Akshaya Tritiya: జోరుగా అక్షయ తృతీయ అమ్మకాలు.. ధరలు ఎలా ఉన్నాయంటే..

విక్రేతలు అంచనా వేసినట్లుగానే నేడు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి....

Updated : 03 May 2022 15:52 IST

ముంబయి: విక్రేతలు అంచనా వేసినట్లుగానే నేడు అక్షయ తృతీయ (Akshaya Tritiya) పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి కొనుగోలుదారులు నగల దుకాణాలకు పోటెత్తుతున్నారు. ఓవైపు ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఉదయమే చాలా మంది కొనడానికి ఆసక్తి చూపించారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన విక్రేతలు ఉదయం తొందరగానే దుకాణాలను తెరిచారు. 

గత 10-15 రోజుల్లో పసిడిలో పెట్టుబడులపై సెంటిమెంటు పెరిగింది. అది నేడూ కొనసాగుతోంది. ఈ అక్షయ తృతీయ (Akshaya Tritiya)ను పురస్కరించుకొని 25-30 టన్నుల బంగారం (Gold) అమ్ముడయ్యే అవకాశం ఉందని ‘అఖిల భారత రత్నాభరణాల దేశీయ మండలి’ వైస్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ మెహ్రా తెలిపారు. ఓ దశలో రూ.55,000-58,000కు చేరిన 10 గ్రాముల బంగారం (Gold) ధర ఇప్పుడు దిగొచ్చిందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం (Gold) ధర రూ.51,510గా కొనసాగుతోంది. రానున్న రోజుల్లో ధరలు మరోసారి గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

Also Read: అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? స్వచ్ఛత, మోసాల గురించి తెలుసుకోండి..

మధ్యాహ్నం దుకాణాలకు వచ్చే కొనుగోలుదారుల సంఖ్య తగ్గినా.. తిరిగి సాయంత్రం పుంజుకునే అవకాశం ఉందని పీఎన్‌జీ జువెల్లర్స్‌ ఎండీ, సీఈఓ సౌరభ్‌ గాడ్గిల్‌ తెలిపారు. ఈరోజు సెలవు కూడా కావడంతో ప్రజలు వాళ్ల వీలును బట్టి దుకాణాలకు వస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు ఇప్పుడు వివాహాది శుభకార్యాలు కూడా ఉండడంతో కొనుగోలు సెంటిమెంటు మరింత పెరిగిందని కల్యాణ్‌ జువెల్లర్స్‌ ఈడీ రమేశ్‌ కల్యాణరామన్‌ తెలిపారు. గత రెండేళ్లుగా లాక్‌డౌన్‌ల ప్రభావంతో ఇక్కట్లు ఎదుర్కొన్న వ్యాపారాలు ఈసారి పూర్తిగా పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గిరాకీ, అమ్మకాలపరంగా ఈసారి కొత్త రికార్డులు నమోదవుతాయని పేర్కొన్నారు.

Also Read: నగలే కాదు.. బంగారాన్ని ఇలా కూడా కొనొచ్చు!

  • దిల్లీ, బెంగళూరు, ముంబయితో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నగరాలైన హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర (Today's Gold Rate) రూ.51,510గా ఉంది. చెన్నైలో ఈ ధర రూ.52,970, లఖ్‌నవూలో రూ.51,660గా, అహ్మదాబాద్‌లో రూ.51,570, పట్నాలో రూ.51,590గా కొనసాగుతోంది.
  • హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలో 10 గ్రాముల వెండి ధర రూ.676గా ఉంది.  

అక్షయ తృతీయకు ఎందుకంత ప్రత్యేకత..

అక్షయ అంటే తరగనిది అని అర్థం. పురాణాల్లో అక్షయపాత్ర గురించి విని ఉంటాం. ఈ పాత్ర కలిగిన వారి ఇంటికి ఎంత‌మంది అతిథులు వచ్చినా కావాల్సినంత ఆహారాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీమహాలక్ష్మీ అమ్మవారు అన్ని ఐశ్వర్యాలకు అధినేత్రి. ఆమె అనుగ్రహం ఉంటే చాలు జీవితంలో ఏ లోటు ఉండదని నమ్మకం. అందుకనే లక్ష్మీదేవి కటాక్షం కోసం అక్షయ తృతీయ (Akshaya Tritiya) పర్వదినాన పూజలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో తదియ నాడు వచ్చే పర్వదినాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. త్రేతాయుగం ఈ రోజునే ప్రారంభం కావడం వల్ల ఈ తిథికి అంత విశిష్టత ఏర్పడింది.

Also Read: అక్షయ తృతీయకు ‘బంగారం’లాంటి ఆఫర్లు..ఉచితంగా గోల్డ్‌ కాయిన్‌!

సంపదలకు అధిపతి అయిన కుబేరుడు శివుణ్ని ప్రార్థించగా ఆయన లక్ష్మీ అనుగ్రహాన్ని అక్షయ తృతీయ రోజునే ఇచ్చినట్టు శివపురాణం చెబుతోంది. మహాభారతంలో ధర్మరాజుకు ఈ రోజున అక్షయపాత్ర ఇవ్వడం, గంగానది ఆ పరమేశ్వరుని జటాజూటం నుంచి భువిపైకి అవతరించిన పవిత్ర దినం అక్షయ తృతీయగా పురాణాలు తెలియజేస్తున్నాయి. పరశురాముడిగా శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన దినమిది. ఇన్ని విశిష్టతలు ఉన్నందున అక్షయతృతీయను ఘనంగా జరుపుకొంటారు. ఈ ప్రత్యేక పర్వదినాన పసిడి కొనుగోలు చేస్తే ఏడాది మొత్తం తమ వద్ద సిరులు ఉంటాయని నమ్ముతారు చాలా మంది. అందుకే అక్షయ తృతీయ నాడు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని