Alibaba: 10 వేల మంది ఉద్యోగులకు అలీబాబా గుడ్‌బై.. 2016 తర్వాత తొలిసారి!

ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్‌ దిగ్గజం చైనాకు చెందిన అలీబాబా (alibaba) కంపెనీ 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.

Published : 06 Aug 2022 22:17 IST

బీజింగ్‌: ప్రపంచంలోనే అతిపెద్ద ఇ-కామర్స్‌ దిగ్గజం చైనాకు చెందిన అలీబాబా (alibaba) కంపెనీ 10 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. చైనాలో ఆర్థికవృద్ధి మందగించడం, విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 9,241 ఉద్యోగులను కంపెనీ తొలగించిందని సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ తెలిపింది. మొత్తం ఉద్యోగుల సంఖ్యను 2.45 లక్షలకు తగ్గించుకుందని పేర్కొంది. 2016 తర్వాత తొలిసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం గమనార్హం. సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ సైతం అలీబాబా గ్రూప్‌నకే చెందినదే. 

ఇ-కామర్స్‌ విక్రయాలు భారీగా తగ్గడమే ఉద్యోగుల తొలగింపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆ కంపెనీ 22.74 బిలియన్‌ యువాన్ల విక్రయాలు జరిపింది. అంతకుముందు ఏడాది 45.14 బిలియన్‌ యువాన్లతో పోలిస్తే విక్రయాలు దాదాపు సగానికి పడిపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఖర్చులు తగ్గించుకోవడానికి అలీబాబా గ్రూప్‌ ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అలీబాబా గ్రూప్‌ అనుబంధ సంస్థ యాంట్‌ గ్రూప్‌ అధికార పగ్గాలను జాక్‌మా వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2020లో కమ్యూనిస్టు పార్టీని విమర్శించిన తర్వాత ప్రభుత్వం అలీబాబా, యాంట్‌ గ్రూప్‌లే లక్ష్యంగా రెగ్యులేటరీ సంస్థలు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని