తీసుకున్న రుణం.. తీర్చలేనప్పుడు...

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. దేశాలు, సంస్థలు, అంకురాలు, వ్యక్తులు ఇలా ఎవరైనా సరే.. రూ.కోట్ల నుంచి రూ.వేల వరకూ అవసరం ఎంతైనా కావచ్చు.

Updated : 23 Dec 2022 04:24 IST

ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అప్పు తీసుకోవాలని ఆలోచిస్తుంటారు. దేశాలు, సంస్థలు, అంకురాలు, వ్యక్తులు ఇలా ఎవరైనా సరే.. రూ.కోట్ల నుంచి రూ.వేల వరకూ అవసరం ఎంతైనా కావచ్చు. అప్పు తీసుకోవడం సహజం. రుణగ్రహీతలు అప్పులకు సంబంధించి కొన్ని నిబంధనలు అర్థం చేసుకోవడంలో పొరపాటు చేస్తుంటారు. ఇందులో ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నవి రుణ పునర్నిర్మాణం (లోన్‌ రీస్ట్రక్చ్రెరింగ్‌), కొత్త రుణాన్ని తీసుకోవడం లేదా బదిలీ చేసుకోవడం (లోన్‌ రీఫైనాన్సింగ్‌). ఇవి ఒకే రకంగా అనిపించినా.. రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. వీటిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నిద్దాం.

రుణం తీసుకున్నప్పుడు దాన్ని సకాలంలో తీర్చాలని అందరూ అనుకుంటారు. కానీ, అన్నీ అనుకున్నట్లుగా జరగవు. తీవ్రమైన ఆర్థిక ఒత్తిడి ఉన్నప్పుడు రుణాల చెల్లింపులో అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇక్కడే ఇవి అందుబాటులో ఉంటాయి.

రుణ పునర్నిర్మాణంతో..

వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో చివరి ప్రయత్నంగా ఉపయోగపడేదే రుణ పునర్నిర్మాణం. బ్యాంకుతో అప్పటి వరకూ ఉన్న నిబంధనలు మార్చడం అన్నమాట. ఇప్పటికే ఉన్న తిరిగి చెల్లింపు వ్యవధి, వాయిదా మొత్తం ఇలా అన్నింటినీ కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకురావడంగా చెప్పొచ్చు.

* రుణాన్ని పునర్నిర్మించే అవకాశం అన్ని సమాయాల్లో అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది చివరి ప్రయత్నంగానే బ్యాంకులు భావిస్తాయి. వ్యక్తిగత అంశాల ఆధారంగా ఇది ఆధారపడి ఉంటుంది.

* ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడటం కష్టసాధ్యం అనుకున్నప్పుడు రుణాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నించాలి.

* రుణదాతలు ముందుగా మీ ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తారు. ఆ తర్వాతే రుణాన్ని పునర్నిర్మించేందుకు అంగీకరిస్తారు. రుణగ్రహీతలు దివాలా తీయడం వల్ల ఇబ్బందులు రాకుండా తమకు  ఒక రక్షణను ఏర్పాటు చేసుకోవడమే వారి లక్ష్యంగా ఉంటుంది.

రీఫైనాన్సింగ్‌ అంటే..

కొత్త రుణాన్ని, మరింత సులభమైన షరతులతో తీసుకోవడం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఉన్న రుణానికి వడ్డీ ఎక్కువగా ఉండటం, ఆలస్యపు చెల్లింపు రుసుముల్లాంటివి అధికంగా ఉండటంలాంటివి ఉన్నప్పుడు సులభ షరతులతో, తక్కువ వడ్డీతో అందుబాటులో ఉన్న రుణాన్ని తీసుకోవడం దీని కిందకు వస్తుంది. రుణదాతలు ‘టాప్‌ అప్‌ లోన్‌’ పేరుతోనూ వీటిని అందిస్తుంటారు.

* బాధ్యాతాయుతమైన రుణగ్రహీతకు ఇది ప్రయోజనం కలిగించే అంశమే. వడ్డీ రేటు తగ్గింపు, మరింత రుణం పొందడంలాంటి వెసులుబాట్లు లభిస్తాయి.

* ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయని అంచనాలున్న నేపథ్యంలో స్థిర వడ్డీకి మారడంలాంటివి దీనివల్ల సాధ్యం  చేసుకోవచ్చు.

* రుణగ్రహీత చెల్లింపుల తీరు బాగుండి, క్రెడిట్‌ స్కోరు అధికంగా ఉన్నప్పుడు రుణగ్రహీతలు రీఫైనాన్సింగ్‌కు సులభంగా అంగీకరిస్తారు. కొత్త రుణం తీసుకున్న తరహాలోనే ఉండటం వల్ల కొన్ని అదనపు రుసుములు భరించాల్సి ఉంటుంది. ఈ రుసుములు చెల్లించిన తర్వాతా రీఫైనాన్సింగ్‌ వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది అనుకున్నప్పుడే ముందడుగు వేయాలి.
అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని