Health Insurance: ఆరోగ్య బీమాపై ఇవన్నీ అపోహలే..!
Health Insurance: ఇప్పటికీ భారత్‌లో ఆరోగ్య బీమాపై అవగాహన చాలా తక్కువ. దానికి కొన్ని అపోహలు, అనుమానాలే ప్రధాన కారణం. వాటిని తొలగించుకుంటే బీమా ప్రాధాన్యం తెలుస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2023లో చైనాను అధిగమించేసి భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలవనుంది. అయినప్పటికీ.. ఆరోగ్య బీమా (Health Insuarance) పాలసీల పరంగా చూస్తే మాత్రం భారత్ చాలా వెనుకబడి ఉంది. ఆరోగ్య బీమా (Health Insuarance) పెనెట్రేషన్ (జీడీపీలో బీమా ప్రీమియంల శాతం ఆధారంగా) భారత్‌లో 0.4 శాతంగా ఉండగా.. అదే చైనాలో 0.7 శాతం, అమెరికాలో 4.1 శాతంగా ఉంది.
భారత్‌లో బీమా వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. మరోవైపు అన్ని వర్గాలకు విస్తృతస్థాయి బీమా ప్రత్యామ్నాయాలు అందుబాటులో లేవు. ఇవే ఆరోగ్య బీమా (Health Insuarance) ప్రజల్లోకి తక్కువ స్థాయిలో చొచ్చుకెళ్లడానికి అడ్డంకులు. ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య బీమా (Health Insuarance) పాలసీల ప్రాముఖ్యతపై పెద్దగా అవగాహన ఉండడం లేదు. అయితే, కొవిడ్ మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత పరిస్థితి కొంత వరకు మెరుగుపడింది. అత్యవసర పరిస్థితుల్లో బీమా ఉంటే ఎంత ఉపయుక్తంగా ఉంటుందో తెలిసొచ్చింది. ఇంకా చాలా మందిలో ఆరోగ్య బీమాపై కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. అవేంటి? వాటిలో నిజమెంతో చూద్దాం..
అపోహ1: బీమా సంస్థలు వేగంగా క్లెయింలు ఇవ్వవు..
చాలా మంది ఆరోగ్య బీమా (Health Insuarance) తీసుకోకపోవడానికి ముఖ్య కారణం ఇదే. క్లెయిం సెటిల్‌మెంట్ ప్రక్రియ చాలా కష్టతరంగా ఉంటుందని.. కంపెనీలు వేగంగా క్లెయింలను సెటిల్ చేయవని ప్రజలు భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. ఐఆర్‌డీఏఐ వార్షిక నివేదిక ప్రకారం.. 2020- 21లో బీమా కంపెనీలు 95-97 శాతం వరకు క్లెయింలను విజయవంతంగా పరిష్కరించాయి. చాలా కంపెనీలు నగదురహిత క్లెయింలను కూడా అందిస్తున్నాయి. క్లెయిం సెటిల్‌మెంట్‌ను ఇది మరింత సులభతరం చేస్తుంది.
పాలసీలో ఇచ్చిన హామీ కంటే ఎక్కువ మొత్తానికి క్లెయిం చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పాలసీలో లేని వ్యాధుల చికిత్స కోసం క్లెయిం చేసుకున్నా కంపెనీలు తిరస్కరిస్తాయి. అలాగే కావాల్సిన పత్రాలన్నీ సకాలంలో సమర్పించకపోయినా బీమా మొత్తాన్ని క్లెయిం చేసుకోవడం కుదరదు.
అపోహ2: క్యాన్సర్, మధుమేహం వంటి జబ్బులు కవర్ కావు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా వరకు ఆరోగ్య బీమా పాలసీల్లో క్యాన్సర్, మధుమేహం వంటి పెద్ద జబ్బులు కూడా కవర్ అవుతున్నాయి. ఒకవేళ కాకపోయినా.. వీటికోసం ప్రత్యేకంగా కొంత అదనపు ప్రీమియం చెల్లిస్తే రైడర్‌ల కింద ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీకి జత చేసుకోవచ్చు. ఒకవేళ పాలసీ తీసుకోవడానికి ముందు నుంచే ఈ వ్యాధులు ఉన్నట్లయితే.. అవి పాలసీలో కవర్ కావడానికి కొంతకాలం వేచి చూడాల్సి ఉంటుంది. చాలా వరకు పాలసీల్లో ఇన్‌పేషెంట్, నిర్ధారణ పరీక్షలు, ఔషధాల ఖర్చులన్నీ కవర్ అవుతాయి. పాలసీ తీసుకునే ముందు వీటి గురించి బీమా కంపెనీల వద్ద స్పష్టత తీసుకోవడం మర్చిపోవద్దు.
అపోహ3: ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే బీమా పాలసీ చాలు..
ఉద్యోగులకు కంపెనీలు ఇచ్చే ‘కార్పొరేట్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్’ సరిపోతుందని చాలా మంది అనుకుంటుంటున్నారు. కంపెనీలు మారినప్పుడు ఇవి రద్దయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు పాలసీలు ఉద్యోగులను మాత్రమే కవర్ చేస్తాయి. ఒకవేళ కుటుంబంలోని ఇతర సభ్యులకు కూడా బీమా తీసుకోవాలంటే అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
అపోహ4: భారత్‌లో ఆరోగ్య బీమా ఖరీదైన వ్యవహారం..
భారత్‌లో చాలా మంది ఆరోగ్య బీమా ప్రీమియం అధికంగా ఉంటుందని అనుకుంటారు. అది పెద్ద ఆర్థిక భారంగా పరిగణిస్తారు. ఇలా భయపడే చాలా మంది ఆరోగ్య బీమా కొనుగోలు చేయడానికి వెనుకాడుతుంటారు. కానీ, ఇది పూర్తిగా వాస్తవం కాదు. అందుబాటు ధరలో ఉన్న పాలసీలు కూడా చాలానే ఉన్నాయి. లేదంటే ప్రామాణిక బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగానే ఉంటుంది. తర్వాత వెసులుబాటు, అవసరానికి అనుగుణంగా రైడర్లను జత చేసుకుంటే సరిపోతుంది. పైగా డబ్బు అందుబాటులో ఉండడాన్ని బట్టి నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం.. ఇలా ఎప్పుడైనా ప్రీమియం చెల్లించేందుకు కంపెనీలు అవకాశం ఇస్తాయి.
అపోహ5: ప్రత్యామ్నాయ చికిత్సలకు బీమా వర్తించదు..
ఆయుర్వేద, హోమియోపతి, యునాని వంటి చికిత్సలకు భారత్‌లో భారీ డిమాండ్ ఉంటుంది. వీటికి ఆరోగ్య బీమా వర్తించదని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇప్పుడు వీటిని కవర్ చేస్తూ కూడా చాలా కంపెనీలు బీమా పాలసీలను తీసుకొచ్చాయి. కస్టమర్లు ప్రత్యేకంగా అడిగి ఈ పాలసీలను తీసుకోవచ్చు. అయితే, ఈ పాలసీలు తీసుకునేవారు నియమ, నిబంధనల్ని క్షుణ్నంగా చదవాలి. 2012- 13లో ప్రత్యామ్నాయ చికిత్సలను కూడా బీమా పాలసీల్లో కవర్ చేయాలని ఐఆర్‌డీఏఐ కంపెనీలకు మార్గదర్శకాలు జారీ చేసింది.
అపోహ6: నెట్‌వర్క్‌లో ఉన్న ఆసుపత్రులు కేవలం నగరాల్లోనే ఉంటాయి..
బీమా పరిధిలోకి వచ్చే ఆసుపత్రులు కేవలం నగరాల్లో మాత్రమే ఉంటాయని చాలా మంది అనుకుంటారు. ఇది కూడా వాస్తవం కాదు. టైర్-2, టైర్-3 పట్టణాల్లోని హాస్పిటల్స్‌ను కూడా నెట్‌వర్క్‌లో కంపెనీలు కవర్ చేస్తున్నాయి. నెట్‌వర్క్‌లో ఉన్న ఆసుపత్రుల్లో ఎలాంటి నగదు చెల్లించకుండానే చికిత్స తీసుకోవచ్చు. నెట్‌వర్క్‌లో లేని ఆసుపత్రుల్లోనైతే.. ముందు చెల్లించి తర్వాత రీయింబర్స్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్‌లు రద్దు చేసిన కేంద్రం
-
World News
North korea: కిమ్మా.. మజాకానా? లాక్డౌన్లోకి ఉత్తర కొరియా నగరం!
-
Politics News
Chandrababu: కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు.. ప్రధాని మోదీకి చంద్రబాబు లేఖ
-
World News
Donald Trump: ‘24 గంటల్లోపే ఉక్రెయిన్ యుద్ధానికి తెరదించుతా..!’
-
Sports News
IND vs AUS:ఈ భారత స్టార్ బ్యాటర్‌ను ఔట్ చేస్తే చాలు.. : హేజిల్‌వుడ్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు