Tesla: టెస్లాకు మళ్లీ షాక్‌.. ఎలాన్‌ మస్క్‌ డిమాండ్‌కు భారత్‌ నో..!

అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత్‌లో మళ్లీ షాక్‌ తగిలింది. దిగుమతి చేసే కార్లపై సుంకాలు తగ్గించాలన్న ఎలాన్‌ మస్క్‌కు

Published : 05 Feb 2022 02:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు భారత్‌లో మళ్లీ షాక్‌ తగిలింది. దిగుమతి చేసే కార్లపై సుంకాలు తగ్గించాలన్న ఎలాన్‌ మస్క్‌ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాక్షికంగా తయారుచేసిన వాహనాలను దేశంలో దిగుమతి చేసుకుని అసెంబ్లింగ్‌ చేస్తే వాటిపై తక్కువ సుంకాలనే విధిస్తున్నట్లు కేంద్రం మరోసారి స్పష్టం చేసింది.

‘‘ఈవీలపై దిగుమతి సుంకాలను సవరించాల్సిన అవసరం ఉందా.. అన్నదానిపై సమీక్ష జరిపాం. కానీ, ఇప్పటికే దేశీయంగా ఈవీల ఉత్పత్తి జరుగుతోంది. ప్రస్తుత టారిఫ్‌ వ్యవస్థతో కొన్ని పెట్టుబడులు కూడా వస్తున్నాయి. ఇదే సుంకాల వ్యవస్థతోనే కొన్ని విదేశీ బ్రాండ్‌లు భారత్‌లో విక్రయాలు చేపడుతున్నాయి. సుంకాలు అనేది సమస్య కాదని అర్థమవుతోంది. అలాంటప్పుడు ఇతరులకు (టెస్లాను ఉద్దేశిస్తూ) ఉన్న సమస్య ఏంటీ? ’’ అని కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు ఛైర్మన్‌ వివేక్‌ జోహ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేగాక, దిగుమతి చేసుకునే వాహనాలపై సుంకాలను తగ్గించాలన్న ప్రతిపాదనేదీ బడ్జెట్‌లో లేదని స్పష్టం చేశారు. ఇక, దేశీయంగా తయారీ యూనిట్‌, కంపెనీ భవిష్యత్‌ పెట్టుబడులపై ప్రణాళిక ఇవ్వాలని టెస్లాను కోరినా.. ఇప్పటివరకు కంపెనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా భారత ప్రవేశంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. భారత్‌లో విద్యుత్‌ వాహనాల (ఈవీ) దిగుమతిపై 100శాతం సుంకం ఉందని, దీన్ని తగ్గించాలని టెస్లా కోరుతోంది. కొంతకాలం పాటు దిగుమతి చేసిన కార్లను విక్రయిస్తామని, ప్రజల నుంచి వచ్చే స్పందన బట్టి తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని చెబుతోంది. అయితే ఇతర కంపెనీలకు ఇవ్వని ప్రాధాన్యం టెస్లాకు మాత్రమే ఇవ్వడం సమంజసం కాదని ప్రభుత్వం వాదిస్తోంది. దిగుమతి చేసిన వాహనాలను కాకుండా.. పాక్షికంగా తయారుచేసిన ఈవీలను దిగుమతి చేసి, దేశీయంగా అసెంబ్లింగ్‌ చేసి విక్రయించుకోవాలని కేంద్రం సూచిస్తోంది. దేశీయంగా అసెంబ్లింగ్‌ చేసుకునేందుకు అవసరమైన విడిభాగాలపై దిగుమతి సుంకం 15-30శాతం మాత్రమే ఉందని చెబుతోంది.

మరోవైపు, టెస్లా తయారీ యూనిట్‌ కోసం పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. మా రాష్ట్రంలో ప్లాంటు నెలకొల్పాలంటూ ఇప్పటికే తెలంగాణ, పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర, పంజాబ్‌, తమిళనాడు, కర్ణాటక టెస్లాకు ఆహ్వానం పలికాయి. మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఏకంగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. విద్యుత్తు వాహనాల దిగుమతిపై ఉన్న సుంకాన్ని తగ్గించాలని కోరారు.

నిజానికి 2019లోనే టెస్లాను భారత విపణిలోకి తీసుకురావాలని ఎలాన్‌ మస్క్‌ భావించారు. అయితే భారత ప్రభుత్వం నిబంధనల కారణంగానే టెస్లా రాక ఆలస్యమవుతోందని ఇటీవల మస్క్‌ సోషల్‌మీడియాలో ట్వీట్‌ చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది. మస్క్ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. సోషల్‌ మీడియా ద్వారా మస్క్‌.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని