Akshaya Tritiya Gold: నగలే కాదు.. బంగారాన్ని ఇలా కూడా కొనొచ్చు!

Akshaya Tritiya Gold : ఈ అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి ఉన్న మార్గాలేంటో చూద్దాం...

Updated : 02 May 2022 19:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ (Akshaya Tritiya) పర్వదినాన బంగారం కొనాలని పెద్దలు సూచిస్తుంటారు. ఈ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం సంపద ఉంటుందని చాలామంది విశ్వసిస్తారు. బంగారం అనగానే చాలా మంది నగలే కొనాలేమో అనుకుంటారు. కానీ, అవసరం లేదు. కాగితంపై కూడా బంగారాన్ని కొనొచ్చని తెలుసా? మరి రేపు జరుపుకోబోయే ఈ అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా బంగారం కొనాలనుకునేవారికి ఉన్న మార్గాలేంటో చూద్దాం..

బంగారు నాణేలు (Gold Coins)..

1 గ్రాము, 10 గ్రాములు, 50 గ్రాముల బంగారు నాణేలు అందుబాటులో ఉంటాయి. ప్రైవేటు సంస్థలతో పాటు ప్రభుత్వ యాజమాన్యంలోని ఎంఎంటీసీ హాల్‌మార్క్‌తో కూడిన నాణేలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దీని ఔట్‌లెట్లు ఉన్నాయి. కొనేటప్పుడు ఎక్స్ఛేంజీ నియమాలను కచ్చితంగా అడిగి తెలుసుకోండి.

(Also Read: అక్షయ తృతీయకు ‘బంగారం’లాంటి ఆఫర్లు..ఉచితంగా గోల్డ్‌ కాయిన్‌!)

ప్రభుత్వ పసిడి బాండ్లు (Sovereign Gold Bonds)..

బంగారంలో నాణ్యత విషయంలో చాలా మందికి సందేహం ఉంటుంది. పైగా దాన్ని భద్రపర్చుకోవడం ఒక సమస్య. దీనికి పరిష్కారమే సార్వభౌమ పసిడి బాండ్లు (Sovereign Gold Bond-SGB). పెట్టిన పెట్టుబడిపై ఏటా 2.5శాతం వడ్డీ లెక్కన, ఆరు నెలలకోసారి చెల్లిస్తారు. ప్రభుత్వం వీటిని దశలవారీగా విడుదల చేస్తుంటుంది. డీమ్యాట్‌ ఖాతా, బ్యాంకు ఖాతా ఉన్నవారెవరైనా వీటిని కొనొచ్చు. ఒక్కో పసిడి బాండ్‌ కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత ముందస్తు ఉపసంహరణ ఆప్షన్‌ ఉంటుంది. వీటిపై మూలధన రాబడి పన్ను కూడా ఉండదు.

గోల్డ్‌ ఈటీఎఫ్ (Gold ETF)‌..

గోల్డ్‌ ఎక్స్ఛేంజీ ట్రేడెడ్‌ ఫండ్లు (Gold ETF) స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అందుబాటులో ఉన్నాయి. సాధారణ ట్రేడింగ్‌ రోజుల్లో ఎప్పుడైనా యూనిట్ల వారీగా బంగారాన్ని కొని విక్రయించొచ్చు. ధర దాదాపు ఆరోజు భౌతిక బంగారానికి ఉన్న ధరే ఉంటుంది. గోల్డ్‌మన్‌శాక్స్‌ గోల్డ్‌ ఈటీఎఫ్‌, క్వాంటమ్‌ గోల్డ్‌ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్‌ ఈటీఎఫ్‌ వంటి ఫండ్లు మంచి రాబడినిచ్చినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.   (Also Read: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? స్వచ్ఛత, మోసాల గురించి తెలుసుకోండి..)

డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold)..

పేరు సూచిస్తున్నట్లుగా మీ వద్ద భౌతికంగా బంగారం ఉండదు. మీరు కొనుగోలు చేసిన బంగారాన్ని వర్చువల్‌గా ఆన్‌లైన్‌ ఖాతాలో ఉంచవచ్చు. డబ్బులు చెల్లించిన ప్రతిసారి అంత విలువైన బంగారాన్ని విక్రేతలే కొని వారి వద్ద ఉంచుతారు. సాధారణంగా లోహరూపంలో బంగారాన్ని కొనాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.5 వేలైనా అవసరం. అంతకంటే తక్కువ అంటే కష్టమే. కానీ, డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold)లో అలా కాదు. ఒక్క రూపాయి విలువైన బంగారాన్ని కూడా కొనుగోలు చేయొచ్చు. పైగా నకిలీని గుర్తించడం కష్టమవుతున్న ఈరోజుల్లో డిజిటల్‌ గోల్డ్‌ (Digital Gold) వల్ల అటువంటి సమస్యలేమీ ఉండవు. మన తరఫున విక్రేతలే బంగారాన్ని కొని సురక్షితంగా ఉంచుతారు. బీమా సౌకర్యం కూడా ఉంటుంది. పైగా వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానమై ఉంటాయి. దీంతో ధరలపై స్థానిక పరిణామాల ప్రభావం ఉండదు. మీరు కావాలనుకున్నప్పుడు లోహరూపంలో మీకు అందజేస్తారు. ఆన్‌లైన్‌ రుణాలకు డిజిటల్‌ గోల్డ్‌ తనఖా పెట్టొచ్చు.

శుభకార్యాలేమైనా ఉంటే నగలే (Gold Jewellery)..

దగ్గర్లో ఏమైనా శుభకార్యాలుంటే మాత్రం నగల రూపంలో బంగారం కొనడమే ఉత్తమం. పైగా మిగిలిన వాటితో పోలిస్తే.. నగలరూపంలో బంగారం కొనడం అందరికీ తెలిసిన సులభమైన మార్గం. అయితే, తయారీ ఖర్చులు మీ రాబడికి 5-15 శాతం వరకు కోత పెడతాయి. అలాగే ఎక్స్ఛేంజీ సమయంలో విలువను కోల్పోవాల్సి ఉంటుంది. నగలు కొనేటప్పుడు కచ్చితంగా హాల్‌మార్కింగ్‌ సరిచూసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని