బ్యాంకులు - ప్రాథమిక సమాచారం!

ప్ర‌స్తుత స‌మాజంలో ప్ర‌తీ ఒక్క‌రి జీవితం డ‌బ్బుతో ముడిప‌డి ఉంది. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును ఎలా, ఎక్క‌డ‌ పొదుపు చేసుకోవాలి. అలాగే బ్యాంకులు, అవి అందించే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం...

Published : 16 Dec 2020 16:33 IST

ప్ర‌స్తుత స‌మాజంలో ప్ర‌తీ ఒక్క‌రి జీవితం డ‌బ్బుతో ముడిప‌డి ఉంది. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్మును ఎలా, ఎక్క‌డ‌ పొదుపు చేసుకోవాలి. అలాగే బ్యాంకులు, అవి అందించే ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

పొదుపు :

ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు మిగిలిన డబ్బును దాచుకోవాలి.
దాచుకున్న మొత్తాన్ని పొదుపు అంటారు.

పొదుపు ఆవశ్యత:

  • మనం క్రమబద్ధంగా పొదుపు చేసినట్లైతే ఆ సొమ్ము పిల్లల చదువు, వివాహం, వాహన కొనుగోలు, ఇంటి కొనుగోలు, ఇంటి మరమ్మతు వంటి ముఖ్యమైన అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
  • అనారోగ్యం, ప్రమాదాలు, మరణం, ప్రకృతి వైపరీత్యాలు, వృద్ధాప్యం లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాడుకోవచ్చు.
    మనం చేసిన పొదుపు అత్యవసర సమయాల్లో అండగా నిలుస్తుంది.

పొదుపు చేసే ప్రక్రియ:

  • ఖర్చును తగ్గించుకోవడం లేదా ఆదాయం పెంచుకోవడం ద్వారా పొదుపు చేయవచ్చు.
  • మనం అనవసరమైన వస్తువులను కొనేందుకు సైతం అప్పుడప్పుడు డబ్బు ఖర్చు చేస్తూ ఉంటాం. ఆహారం, దుస్తులు, ఇల్లు మరమ్మతు, వాహన కొనుగోలు, పిల్ల చదువు, ఆరోగ్య సంరక్షణ వంటి అంశాలు జీవితంలో భాగం.అందువల్ల వాటిని నిత్యావసరాలుగా గుర్తించాల్సి ఉంటుంది. ఇవి లేకుండా జీవితాన్ని కొనసాగించలేం.

అనవసర వస్తువుల విషయానికి వస్తే ఈ వస్తువులు మన జీవితంలో అదనపు వస్తువులుగా భావించబడి మనకు ఆనందాన్నికలిగించేవి తప్ప అవసరాలను తీర్చేవి కావు. ఇటువంటి వస్తువులపై పెట్టే ఖర్చును తగ్గించవచ్చు లేదా వాయిదా వేసుకోవచ్చు. ఉదాహరణకు విలాస వస్తువులు కొనడం(ఏసీ, రేస్‌ బైక్‌లు వంటివి)

పొదుపుకు చక్కటి మార్గం:

పొదుపు సొమ్మును దాచుకునే చక్కని మార్గం బ్యాంక్‌ పొదుపు ఖాతాలో డిపాజిట్‌ చేయడం.
ఇంట్లో దాచిన సొమ్ము వృద్ధి చెందదు. కనుక బ్యాంకులో పొదుపు చేయాలి.

బ్యాంకు ఖాతాలో పొదుపు:

  • బ్యాంకులో దాచిన సొమ్ము సురక్షితంగా ఉంటుంది.
  • బ్యాంకులు నిర్ణయించిన మేరకు వడ్డీ చెల్లిస్తాయి.
  • మన సొమ్మును బ్యాంకులో దాచడం వల్ల మనకు అవసరం అయినప్పుడు ఆ డబ్బును తీసి వాడుకోవచ్చు.
  • బ్యాంకులో ఖాతా ఉంటే రుణం పొందేందుకు సులువుగా ఉంటుంది.
  • మనం మరణించిన తర్వాత కూడా మన డబ్బును క్లెయిం చేయడానికి ఒక వ్యక్తిని నామినీగా నియమించుకోవచ్చు.

నామినేషన్‌ వివరాలు:

డిపాజిట్‌ ఖాతాదారుడు తన మరణం తర్వాత బ్యాంకులో తన ఖాతాలో నిల్వ ఉన్న సొమ్మును క్లెయిం చేయడానికి వీలుగా తన వారసుడైన ఒక వ్యక్తిని నామినీగా నియమించడం జరుగుతుంది. ఇలా నియమించిన నామినీకి ఆ ఖాతాదారు తదనంతరం బ్యాంకులో సొమ్మును క్లెయిం చేయడానికి వీలు కలుగుతుంది.

బ్యాంకు పొదుపు ఖాతా - ప్రయోజనాలు:

  • మనం బ్యాంకులో పొదుపు, రికరింగ్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ ఖాతాలు తెరవచ్చు. డిపాజిట్లు, విత్‌డ్రాయల్‌ సౌకర్యాలు, వడ్డీరేట్ల వంటివన్నీ తెలుసుకోవచ్చు.
  • ఇతర ప్రభుత్వ ఏజెన్సీలు గుర్తించడానికి వీలుగా మనకు ఒక గుర్తింపుగా ఉపయోగపడుతుంది.
  • మనకు రావాల్సిన జీతభత్యాలు నేరుగా ఖాతాలో జమ అవుతాయి. ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే రాయితీలను ‘ప్రత్యక్ష నగదు బదిలీ’ ద్వారా నేరుగా ఖాతా ద్వారా అందుకోవచ్చు.
  • సామాజిక ప్రయోజనాలైన పింఛను డబ్బును, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలకు ప్రభుత్వం చెల్లించే నష్టపరిహారాన్ని ఖాతాలో జమ అయ్యే విధంగా చేసుకోవచ్చు.
  • అవసరం వచ్చినప్పుడు మనం బ్యాంకు నుండి రుణాన్ని పొందవచ్చు. బ్యాంకులు సముచితమైన వడ్డీ రేట్లతోనే రుణాలను అందిస్తాయి. ఖాతాలు కలిగి ఉన్నవారికి రుణాలు అందజేయడం సులువైన ప్రక్రియ.

ఆర్థిక ప్రణాళిక :

మన దగ్గర ఉన్న డబ్బును స్వల్పకాలిక అవసరాలకు పొదుపుగా ఉపయోగించుకుంటూ మిగిలిన వనరులను భవిష్యత్తులో ఆస్తుల కొనుగోలు, పదవీ విరమణ ప్రణాళిక, అత్యవసర ఖర్చులు వంటి దీర్ఘకాలిక అవసరాలను కూడా తీర్చుకునేందుకు వేసే చక్కటి ప్రణాళికయే ఆర్థిక ప్రణాళిక.
దీని ద్వారా మనం క్రమం తప్పని పొదుపు, ఆదాయం సమకూర్చే పెట్టుబడులు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడం లాంటివి ఒక ప్రణాళిక బద్ధంగా చేస్తాము.

ఆర్థిక ప్రణాళిక ప్రాముఖ్యత:

ఆర్థిక ప్రణాళిక మన ఆదాయ స్థాయిని, రాబోయే ఖర్చులను ముందుగానే అంచనా వేసేందుకు తోడ్పడుతుంది. ఇది రెండు రకాలుగా మనకు సహాయ పడుతుంది.
ఒకటి- మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆదాయంలో కొంతభాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడం
రెండు- భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఖర్చులను తగ్గించుకోవడం
అందువల్ల ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటే భవిష్యత్తులో ఇంటి కొనుగోలు, పిల్లల చదువుకు చక్కటి బాట వేసినట్లవుతుంది.

ఆర్థిక ప్రణాళికను రూపొందించే విధానం:

  • మన ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా వేయండి(ఈ రోజు మనం ఏ స్థితిలో ఉన్నాం?)
  • మన ఆర్థిక అవసరాలను గుర్తించండి (మనం ఏం సాధించాలనుకుంటున్నాం?)
    స్వల్పకాలంలో(ఒక సంవత్సరం లోపు)
    మధ్యకాలిక వ్యవధిలో( సంవత్సరం నుండి ఐదు సంవత్సరాల్లోపు)
    దీర్ఘకాలిక వ్యవధిలో (5 సంవత్సరాల కంటే ఎక్కువ)
  • మన లక్ష్యాన్ని ఏ తేదీలోగా సాధించాలి? మనం ప్రతివారం/ప్రతినెలా అందుకోసం ఎంత పొదుపు చేయాలి?
  • ఒక ఆర్థిక డైరీని నిర్వహించండి. వారానికి/నెల వారీగా ఆదాయం మరియు ఖర్చులను అందులో రాయండి
  • ఖర్చులను తగ్గించండి- తెలివిగా ఖర్చుపెట్టండి.
  • పొదుపును క్రమం తప్పకుండా సమీక్షించండి- పొదుపు ప్రణాళికబద్ధంగానే ఉందా? లేనట్లయితే అవకాశం ఉన్నచోట్ల ఖర్చులను తగ్గించుకుంటూ పొదుపును పెంచే ప్రయత్నం చేయండి.
  • ప్రతి వారం/నెల ముగింపులో పొదుపు చేసిన మొత్తాన్ని నిర్ధారించండి.
  • పొదుపు చేసిన సొమ్మును బ్యాంకు ఖాతాలో, సురక్షిత పొదుపు మార్గాల్లో నిల్వ చేయండి.

అనవసర ఖర్చులను తగ్గించే పద్ధతులు:

  • రోజువారీ ఆదాయ, వ్యయాల పట్టికను నిర్వహిస్తే మనం పెట్టే ఖర్చుల్లో నుంచి మన విలాసాలను, స్తోమతను మించిన ఖర్చులను తెలుసుకోవచ్చు.
  • మీకు కాఫీ లేదా టీ తాగే అలవాటు విపరీతంగా ఉందా? అయితే రోజుకు నాలుగు తాగుతుంటే రెండుకు తగ్గించుకోండి.
  • సినిమాలు ఎక్కువగా చూస్తుంటే సాధ్యమైనంత వరకూ నియంత్రించుకోండి.
  • షాపింగ్‌కు వెళ్లే ముందే జాబితా తయారుచేసుకుని వెళితే అనవసరమైన వాటి జోలికి వెళ్లరు.
  • దగ్గరి దూరాలకు సైతం బైక్‌,కారు వాడుతున్నారా? నడిచేందుకు వీలుండే దూరాలకు బైక్‌, కారు వాడకుండా నడిచి వెళ్లండి.
  • ఆఫర్లు ఉన్నాయని అవసరం లేని వస్తువులను కొనవద్దు.
  • తక్కువ మొత్తాల్లో చేసే ఖర్చులకు నగదు చెల్లించేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఖర్చులపై అవగాహన పెరుగుతుంది.

బ్యాంకు ఖాతా- ఆధార్‌ అనుసంధానం

ఒక ఖాతాదారు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసుకోవచ్చు. అయితే వాటిలో చివరిగా ‘ఆధార్‌’ అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాలోనే ప్రభుత్వ రాయితీలు జమ అవుతాయి. కావున ఖాతాదార్లు ఏదైనా ఒక బ్యాంకులో ఒక ఖాతాకు మాత్రమే తమ ‘ఆధార్‌’ సంఖ్యను అనుసంధానం చేసుకోవడం మంచిది.

ప్ర‌త్య‌క్ష‌ నగదు బదిలీ

1 ప్రత్యక్ష నగదు బదిలీ అంటే ప్రజలకు ప్రభుత్వం ద్వారా అందించే సబ్సిడీలు లేదా రాయితీలను అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసే పథకం.
2 లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు వారి ‘ఆధార్‌’ సంఖ్యను అనుసంధానం చేసి దాని గుర్తింపు ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనం కలిగేలా చూస్తారు.
3 మనకు రావాల్సిన డబ్బు నేరుగా మన ఖాతాలో జమ చేయబడుతుంది.

మోసపూరిత మెయిల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండండి

మీకు భారీ మొత్తంలో లాటరీ తగిలిందంటూ ఎప్పుడైనా మెయిల్‌/సంక్షిప్త సందేశం/కాల్‌ వచ్చిందా?
మీ వ్యాపారంలో అదనపు లాభాలు అంటూ తప్పుడు ప్రయోజనాలను అశచూపుతున్నారా?
ఆర్‌బీఐ పేరుతో, ఆర్‌బీఐ అధికారుల పేరుతో మీ బ్యాంకు ఖాతా వివరాలను అడుగుతున్నారా?అయితే అప్రమత్తంగా ఉండండి.

ఇలాంటివి ఎవరూ చెప్పినా నమ్మవద్దు. ఇవన్నీ మోసపూరితమైనవి

  • ఇలాంటి వాటికి స్పందించి ఎప్పుడూ డబ్బు డిపాజిట్‌ చేయవద్దు.
  • ఫోన్‌/మెయిల్‌ ద్వారా ఎవరికీ మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు వెల్లడించకండి.
  • ఏ వ్యక్తి/సంస్థ/స్వచ్ఛంద సంస్థకు సంబంధించిన ఖాతాలు లేదా నిధులు ఆర్‌బీఐ వద్ద ఉండవు.
  • ఇలాంటి మోసపూరిత ఆఫర్‌ల విషయాన్ని సైబర్‌ సెల్‌/ ఇతర చట్టబద్ధ సంస్థలకు తెలియజేయండి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని