Airtel Tariff Hike: టారిఫ్‌ల పెంపు.. మరోసారి ఎయిర్‌టెల్‌ నుంచి సంకేతాలు!

ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) మరోసారి టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధమవుతోంది. గతేడాది 25 శాతం మేర ఛార్జీలు పెంచిన ఆ సంస్థ.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి ఛార్జీలు సవరించే దిశగా అడుగులు వేస్తోంది.

Published : 27 Sep 2022 16:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌ (Airtel) మరోసారి టారిఫ్‌లు పెంచేందుకు సిద్ధమవుతోంది. గతేడాది 25 శాతం మేర ఛార్జీలు పెంచిన ఆ సంస్థ.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరోసారి ఛార్జీలు సవరించే దిశగా అడుగులు వేస్తోంది. 5జీ స్పెక్ట్రమ్‌ కోసం వెచ్చించిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి రాబట్టేందుకు పెంపు నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. తాజాగా ఆ సంస్థ సీఈఓ గోపాల్‌ విఠల్‌ చేసిన వ్యాఖ్యలూ ఇందుకు బలం చేకూర్చాయి. టెలికాం ఇండస్ట్రీలో ప్రైస్‌ రిపేర్‌ ఇంకా పూర్తి కాలేదని జేపీ మోర్గాన్‌ నిర్వహించిన ఓ సదస్సులో ఆయన వ్యాఖ్యానించారు.

ఒకవేళ టెలికాం సేవల ధరలు పెంచినా వినియోగదారులు అంగీకరిస్తారని గోపాల్‌ విఠల్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. ప్రస్తుతం టెలికాం సర్వీసులు సైతం ప్రజల నిత్యావసరాల్లో ఒకటిగా మారడమే ఇందుకు కారణమని చెప్పారు. 5జీ మానిటైజేషన్‌కు వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం (ARPU) ప్రధానం అని చెప్పారు. దీన్ని పెంచేందుకే ఫీచర్‌ ఫోన్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌, అక్కడి నుంచి పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌, ఎయిర్‌టెల్‌ బ్లాక్‌ తరహా బండిల్‌ ప్లాన్స్‌ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఎయిర్‌టెల్‌ ఆర్పు రూ.183గా ఉంది. ఈ రేటు రూ.200 చేర్చాలన్నది ఎయిర్‌టెల్‌ స్వల్పకాలిక లక్ష్యంగా ఉంది. గతేడాది ఛార్జీల పెంపుతో ఇప్పటికే లక్ష్యానికి చేరువైన ఎయిర్‌టెల్‌.. ఆర్పును రూ.200కు చేర్చేందుకు ఛార్జీలు సవరించబోతున్నట్లు ఈ ఏడాది మొదట్లోనే సంకేతాలిచ్చింది. ఒకవేళ ఎయిర్‌టెల్‌ టారిఫ్‌లను సవరిస్తే మరో టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా సైతం టారిఫ్‌ల పెంపు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు స్పెక్ట్రమ్‌ వేలంలో రూ.43,084 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్న ఎయిర్‌టెల్‌.. అక్టోబర్‌ నెలలో ప్రధాన నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించబోతోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts