Amazon: అమెజాన్‌ వశమైన ఎంజీఎం..త్వరలో ప్రైమ్‌లో జేమ్స్‌ బాండ్‌ సినిమాలు!

ప్రపంచ ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ, ఫిల్మ్‌ స్టూడియో ఎంజీఎం స్టూడియోస్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెజాన్ ప్రకటించింది....

Updated : 18 Mar 2022 11:48 IST

వాషింగ్టన్‌: ప్రపంచ ప్రఖ్యాత చిత్ర నిర్మాణ సంస్థ, ఫిల్మ్‌ స్టూడియో ఎంజీఎం స్టూడియోస్‌ కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు అమెజాన్ ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ రూ.8.5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.64.60 వేల కోట్లు). గత ఐదేళ్లలో అమెజాన్‌కు ఇదే అతిపెద్ద కొనుగోలు.

ఈ రెండు కంపెనీల మధ్య కొనుగోలుపై అమెరికాలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఒప్పందం వల్ల అమెరికా చిత్రపరిశ్రమలో పోటీ లేకుండా పోతుందని భావిస్తున్నారు. అలాగే ఈ ఇరు సంస్థలు గతంలో ఎలాంటి పోటీ లేకుండానే చిన్న చిన్న కంపెనీలను హస్తగతం చేసుకున్నాయన్న ఆరోపణ ఉంది. ఈ పరిణామాలతో ఈ ఒప్పందానికి అనుమతి ఇవ్వడానికి అమెరికా ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌ (FTC) వెనుకాడింది. కానీ, ఈ కొనుగోలు ప్రక్రియను నిలిపివేయడానికి ఉన్న గడువు దాటిపోయింది. ఈ ఒప్పందాన్ని సవాల్‌ చేయడానికి ట్రేడ్ కమిషన్‌ ముందుకు రాలేదు. మరోవైపు ఐరోపా సమాఖ్యకు చెందిన నియంత్రణా సంస్థ ఈ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపింది. దీంతో ఈ డీల్‌ను పూర్తి చేసినట్లు గురువారం అమెజాన్‌ ప్రకటించింది.

అయితే, ఈ డీల్‌ను సవాల్‌ చేసి న్యాయస్థానాన్ని ఆశ్రయించే అధికారం ఎఫ్‌టీసీకి ఇప్పటికీ ఉంది. ఒకవేళ కమిషన్‌లోని మెజారిటీ సభ్యులు వ్యాజ్యం దాఖలుకు మొగ్గుచూపితే ఆ దిశగా చర్యలు చేపట్టొచ్చు. అయితే, ప్రస్తుతం కమిషన్‌లో ఇద్దరు రిపబ్లికన్లు, ఇద్దరు డెమోక్రాట్లు ఉన్నారు. మరొకరిని అధ్యక్షుడు బైడెన్ ఇటీవలే నామినేట్‌ చేశారు. ఆ నియామకానికి సెనేట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది.

ఇకపై ఎంజీఎంకు చెందిన ఉద్యోగులంతా ప్రైమ్‌ సంస్థ కింద పనిచేయనున్నట్లు అమెజాన్‌ ప్రకటించింది. దీంతో ఉద్యోగులు, సిబ్బందిని తొలగిస్తారన్న అనుమానాలు తొలగిపోయాయి.

ప్రైమ్‌లో కొత్తగా 4000 సినిమాలు..!

ఎంజీఎం కంటెంట్‌ మొత్తం ఇకపై అమెజాన్‌ ప్రైమ్‌ లైబ్రరీలో చేరనున్నాయి. జేమ్స్‌ బాండ్‌ ఫ్రాంఛైజీ సహా మొత్తం 4000 చిత్రాలు, 17,000 టీవీ షోలు త్వరలో అమెజాన్‌లో స్ట్రీమ్‌ కానున్నాయి. అయితే, ఇవన్నీ వీక్షకులకు ఎప్పుడు అందుబాటులో వస్తాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. నెట్‌ఫ్లిక్స్‌, డిస్నీతో తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న అమెజాన్‌ ప్రైమ్‌.. ఎంజీఎం కొనుగోలుతో కొంత పైచేయి సాధించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు