
పది లక్షల మందికి వ్యాక్సిన్ ఖర్చు మాదే: అమెజాన్
న్యూదిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్ వస్తు విక్రయ వేదిక అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేసే ఉద్యోగులతో పాటు, విక్రయదారులు, డెలివరీ సర్వీస్ భాగస్వాములు, ఫెక్ల్ డ్రైవర్స్, ‘ఐ హేవ్ స్పేస్’ స్టోర్ పార్టనర్స్, ట్రక్కింగ్ పార్టనర్స్ సహా దాదాపు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌కు అయ్యే ఖర్చును తాము భరిస్తామని తెలిపింది. ఏడాది కాలంగా అమెజాన్.ఇన్‌లో యాక్టివ్‌గా ఉన్న విక్రయదారులందరికీ ఈ ప్రయోజనాలు అందుతాయని వివరించింది.
‘45 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయసున్న వారికి భారత ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో అమెజాన్.ఇన్‌లో ఉన్న ఉద్యోగులు, సహాయకులు, విక్రయదారులు, భాగస్వాములకు వ్యాక్సిన్ అందించటం ద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులకు సరైన రక్షణ కల్పిస్తాం’ అని అమెజాన్ తెలిపింది. ఉద్యోగుల్లో ఎవరైనా కరోనా బారిన పడితే వారి చికిత్సకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది.
ఫ్లిప్‌కార్ట్, ఇన్ఫోసిస్, క్యూర్.ఫిట్, క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టీవీఎస్ మోటార్ కంపెనీ, సిఫీ టెక్నాలజీస్ తదితర సంస్థలు తమ ఉద్యోగుల టీకాకు అయ్యే ఖర్చును భరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.