Amazon hiring: నియామకాల విషయంలో అమెజాన్‌ వెనకడుగు

అమెరికాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ క్యూ3 ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది.

Published : 28 Oct 2022 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ క్యూ3 ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. అలాగే నాలుగో త్రైమాసికంలో స్వల్ప వృద్ధిని అంచనా వేసింది. దీంతో మార్కెట్‌ అనంతర ట్రేడింగ్‌లో ఆ కంపెనీ షేరు విలువ 13 శాతం మేర పడింది. ఈ క్రమంలో నియామకాలను సైతం తగ్గించుకోవాలని ఆ కంపెనీ చూస్తోంది. అమ్మకాల్లో క్షీణత, మాంద్యం భయాల నేపథ్యంలో ఆ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా సంస్థలు నియామకాలను తగ్గించుకుంటామని ప్రకటించడం గమనార్హం.

క్యూ3 ఫలితాల్లో అమెజాన్‌ 127.10 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఆదాయం 19 శాతం వృద్ధిని నమోదు చేసినప్పటికీ వాల్‌స్ట్రీట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి తోడు క్యూ4లో రెవెన్యూ 140 బిలియన్‌ డాలర్ల నుంచి 148 బిలియన్‌ డాలర్ల మద్య ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. అనలిస్టుల 155.15 బిలియన్‌ డాలర్లు అంచనాలకు ఇది దూరంగా ఉండడం నిరాశ పరిచింది. దీంతో షేరు విలువ కుంగింది. ఈ క్రమంలోనే కొన్ని వ్యాపారాల్లో నియామకాలను నిలిపివేయాలని అమెజాన్‌ నిర్ణయించింది. మూడో త్రైమాసికంలో మధ్యస్థాయి అమ్మకాలు నమోదు కావడం, విదేశీ కరెన్సీ ద్వారా ఎదురవుతున్న సవాళ్లు నాలుగో త్రైమాసికంపై ప్రభావం చూపనున్నాయని అమెజాన్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ బ్రెయిన్‌ ఒల్సావ్స్కీ చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని వ్యాపారాల్లో నియామక ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించామని, వృద్ధికి అవకాశం ఉన్న చోటే వనరులను వినియోగించాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు కొత్తగా గోదాముల తెరిచే విషయంలోనూ అమెజాన్‌ వేగం తగ్గించింది. తన వర్చువల్‌ హెల్త్‌కేర్‌ సర్వీస్‌ను ఈ ఏడాది చివరికల్లా పూర్తిగా మూసివేయాలని నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు