World Bank President: ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడి ఎన్నికకు ఇదీ తంతు!

World Bank President Selection Process: ప్రపంచబ్యాంకులో అతిపెద్ద వాటాదారు అమెరికా. ఈ నేపథ్యంలో ఆ దేశం నామినేట్‌ చేసిన వ్యక్తినే అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుండడం సంప్రదాయంగా వస్తోంది. అయినప్పటికీ ఎంపికకు ఓ నిర్ధిష్ట ప్రక్రియను మాత్రం ఫాలో కావాల్సి ఉంటుంది.

Published : 25 Feb 2023 00:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పేద, మధ్యాదాయ దేశాల్లో అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలు సమకూర్చే సంస్థ ప్రపంచ బ్యాంకు (World Bank). ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సమస్యలకు ఆర్థిక పరిష్కారం చూపడమే ఈ సంస్థ లక్ష్యం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ ఆర్థిక సహకారం అందిస్తుంటుంది. అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థకు అధ్యక్షత వహించే అవకాశాన్ని భారత మూలాలున్న అమెరికన్‌ వ్యాపారవేత్త అజయ్‌ బంగా (Ajay Banga) దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ఎలా జరుగుతుందో చూద్దాం..!

ప్రపంచబ్యాంకులో అతిపెద్ద వాటాదారు అమెరికా. ఈ నేపథ్యంలో ఆ దేశం నామినేట్‌ చేసిన వ్యక్తినే బ్యాంకు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డు.. అధ్యక్షుడిగా ఎంపిక చేస్తుండడం సంప్రదాయంగా వస్తోంది. ఒకసారి బోర్డు ఎంపిక చేస్తే ఆ వ్యక్తి అధ్యక్ష పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారు. అయితే, ఎంపిక ప్రక్రియ మరింత పారదర్శకంగా, అనుభవం, ప్రతిభ ఆధారంగా ఉండాలని 2011లో పలు మార్పులు చేశారు.

  • ప్రపంచ బ్యాంకు నిబంధనల ప్రకారం.. అధ్యక్ష అభ్యర్థికి నాయకత్వ హోదాల్లో విజయవంతంగా, సమర్థంగా పనిచేసిన అనుభవం ఉండాలి.

  • అంతర్జాతీయ స్థాయి సంస్థలను నడిపిన అనుభవం ఉండాలి. పబ్లిక్‌ సెక్టార్‌ పనితీరుపై అవగాహన ఉండాలి.

  • ప్రపంచ బ్యాంక్ గ్రూప్ డెవలప్‌మెంట్ లక్ష్యాన్ని స్పష్టంగా ముందుకు తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉండాలి.

  • బహుపాక్షిక సహకారానికి దృఢ నిబద్ధతతో కృషి చేయాలి.

  • ప్రభావవంతమైన, దౌత్యపరమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలుండాలి. అధ్యక్ష హోదాలో బాధ్యతతో, నిష్పాక్షికంగా పనిచేయాలి.

ఎంపిక ప్రక్రియ..

ఈస్టర్న్‌ స్టాండర్డ్‌ టైమ్‌ ప్రకారం 2023 ఫిబ్రవరి 23 ఉదయం 9 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. మార్చి 29 సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది. బ్యాంకులో సభ్య దేశాలకు ప్రాతినిధ్యం వహించే ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు లేదా గవర్నర్లు నామినేషన్లు దాఖలు చేయాలి. అభ్యర్థులు కచ్చితంగా బ్యాంకు సభ్యదేశాలకు చెందినవారై ఉండాలి.

నామినేషన్ల గడువు ముగిసిన తర్వాత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు సమావేశమై గరిష్ఠంగా ముగ్గురు అభ్యర్థులతో తుది జాబితాను రూపొందిస్తారు. వారి అనుమతితో దాన్ని ప్రచురిస్తారు. అనంతరం షార్ట్‌లిస్ట్‌ అయినవారిని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఇంటర్వ్యూ చేస్తారు. వారిలో ఒకరిని అధ్యక్షుడిగా ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ 2023 మే నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడే ఇంటర్నేషనల్‌ బ్యాంక్ ఫర్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల బోర్డుకు ఎక్స్‌అఫీషియో ఛైర్‌గా వ్యవహరిస్తారు. ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్ల బోర్డుకు కూడా ఎక్స్‌ ఆఫీషియో ఛైర్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు డేవిడ్‌ మాల్పాస్‌ 2023 జూన్‌ 30న ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. 2019 ఏప్రిల్‌ 9న ఆయన ఆ బాధ్యతలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని