Gold Investment: బంగారంలో పెట్టుబ‌డికి భౌతిక బంగార‌మేనా.. ఇంకా మార్గాలున్నాయా?

బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆభ‌ర‌ణాలతో స‌హా ఇంకా అనేక మార్గాలున్నాయి.

Updated : 28 Sep 2022 17:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌త్‌లో పండుగ‌ల సీజ‌న్ వ‌చ్చేసింది. ఈ సీజ‌న్‌లో బంగారం కొనుగోలు చేసేవారు కూడా గ‌ణ‌నీయ‌మైన సంఖ్య‌లో ఉంటారు. గ్రామీణ  ప్రాంత ప్ర‌జ‌లు ఎక్కువగా ఉండే భార‌త్‌లో ఇప్ప‌టికీ భౌతిక బంగారాన్ని (ఆభ‌ర‌ణాల రూపంలో) కొనుగోలు చేసేవారే ఎక్కువ. ప‌ట్ట‌ణాల్లో ఒక సీజ‌న్ అని కాకుండా అన్ని స‌మ‌యాల్లోనూ భౌతిక బంగారాన్ని కొనుగోలు చేస్తున్నా.. కాగిత‌, డిజిట‌ల్ బంగారం కొనుగోళ్ల‌వైపు మొగ్గుచూపిస్తున్న‌వారూ పెరిగారు. బంగారంలో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఆభ‌ర‌ణాలతో స‌హా ఇంకా అనేక మార్గాలున్నాయి. ఇవి డిజిట‌ల్ గోల్డ్‌, గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (గోల్డ్ ఈటీఎఫ్‌), గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు, ఆర్‌బీఐ జారీ చేసిన సార్వ‌భౌమ గోల్డ్ బాండ్లు మొద‌లైన‌వి. వీటి మధ్య వ్యత్యాసాలు ఏంటో చూద్దాం.

భౌతిక బంగారం

భార‌త్‌లో బంగారాన్ని కొనుగోలు చేయ‌డం ఆన‌వాయితీగా వస్తోంది. అయితే, ఇందులో స‌మ‌స్య‌లు లేక‌పోలేదు. ఈ బంగారు కొనుగోళ్ల‌కు గ‌ణ‌నీయ‌మైన త‌యారీ రుసుములు ఉంటాయి. త‌రుగు 6-18% దాకా ఉండొచ్చు. ఆభ‌ర‌ణాల రూప‌క‌ల్ప‌న‌లో విలువైన రాళ్లు, ర‌త్నాలు ఉంటే ధ‌ర పెరుగుతుంది. వీటి విలువ కూడా బంగారం ధ‌ర‌లో చేరుస్తారు. బంగారం కొనుగోలు స‌మ‌యంలో జీఎస్‌టీ వ‌సూలు చేస్తారు. బంగారం నాణ్య‌త అనేది మ‌నం ఎంచుకునే త‌యారీదారుని బ‌ట్టి ఉంటుంది. అంతే కాకుండా ప‌రిస్థితుల‌ను బ‌ట్టి బంగారాన్ని బ్యాంకు లాక‌రులో భ‌ద్ర‌ప‌ర‌చాలి. లాక‌రుకు గానూ అద‌న‌పు ఖ‌ర్చులు ఉంటాయి. ఈ బంగారు ఆభ‌ర‌ణాన్ని నగదు అవసరం అయినప్పుడు తిరిగి విక్ర‌యిస్తే.. ఒక్కోసారి కొనుగోలు ధ‌ర కూడా రాక‌పోవ‌చ్చు. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసే వినియోగ‌దారులు ఇవ‌న్నీ గ‌మ‌నించాలి.

డిజిట‌ల్ గోల్డ్

ఇందులో పెట్టుబ‌డికి న‌గ‌ల దుకాణాన్ని సంద‌ర్శించాల్సిన అవ‌స‌రం లేదు. మీ మొబైల్ ఫోన్ క్లిక్‌తో కొనుగోలు చేయ‌వ‌చ్చు. విక్ర‌యించ‌వ‌చ్చు. అమ్మ‌కం జ‌రిపిన‌ప్పుడు మీ ఖాతాలోకి త‌క్ష‌ణం న‌గ‌దు బ‌దిలీ అవుతుంది. డిజిట‌ల్ గోల్డ్‌కు త‌క్ష‌ణ‌ లిక్విడిటీ ఉంటుంది. డిజిట‌ల్ బంగారంలో ఒక రూపాయితో కూడా పెట్టుబ‌డి పెట్టొచ్చు. స్వచ్ఛ‌మైన 24 క్యారెట్ల బంగారం విలువ‌ను పొందుతారు. బంగారాన్ని ఎక్క‌డ దాచాల‌నే ఆందోళ‌న అక్క‌ర్లేదు. డిజిట‌ల్ గోల్డ్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఎలాంటి ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చో ఇక్క‌డ చూద్దాం.

సావ‌రిన్ గోల్డ్ బాండ్లు (SGB)

ఇవి భౌతిక బంగారానికి ప్ర‌త్యామ్నాయాలు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే పెట్టుబ‌డిదారుల‌కు గ్రాముకు రూ. 50 త‌గ్గింపు కూడా ఉంటుంది. బాండ్లు బ్యాంకుల ద్వారా (చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మిన‌హా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), క్లియ‌రింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్‌), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల (నేష‌న‌ల్ స్టాక్ ఎక్స్చేంజీ, బాంబే స్టాక్ ఎక్స్చేంజీ) ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఈ బాండ్లు విక్ర‌యించ‌డానికి పెట్టుబ‌డిదారులు ద్వితీయ‌ మార్కెట్‌ను సంప్ర‌దించ‌వ‌చ్చు. వీటి  కాలపరిమితి 8 సంవ‌త్స‌రాలు. 5వ సంవ‌త్స‌రం నుంచి నిష్క్ర‌మ‌ణకు అనుమ‌తి ఉంటుంది. మ‌దుపుదారుల‌కు బాండు విలువ‌పై సంవ‌త్స‌రానికి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో వార్షికంగా వడ్డీ చెల్లిస్తారు.

క‌నీస పెట్టుబ‌డి 1 గ్రాము బంగారం. గ‌రిష్ఠ ప‌రిమితి వ్య‌క్తికి 4 కిలోలు. మెచ్యూరిటీ వ‌ర‌కు ఉంచిన సావ‌రిన్ గోల్డ్ బాండ్స్‌పై ఎటువంటి మూల‌ధ‌న లాభాల ప‌న్ను విధించ‌రు. ఒక‌వేళ ఎక్స్చేంజీల‌లో మెచ్యూరిటీ తేదీకి ముందు ఈ బాండ్స్ విక్ర‌యించిన‌ట్ల‌యితే, వ‌ర్తించే రేట్ల వ‌ద్ద మూల‌ధ‌న ప‌న్ను విధిస్తారు. సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ నుంచి సంపాదించిన వ‌డ్డీపై మ‌దుపుదారుల ప‌న్ను స్లాబు ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు. వీటిని బంగారంలా లాక‌రులో దాచ‌న‌వ‌స‌రం లేదు. భౌతిక బంగారం కంటే సుల‌భంగా రిడీమ్ చేసుకోవ‌చ్చు. 

గోల్డ్ ఈటీఎఫ్‌లు

ఇందులో పెట్టుబ‌డులకు డీమ్యాట్ ఖాతా అవ‌స‌రం. ఒక గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్‌ను కొనుగోలు చేస్తే.. ఒక గ్రాము స్వ‌చ్ఛ‌మైన బంగారం విలువ‌ను పొందుతారు. ఇందులో పెట్టుబ‌డికి బంగారం డీమెటీరియ‌లైజ్డ్ రూపంలో ల‌భిస్తుంది. అంటే మీ డీమ్యాట్ ఖాతాలో ఎల‌క్ట్రానిక్ రూపంలో భౌతిక బంగారానికి స‌మాన‌మైన బంగారు విలువ‌ను పొందుతారు. ఇవి స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అవుతాయి. వీటిని షేర్ల మాదిరిగానే కొనుగోలు చేయొచ్చు. విక్ర‌యించొచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌ల‌కు ఎటువంటి నిష్క్ర‌మ‌ణ ప‌రిమితులూ ఉండ‌వు. అంటే పెట్టుబ‌డిదారులు మార్కెట్ స‌మ‌యాల్లో ఎప్పుడైనా యూనిట్ల‌ను కొనొచ్చు లేదా అమ్మ‌వ‌చ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌ను రిడీమ్ చేసిన‌ప్పుడు.. భౌతిక బంగారాన్ని పొంద‌లేరు. కానీ, అందుకు స‌మాన‌మైన న‌గ‌దును అందుకుంటారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల‌లో దీర్ఘ‌కాలిక‌, స్వ‌ల్ప‌కాలిక మూల‌ధ‌న లాభం రెండింటిపై ఆదాయ ప‌న్ను ఉంటుంది. 3 ఏళ్ల కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబ‌డుల‌ మూల‌ధ‌న లాభాల‌పై 20% ప‌న్ను విధిస్తారు.

గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్లు

ఈ ఫండ్లు ప్ర‌ధానంగా ఓపెన్‌-ఎండెడ్‌ ఫండ్లు. వీటికి డీమ్యాట్ ఖాతా అవ‌స‌రం లేదు. ఈ ఫండ్ల‌లో క‌నీస పెట్టుబ‌డి రూ. 500 కూడా పెట్టొచ్చు. మీ పెట్టుబ‌డిని ఫండ్ మేనేజ‌ర్లు ప్ర‌ముఖ మైనింగ్ కంపెనీల షేర్లలో లేదా భౌతిక బంగారంలో పెడ‌తారు. మార్కెట్ స‌మ‌యాల్లో ఎప్పుడైనా పెట్టుబ‌డిని రిడీమ్ చేసుకోవ‌చ్చు.

గోల్డ్ మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను నిర్వ‌హించే కొన్ని సంస్థ‌లు

యాక్సిస్ గోల్డ్ ఫండ్‌, ఎస్‌బీఐ గోల్డ్ ఫండ్‌, కోట‌క్ గోల్డ్ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఫండ్‌, ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ గోల్డ్ ఫండ్ ఇంకా మ‌రికొన్ని సంస్థ‌లు కూడా ఉన్నాయి.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని