Adani group: లాభాల్లోకి అదానీ గ్రూప్‌ స్టాక్స్‌.. ₹7.86 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ

Adani group: అదానీ గ్రూప్‌ కంపెనీలు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. ఆ గ్రూప్‌ కంపెనీ షేర్లన్నీ లాభాల్లో ముగిశాయి.

Published : 02 Mar 2023 20:41 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani group) షేర్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అమెరికాకు చెందిన షార్ట్‌ సెల్లర్‌ సంస్థ హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ (Hindenburg Report) తర్వాత ఆ గ్రూప్‌ కంపెనీ షేర్లు భారీగా కుంగగా.. తాజాగా ఆ గ్రూప్‌నకు చెందిన 10 కంపెనీల షేర్లూ గురువారం నాటి ట్రేడింగ్‌లో లాభాల్లో ముగిశాయి. ఇటీవల ఇన్వెస్టర్‌ రోడ్‌షోలు నిర్వహించడం, కనిష్ఠాల వద్ద అదానీ షేర్లను బ్లాక్‌ డీల్‌ ద్వారా సంస్థాగత మదుపర్లు కొనుగోలు చేశారన్న వార్తలు సెంటిమెంటును బలపరిచాయి.

గురువారం నాటి ట్రేడింగ్‌లో అదానీ ట్రాన్స్‌మిషన్‌ 5 శాతం, అదానీ గ్రీన్‌ ఎనర్జీ 4.99 శాతం, అదానీ విల్మర్‌ 4.99 శాతం, అదానీ పవర్‌ 4.98 శాతం చొప్పున రాణించాయి. ఎన్డీటీవీ 4.96 శాతం, అంబుజా సిమెంట్‌ 4.94, అదానీ టోటల్‌ గ్యాస్‌ 4.41 శాతం, అదానీ పోర్ట్స్‌ 3.50 శాతం, అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ 2.69 శాతం, ఏసీసీ 1.50 శాతం చొప్పున రాణించాయి. గురువారం మార్కెట్‌ ముగిసే సమయానికి అదానీ గ్రూప్‌ 10 కంపెనీల మార్కెట్‌ విలువ రూ.7.86 లక్షల కోట్లకు చేరింది. గడిచిన రెండు ట్రేడింగ్‌ సెషన్లలలోనే మార్కెట్‌ విలువ ఏకంగా రూ.74,302.47 కోట్లు మేర పెరగడం గమనార్హం.

మరోవైపు షేర్ల ధరలను అదానీ గ్రూప్‌ కృత్రిమంగా పెంచిందన్న హిండెన్‌బర్గ్‌ ఆరోపణలపై రెండు నెలల్లో దర్యాప్తు చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం ఓ ప్యానెల్‌ను నియమించింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్ మనోహర్ సప్రే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అదానీ గ్రూప్‌ స్వాగతించింది. నిజం గెలుస్తుందని గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ ట్వీట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు