ప్రత్యేక పథకాల గడువు ముగుస్తోంది..

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు పలు ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను ప్రవేశ పెట్టాయి. ఈ ప్రత్యేక పథకాల గడువు ఈ నెలాఖరుతో (మార్చి 31) ముగియనుంది.

Published : 24 Mar 2023 00:41 IST

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆకర్షించేందుకు బ్యాంకులు పలు ప్రత్యేక డిపాజిట్‌ పథకాలను ప్రవేశ పెట్టాయి. ఈ ప్రత్యేక పథకాల గడువు ఈ నెలాఖరుతో (మార్చి 31) ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా బ్యాంకులు అందిస్తున్న పథకాలు.. వడ్డీ వివరాలు ఏమిటో పరిశీలిద్దామా...


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా..

ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  (ఎస్‌బీఐ) రెండు ప్రత్యేక టర్మ్‌ డిపాజిట్‌ పథకాలను అందిస్తోంది. ‘అమృత్‌ కలశ్‌ ప్లాన్‌’ పేరుతో 400 రోజుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ)ని తీసుకొచ్చింది. ఈ పథకంలో సాధారణ డిపాజిటర్లకు 7.10 శాతం వడ్డీని చెల్లిస్తుంది. సీనియర్‌ సిటిజన్లకు 7.60 శాతం చొప్పున వడ్డీనందిస్తోంది.

‘ఎస్‌బీఐ వుయ్‌ కేర్‌’లో డిపాజిట్‌ చేసిన సీనియర్‌ సిటిజన్లకు అదనంగా 30 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీని చెల్లిస్తోంది. అయిదేళ్లు, అంతకు మించి వ్యవధికి ఇది వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంలో 7.50శాతం వడ్డీ లభిస్తోంది.


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌...

సీనియర్‌ సిటిజన్ల కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రత్యేకంగా ‘సీనియర్‌ సిటిజన్‌ కేర్‌ ఎఫ్‌డీ’ని తీసుకొచ్చింది. ఈ పథకంలో జమ చేసిన వారికి సాధారణ సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్లకంటే 0.25 శాతం అధిక వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో 10 ఏళ్ల వ్యవధికి 7.75 శాతం వడ్డీనిస్తోంది.


ఐడీబీఐ బ్యాంక్‌..

సీనియర్‌ సిటిజన్లకు అదనంగా మరో 0.25 శాతం వడ్డీనిచ్చేలా ఐడీబీఐ బ్యాంక్‌ ప్రత్యేక ఎఫ్‌డీ ‘నమాన్‌ సీనియర్‌ సిటిజన్‌ డిపాజిట్‌’ను తీసుకొచ్చింది. ఏడాది నుంచి 10 ఏళ్ల వ్యవధికి ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకం కింద కొత్తగా డిపాజిట్‌ చేసిన వారికీ, ఇప్పటికే ఉన్న డిపాజిట్లను పునరుద్ధరించుకునే వారికీ అధిక వడ్డీ పొందేందుకు వీలవుతుంది.


ఇండియన్‌ బ్యాంక్‌..

సీనియర్‌ సిటిజన్లతోపాటు, సాధారణ డిపాజిటర్లకూ అధిక వడ్డీనందించేలా ఇండియన్‌ బ్యాంక్‌ ‘ఇండ్‌ శక్తి 555 డేస్‌’ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో సాధారణ డిపాజిటర్లకు 7 శాతం, సీనియర్‌ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీ లభిస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకూ డిపాజిట్‌ చేయొచ్చు. పథకం కాల వ్యవధి 555 రోజులు.


పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్‌..

ఈ బ్యాంకు ప్రధానంగా రెండు ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. ‘పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 300 డేస్‌’, ‘పీఎస్‌బీ ఫ్యాబ్యులస్‌ 601 డేస్‌’ పేరుతో ఈ పథకాలను తీసుకొచ్చింది. వీటితోపాటు ఉత్కర్ష్‌ 222 రోజుల పథకాన్నీ, పీఎస్‌బీ ఇ-అడ్వాంటేజ్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌నూ తీసుకొచ్చింది. 300 రోజుల వ్యవధి డిపాజిట్‌పై 7.5 శాతం వడ్డీ ఇస్తుండగా, సీనియర్‌ సిటిజన్లకు 8 శాతం ఇస్తోంది. సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు 8.35 శాతం వడ్డీనిస్తోంది. 601 రోజుల వ్యవధి డిపాజిట్లలో సీనియర్లకు 7.5 శాతం, సూపర్‌ సీనియర్లకు 7.85 శాతం వడ్డీనిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు