, ఒక డీటీహెచ్‌ కనెక్షన్‌, ఓటీటీ ప్రయోజనాలు లభిస్తాయి.

Published : 25 Mar 2023 18:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ (Airtel) పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం కొత్త బ్లాక్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.799గా నిర్ణయించింది. ఇందులో టెలికాం సర్వీసులతో పాటు డీటీహెచ్‌ సేవలను కూడా పొందొచ్చు. ఎయిర్‌టెల్‌ ప్రీమియం సర్వీసుగా వ్యవహరించే ఈ బ్లాక్‌ ప్లాన్‌లో (Airtel Black) ఓటీటీ సేవలు కూడా లభిస్తాయి. ఎయిర్‌టెల్‌ తీసుకొచ్చిన కొత్త రూ.799 ప్లాన్‌లో రెండు సిమ్‌కార్డులు తీసుకోవచ్చు. ఒక రెగ్యులర్‌ సిమ్‌ కార్డుతోపాటు అదనంగా మరో సిమ్‌ కార్డును పొందొచ్చు. నెలవారీ 105 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత కాల్స్‌, రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు చేసుకోవచ్చు. వాడుకోని డేటా తర్వాతి నెలకు బదిలీ అవుతుంది. రూ.260 విలువ చేసే టీవీ ఛానెళ్లు డీటీహెచ్‌ కనెక్షన్‌ కింద లభిస్తాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌, కొన్ని ఇతర ఓటీటీ సేవలు సైతం ఈ ప్లాన్‌తో పాటు పొందొచ్చు.
Also Read: 500 నగరాలకు ఎయిర్‌టెల్‌ 5జీ సేవలు

బ్లాక్‌ ప్లాన్‌లో భాగంగా పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు వన్‌ బిల్‌- వన్‌ కాల్‌ సెంటర్‌ సేవలు లభిస్తాయి. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక టీమ్‌ ఉంటుంది. కేవలం 60 సెకన్లలోనే కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ అందుబాటులోకి వస్తారు. అలాగే ఫ్రీ సర్వీసు విజిట్లు, ఎయిర్‌టెల్‌ షాప్‌లో బై నౌ- పే లేటర్‌ సదుపాయం వంటివి లభిస్తాయి. ఒకవేళ 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన ప్రాంతాల్లో ఉంటే ఇదే ప్లాన్‌పై అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ఎయిర్‌టెల్‌ పోస్ట్‌పెయిడ్‌ కనెక్షన్‌తో పాటు డీటీహెచ్‌ సైతం వాడేవారు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.
Also Read: క్రికెట్ అభిమానుల కోసం జియో మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్‌

మరోవైపు ఇటీవల కుటుంబ సభ్యులు వినియోగించుకునేందుకు అనువుగా వేర్వేరు పోస్ట్‌పెయిడ్‌ పథకాలను భారతీ ఎయిర్‌టెల్‌ ఆవిష్కరించింది. నెలకు రూ.599-1499 అద్దెపై (జీఎస్‌టీ అదనం) లభించే ఈ పథకాల్లో అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు 105-320 జీబీ డేటా లభించనుంది. కుటుంబంలోని 2-5 మంది సభ్యులు వినియోగించుకోవచ్చు. వినియోగించని డేటాను మరుసటి నెలకు బదిలీ చేసుకునే వీలు, డేటాను కుటుంబసభ్యుల మధ్య పంచుకునే అవకాశాన్ని ఈ పథకాలు కల్పిస్తున్నాయి. రూ.599 పథకాన్ని ఇద్దరు, రూ.999-1199 పథకాలను నలుగురు, రూ.1499 అద్దెపై అయిదుగురు వాడుకోవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ 6నెలల సభ్యత్వం, ఏడాదిపాటు డిస్నీ-హాట్‌స్టార్‌, ఎక్స్‌స్ట్రీమ్‌ మొబైల్‌ ప్యాక్‌ లభిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని