NCLT: జేపీ హెల్త్‌కేర్‌పై అపోలో హాస్పిటల్స్‌ ఆసక్తి?

దిల్లీ సహా ఉత్తర భారతదేశంలో పలు ఆసుపత్రులు నిర్వహిస్తున్న జేపీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (జేహెచ్‌ఎల్‌) ను ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌) చేపట్టిన దివాలా ప్రక్రియ ద్వారా సొంతం చేసుకోవడానికి అపోలో హాస్పిటల్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది.

Published : 18 Jun 2024 03:41 IST

ఎన్‌సీఎల్‌టీ ద్వారా సొంతం చేసుకునే యత్నాలు

ఈనాడు, హైదరాబాద్‌: దిల్లీ సహా ఉత్తర భారతదేశంలో పలు ఆసుపత్రులు నిర్వహిస్తున్న జేపీ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (జేహెచ్‌ఎల్‌) ను ఎన్‌సీఎల్‌టీ (నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌) చేపట్టిన దివాలా ప్రక్రియ ద్వారా సొంతం చేసుకోవడానికి అపోలో హాస్పిటల్స్‌ ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌కు నూరుశాతం అనుబంధ సంస్థే జేహెచ్‌ఎల్‌. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్, మ్యాక్స్‌ హాస్పిటల్స్, మేదాంతా వంటి సంస్థలూ జేపీ హెల్త్‌కేర్‌పై దృష్టి సారించాయని సమాచారం.

ఇదీ జరిగింది: మరికొన్ని బ్యాంకులతో కలిసి యెస్‌ బ్యాంకు ఒక బృందం (కన్సార్షియం)గా ఏర్పడి జేపీ హెల్త్‌కేర్‌కు అప్పు ఇచ్చింది. దీనికిగాను జేపీ హెల్త్‌కేర్‌లో దాదాపు 64% షేర్లను బ్యాంకులు తనఖా పెట్టుకున్నాయి. కానీ తీసుకున్న అప్పు సకాలంలో తీర్చనందున, ‘సెక్యూరిటైజేషన్‌’ కింద బ్యాంకులు ఈ షేర్లను స్వాధీనం చేసుకున్నాయి. తదుపరి జేసీ ఫ్లవర్స్‌ అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే ఏఆర్‌సీ (అసెట్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీ)కి జేహెచ్‌ఎల్‌ అప్పును విక్రయించాయి. తర్వాత జేపీ హెల్త్‌కేర్‌పై ఎన్‌సీఎల్‌టీ అలహాబాద్‌ బెంచిలో దివాలా ప్రక్రియ మొదలైంది. ఈ ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ ఆమోదం తెలపటంతో, జేపీ హెల్త్‌కేర్‌ ను సొంతం చేసుకునేందుకు దేశంలోని వైద్య, ఆరోగ్య సేవల సంస్థలు చూస్తున్నాయి.

ఇదీ ప్రయోజనం: అపోలో హాస్పిటల్స్‌ కొంతకాలంగా విస్తరణ, పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికలను అమలు చేస్తోంది. అనుకూలంగా ఉన్న ఇతర సంస్థలను కొనుగోలు చేసేందుకూ  ఆసక్తి ప్రదర్శిస్తోంది. జేపీ హెల్త్‌కేర్‌ దిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని నోయిడాలో జేపీ హాస్పిటల్స్‌ను నిర్వహిస్తోంది. ఈ హాస్పిటల్స్‌ను 1200 పడకల సామర్థ్యంతో ప్రతిపాదించగా, ఇప్పటికే 504 పడకలు అన్ని సదుపాయాలతో అందుబాటులోకి వచ్చాయి. బులంద్‌శహర్, ఆగ్రా, కాన్పూర్, డెహ్రాడూన్, సహిబాబాద్‌లలో కొత్త ఆసుపత్రులు నిర్మించే ప్రణాళికలు జేపీ హెల్త్‌కేర్‌కు ఉన్నాయి. ఈ సంస్థను కొంటే దిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో వైద్య సేవల విభాగంలో ఎదిగే అవకాశం లభిస్తుందనే భావనతోనే అపోలో సహా, ఇతర వైద్య సేవలు సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని