Allied Blenders IPO: ‘అలైడ్‌ బ్లెండర్స్‌’ ఐపీఓ ప్రారంభం.. పూర్తి వివరాలివే..

Allied Blenders IPO: ‘అలైడ్‌ బ్లెండర్స్‌’ ఐపీఓ నేడు ప్రారంభమైంది. రిటైల్‌ మదుపర్లు గరిష్ఠ ధర వద్ద రూ.14,893తో కనీసం 53 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి.

Updated : 25 Jun 2024 12:08 IST

Allied Blenders IPO | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీ తయారీ సంస్థ అలైడ్‌ బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలర్స్‌ ఐపీఓ (Allied Blenders and Distillers IPO) మంగళవారం ప్రారంభమైంది. 27న ముగియనుంది. ఇందుకు ధరల శ్రేణిగా రూ.267- 281 నిర్ణయించారు. ఇష్యూలో భాగంగా రూ.1,000 కోట్ల కొత్త షేర్లు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో రూ.500 కోట్ల షేర్లను ప్రమోటర్లు విక్రయించనున్నారు. రిటైల్‌ మదుపర్లు గరిష్ఠ ధర వద్ద రూ.14,893తో కనీసం 53 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. ఐపీఓలో అందుబాటులో ఉన్న షేర్లలో సగానికి పైగా అర్హతగల సంస్థాగత మదుపర్లు, 35 శాతం రిటైల్ మదుపర్లు, 10 శాతం సంస్థాగతేతర మదుపర్లకు కేటాయించారు.

ఐపీఓ (IPO) ద్వారా సమీకరించిన నిధుల్లో రూ.720 కోట్లను రుణ చెల్లింపులకు వినియోగించుకోనున్నట్లు అలైడ్‌ బ్లెండర్స్‌ వెల్లడించింది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కేటాయించనున్నట్లు తెలిపింది. 2023 డిసెంబర్‌ నాటికి కంపెనీ మొత్తం రుణాలు రూ.720 కోట్లుగా ఉన్నాయి.

అలీడ్‌ బ్లెండర్స్‌ అండ్ డిస్టిలర్స్‌ 1988లో ప్రారంభమైంది. ప్రధాన బ్రాండ్ ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీతో మార్కెట్‌లోకి ప్రవేశించింది. భారత్‌ సహా విదేశాల్లో ఆల్కహాల్‌తో చేసిన పానీయాలను తయారుచేసి విక్రయిస్తోంది. విస్కీ, బ్రాందీ, రమ్‌, వోడ్కాలో మొత్తం 17 ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ (IMFL) బ్రాండ్లను అమ్ముతోంది. ఆఫీసర్స్‌ ఛాయిస్‌ విస్కీ, రిజర్వ్‌ విస్కీ, జాలీ రోజర్‌ రమ్‌, క్లాస్‌ 21 వోడ్కా ఈ కంపెనీ ప్రధాన బ్రాండ్లలో కొన్ని. ఆఫీసర్స్‌ ఛాయిస్‌, ఆఫీసర్స్‌ ఛాయిస్‌ బ్లూ, స్టెర్లింగ్‌ రిజర్వ్‌ బ్రాండ్లతో ప్యాకేజ్డ్‌ తాగునీటిని కూడా విక్రయిస్తోంది.

ఐఆర్‌సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్‌ బుక్‌ చేస్తే చిక్కులే!

2014-2022 మధ్య వార్షిక విక్రయాల పరంగా భారత్‌లో అలీడ్‌ బ్లెండర్స్‌ మూడో అతిపెద్ద లిక్కర్‌ తయారీ కంపెనీ. భారత్‌ నుంచి ఎగుమతవుతున్న విస్కీలో ఈ కంపెనీదే 11.8 శాతం వాటా. 2023 మార్చి 31 నాటికి దేశంలో 30 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 79,329 ఔట్‌లెట్లలో ఈ కంపెనీ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. తెలంగాణలోని రంగాపూర్‌లో ఈ కంపెనీకి సొంత డిస్టిలరీ ఉంది. 74.95 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో అలీడ్‌ బ్లెండర్స్‌కు ఏటా 54.75 మిలియన్‌ లీటర్ల ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌ను డిస్టిల్ చేసే సామర్థ్యం ఉంది.

ఐపీఓ వివరాలు సంక్షిప్తంగా..

  • తేదీలు : జూన్‌ 25 - 27
  • ధరల శ్రేణి : రూ.267 - 281
  • కనీసం ఆర్డర్‌ చేయాల్సిన షేర్లు : 53
  • కనీస పెట్టుబడి : రూ.14,893
  • షేర్ల అలాట్‌మెంట్‌ : జూన్‌ 28
  • రిఫండ్లు : జులై 1
  • డీమ్యాట్‌ ఖాతాలకు షేర్ల బదిలీ : జులై 1
  • లిస్టింగ్ తేదీ : జులై 2
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు