Amazon: వచ్చే ఏడాదిలోనూ ఉద్యోగాల కోతలు

Amazon: ఉద్యోగుల కోతలకు శ్రీకారం చుట్టిన అమెజాన్‌.. వచ్చే ఏడాదిలోనూ తొలగింపులు ఉంటాయని స్పష్టం చేసింది. 

Published : 18 Nov 2022 12:13 IST

న్యూయార్క్‌: అమెజాన్‌లో ప్రారంభమైన ఉద్యోగుల కోతలు ఇక్కడితో ఆగిపోవని కంపెనీ తెలిపింది. వచ్చే ఏడాదిలోనూ తొలగింపులు కొనసాగుతాయని సీఈఓ ఆండీ జస్సీ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ఇటీవల ఉద్యోగులకు పంపిన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కంపెనీ తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అత్యంత కఠినమైందని తెలిపారు.

వ్యయ నియంత్రణలో భాగంగా గత ఏడాది కాలంగా సమీక్ష నిర్వహించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఎక్కడ ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉందో క్షుణ్నంగా అధ్యయనం చేసినట్లు పేర్కొన్నాయి. అందులో భాగంగానే కొన్ని విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, గతకొన్నేళ్లలో పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల వల్లే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆండీ జస్సీ పేర్కొన్నారు.

కాలిఫోర్నియాలో అమెజాన్‌ మంగళవారం దాదాపు 260 మంది కార్పొరేట్‌ సిబ్బందిని తొలగిస్తూ ప్రకటన జారీ చేసింది. ఇలా ఈ వారం ఎంత మందిని ఇంటికి పంపిందనే విషయం ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. ఎంతమందిని తొలగించాలనే అంశాన్ని ఇంకా కంపెనీ నిర్ణయించలేదని జస్సీ తెలిపారు. సమీక్ష జరుగుతున్న కొద్దీ తొలగింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉద్యోగాల కోతలు వచ్చే ఏడాదిలోనూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. వినియోగదారుల సేవలకు అత్యంత అవసరమైన, దీర్ఘకాలంలో కంపెనీ భవిష్యత్తుకు ఉపయోగపడే ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని తెలిపారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts