Akshaya Tritiya 2023: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ఇవి తెలుసుకోండి..
Gold Purchase guide in Telugu: అక్షయ తృతీయకు బంగారం కొనడానికి సిద్ధమవుతున్నారా? అయితే కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి..
Akshaya Tritiya 2023 | ఇంటర్నెట్ డెస్క్: పండగలు, శుభకార్యాల సమయంలో బంగారం (Gold) కొనుగోలు చేయడం భారతీయులకు అలవాటు. అక్షయ తృతీయ, ధన త్రయోదశి వంటి వంటి మంచి రోజుల్లో పసిడి కొనుగోలు చేయడాన్ని శుభప్రదంగా భావిస్తారు. ఆ రోజు బంగారం కొనుగోలు చేస్తే సిరిసంపదలు వస్తాయన్నది విశ్వాసం. పైగా తమ పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం వరకు బంగారంలో మదుపు చేయడం కూడా మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. ఏప్రిల్ 22న అక్షయ తృతీయ (Akshaya Tritiya 2023) వస్తోంది. ఇప్పటికే పలు బంగారు ఆభరణ దుకాణాలు ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ఒకవేళ అక్షయ తృతీయ రోజు (Akshaya Tritiya 2023) మీరూ బంగారం కోనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..
ధరపై లుక్కేయండి..
బంగారం కొనుగోలు చేసే ముందు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది దాని ధర. పసిడి ధర ఎప్పుడూ స్థిరంగా ఉండదు. స్వల్పకాలంలోనే చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతర్జాతీయంగా సంభవించే పలు పరిణామాల కారణంగా బంగారం ధర మారుతుంది. అలాగే దేశమంతటా కూడా ఒకేలా ఉండదు. ఒక్కో నగరంలో ఒక్కోలా ఉండొచ్చు. కాబట్టి పసిడి కొనుగోలు చేసే ముందు బంగారం ధరను ఒకట్రెండు షాపుల్లో ఆరా తీయాలి. విశ్వసనీయ వెబ్‌సైట్లలో కూడా రేట్లు తనిఖీ చేయొచ్చు.
స్వచ్ఛతను చూడండి..
బంగారం కొనుగోలు చేసేటప్పుడు తెలుసుకోవాల్సిన మరో ముఖ్య అంశం దాని స్వచ్ఛత. బంగారం స్వచ్ఛతను క్యారెట్లలో కొలుస్తారు. 24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారంగా పరిగణిస్తారు. ప్రస్తుతం మనం కొనుగోలు చేసే బంగారం ఆభరణాలు 22 క్యారెట్లవి. కాబట్టి ధరను చూసేటప్పుడు 22 క్యారెట్ల బంగారాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకవేళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం కావాలంటే మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
హాల్ మార్కింగ్ తప్పనిసరి
ఆభరణాలను అచ్చంగా బంగారంతోనే తయారు చేయడం సాధ్యం కాదు. అందువల్ల ఇతర లోహాలను బంగారంతో కలిపి ఆభరణాలను తయారు చేస్తారు. ఈ లోహాలు ఎంత వరకు కలిపారన్న దానిపై ఆ నగ స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది. హాల్‌మార్క్ గుర్తు బంగారు ఆభరణాల స్వచ్ఛతను తెలియజేస్తుంది. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారుడు మోసపోకుండా భారత ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)ను ఏర్పాటు చేసింది. మీరు కొనుగోలు చేసిన బంగారు ఆభరణం బీఐఎస్ హాల్ మార్క్ కలిగి ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి పసిడి ఆభరణాలను 6 అంకెల హెచ్‌యూఐడీ (హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్)తో విక్రయించడాన్ని బీఐఎస్ తప్పనిసరి చేసింది. ఒకవేళ మీకు బంగారు హాల్‌మార్క్ గురించి ఫిర్యాదులు ఉంటే బీఐఎస్‌ను నేరుగా సంప్రదించొచ్చు.
తయారీ రుసుములు
దుకాణాదారుడు, ఆభరణం డిజైన్, తయారుచేసే వ్యక్తుల ఆధారంగా తయారీ రుసుములు మారుతూ ఉంటుంది. బంగారాన్ని కాయిన్ రూపంలో కొనుగోలు చేసిన అనంతరం ఆభరణంగా తయారు చేసేందుకు 8 నుంచి 16 శాతం వరకు తయారీ ఛార్జీలు విధిస్తారు. ఇది కొంత తయారీ రుసుము గానూ, మరికొంత తరుగు రూపంలో మీ నుంచి వసూలు చేస్తారు. బంగారం ఆభరణంలో తయారీలో కొంత బంగారం వృథా అవుతుంది. దీన్ని తరుగు లేదా వేస్టేజ్ అంటారు. ఆభరణం తయారీకి వసూలు చేసే మొత్తాన్ని మజూరీ అంటారు. ఇది ఆభరణాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది.
కొనుగోలుకు మార్గాలు
బంగారం ఆభరణాల కొనుగోలు చేసేందుకు పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ప్రజలు స్థానిక స్వర్ణకారుడి వద్ద గానీ లేదా బ్రాండెడ్ ఆభరణాల షోరూమ్‌లో గానీ బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, బంగారాన్ని కాయిన్ల రూపంలో, బార్ల రూపంలో కొనుగోలు చేయాలంటే ఇందుకు కొన్ని వెబ్‌సైట్స్, ఎంఎంటీసీ వంటి ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ గోల్డ్ కాయిన్ కొనుగోలు చేయాలంటే బ్యాంకులను కూడా సంప్రదించొచ్చు. చాలా బ్యాంకులు వేరు వేరు విలువలు కలిగిన 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్లను విక్రయిస్తున్నాయి.
విక్రయించడానికి వీలుగా..
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు తయారీ ఛార్జీలు, ప్రాఫిట్ మార్జిన్, జీఎస్టీ వంటివి వర్తిస్తాయి. తిరిగి విక్రయించేటప్పుడు మాత్రం ఇవేవే తిరిగి రావనేది గుర్తుంచుకోవాలి. పైగా పాత బంగారానికి వేస్టేజ్ రూపంలో కొంత తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. అందువల్ల రాళ్లు ఎక్కువగా లేని ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి. బంగారాన్ని పెట్టుబడి సాధారణంగా కొనుగోలు చేసేవారు కాయిన్లు, బార్ల రూపంలో కొనుగోలు చేయడం మంచిది. సార్వభౌమ పసిడి పథకాలు, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా డిజిటల్‌గా బంగారం కొనుగోలునూ పరిశీలించాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఇప్పటికే కొన్ని షోరూమ్‌లు ఆఫర్లు ప్రకటించాయి. బంగారం కొనుగోలు చేసే ముందు ఆ ఆఫర్లనూ ఒకసారి పరిశీలించండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Pawan kalyan: పవన్ షూ రూ.లక్ష.. అక్షయ్ బ్యాక్‌ప్యాక్ రూ.35వేలు.. ఇదే టాక్ ఆఫ్ ది టౌన్!
-
Crime News
Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్‌లో భారీ చోరీ
-
World News
Moscow: మాస్కోపై డ్రోన్ల దాడి..!
-
Politics News
Chandrababu: వైకాపా ప్రభుత్వ నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
-
India News
ఫోన్ కోసం రిజర్వాయర్‌నే తోడేసిన ఘటన.. పర్మిషన్ ఇచ్చిన అధికారికి జరిమానా!