Akasa Air: ఆగస్టు 7 నుంచి ఆకాశ ఎయిర్‌ సర్వీసులు ప్రారంభం

Akasa Air: ఆకాశ ఎయిర్‌ ఆగస్టు 7 నుంచి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. టికెట్‌ బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభించారు....

Updated : 22 Jul 2022 13:35 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించేందుకు మరో కొత్త సంస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న ఆకాశ ఎయిర్‌ (Akasa Air) ఆగస్టు 7నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తమ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే టికెట్‌ బుకింగ్‌లు ప్రారంభించినట్లు తెలిపింది.

ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య కూడా సేవలు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్‌ (Akasa Air) ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కూడా టికెట్లు ఇప్పటి నుంచే బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. రెండు బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఒక విమానం భారత్‌కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది.

దశలవారీగా ఇతర నగరాలకు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తామని కంపెనీ సహ-వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రవీణ్‌ అయ్యర్‌ తెలిపారు. ఈ ఏడాది ప్రతినెలా తమ కంపెనీకి రెండు కొత్త విమానాలు అందుతాయని పేర్కొన్నారు. విమానయాన నియంత్రణా సంస్థ డీజీసీఏ నుంచి ఈ నెల 7న ఆకాశ ఎయిర్‌ (Akasa Air) ‘ఎయిర్‌ ఆపరేటర్‌ సర్టిఫికెట్‌’ (AOC) అందుకుంది. మొత్తం 72 మ్యాక్స్‌ విమానాల కోసం కంపెనీ గత ఏడాది నవంబరులో బోయింగ్‌తో కొనుగోలు ఒప్పందం కుదుర్చుకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు