10 min delivery: 10 నిమిషాల్లో డెలివరీపై ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌.. గంటలోనే మనసెందుకు మారింది?

10 నిమిషాల డెలివరీ పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం నెటిజన్లకు శ్రుతి కలిపారు.

Published : 19 Apr 2022 02:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ పుణ్యమా అని ఇటీవల కాలంలో ఫుడ్‌, గ్రాసరీ డెలివరీ కంపెనీలకు ఆదరణ పెరిగింది. అదే సమయంలో వాటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా 10 నిమిషాల్లోనే డెలివరీ అనే కొత్త స్లోగన్‌ను అందుకున్నాయి. తొలుత నిత్యావసర వస్తువులకే పరిమితమైన ఈ విధానం ఇటీవల ఫుడ్‌ డెలివరీ యాప్‌ అయినా జొమాటో సైతం అందిపుచ్చుకుంది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం నెటిజన్లకు శ్రుతి కలిపారు. గంటలోనే కాస్త మెత్తబడ్డారు. ఎందుకని?

10 నిమిషాల్లో డెలివరీ గురించి తన అభిప్రాయం తెలుపుతూ టాటా మెమోరియల్‌ డైరెక్టర్‌ సీఎస్‌ ప్రమేశ్‌ తొలుత ట్వీట్‌ చేశారు. 10 నిమిషాల్లో నిత్యావసరాల డెలివరీ అనేది అమానవీయం, దీనివల్ల డెలివరీ బాయ్స్‌ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తుందని అందులో పేర్కొన్నారు. నిత్యావసర సరకులు 10 నిమిషాల్లో చేరకపోతే ఏమైపోదని, ఇలాంటివి ఆపాలని కోరుతూ ఆయా సంస్థలను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేశారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. ఈ విషయంలో తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.

అక్కడి గంటసేపటికి నిత్యావసర వస్తువులను డెలివరీ చేసే జెప్టో సంస్థ వ్యవస్థాపకుడు ఆదిత్‌ పలిచా దీనిపై స్పందించారు. 10 నిమిషాల్లో డెలివరీపై తనదైన వివరణ ఇస్తూ ఆనంద్‌ మహీంద్రాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేశారు. 10 నిమిషాల డెలివరీ అనేది దూరానికి సంబంధించినదే తప్ప.. వేగానికి సంబంధించినది కాదని చెప్పారు. సగటున 1.8 కిలోమీటర్ల దూరం నుంచే జెప్టో ఈ సేవలను అందిస్తోందని, కాబట్టి  10 నిమిషాల వ్యవధిలో డెలివరీ చేయడం అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. అందుకే సగటున జరిగే రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే జెప్టోలో రోడ్డు ప్రమాదాల రేటు తక్కువేనని చెప్పుకొచ్చారు. దీనిపై ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. మరో కోణంలో చూసినప్పుడు ఇది న్యాయంగానే అనిపిస్తోందంటూ ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు. జెప్టో వ్యవస్థాపకుడి సమాధానంతో ఆనంద్‌ మహీంద్రా సంతృప్తి చెందినట్లు కనిపించినా.. నెటిజన్లు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్యాకింగ్‌, బిల్లింగ్‌, అడ్రస్‌ వెతకడానికి 10 నిమిషాలు సరిపోతుందా? అని పలిచాను నిలదీశారు. ప్రమాదాల గురించి ప్రస్తావించడంపైనా మండిపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని