Amazon: ఖర్చుల్ని తగ్గించుకోవడం కోసమే.. ఉద్యోగాల కోతల్ని సమర్థించుకున్న అమెజాన్‌!

ఉద్యోగుల్ని తొలగించాలని అమెజాన్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. 2023లోనూ కోతలు ఉంటాయని తెలిపింది. ఖర్చుల్ని తగ్గించుకోవడమే ఈ నిర్ణయమంటూ అమెజాన్‌ మరోసారి కోతల్ని సమర్థించుకుంది.

Published : 02 Dec 2022 17:29 IST

వాషింగ్టన్‌: భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించడాన్ని అమెజాన్‌ సీఈఓ ఆండీ జస్సీ మరోసారి సమర్థించుకున్నారు. ఆర్థిక అస్థిరత నేపథ్యంలో ఖర్చుల్ని తగ్గించుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. న్యూయార్క్‌ టైమ్స్‌ గురువారం నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వెలుగులోకి వచ్చిన తొలిరోజుల్లో అమెజాన్‌ రిటైల్‌ వ్యాపారం వేగంగా వృద్ధి చెందిందని జస్సీ తెలిపారు. దీంతో మౌలిక వసతుల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ఖర్చు చేసేలా అప్పటి పరిస్థితులు ప్రోత్సహించాయని పేర్కొన్నారు. అంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామని తాము ఎప్పుడూ ఊహించలేదన్నారు. ఈ విషయంలో కొంత తొందరపడుతున్నామనే విషయం తమకు అప్పుడే అర్థమైందన్నారు. కానీ, తప్పలేదని తెలిపారు.

ఎంత మంది ఉద్యోగుల్ని తొలగించనుందనే విషయాన్ని అమెజాన్‌ ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా వెల్లడించలేదు. కానీ, 10,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ గతంలో మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, తొలగింపులు ప్రారంభమైనట్లు మాత్రం కంపెనీ ధ్రువీకరించింది. 2023లోనూ ఉద్యోగాల కోతలు కొనసాగుతాయని ఇటీవలే జస్సీ స్పష్టం చేశారు. ఆయా విభాగాధిపతులే ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని