Apple: చైనాను ప్రసన్నం చేసుకోవడానికి రూ.20 లక్షల కోట్ల ఒప్పందం!

చైనాను ప్రసన్నం చేసుకోవడానికి యాపిల్‌ ఏకంగా 275 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం...

Published : 09 Dec 2021 01:56 IST

బీజింగ్‌: చైనాను ప్రసన్నం చేసుకోవడానికి యాపిల్‌ ఏకంగా 275 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.20.75 లక్షల కోట్లు. ఇంత భారీ డీల్‌ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? స్వయంగా సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వివరాల్లోకి వెళితే.. 

2016లో నియంత్రణా చర్యల పేరిట చైనా ప్రభుత్వం యాపిల్‌పై కఠిన చర్యలకు దిగింది. దీంతో వ్యాపారం క్రమంగా దెబ్బతింది. రంగంలోకి దిగిన సంస్థ సీఈఓ టిమ్‌ కుక్‌ వెంటనే బీజింగ్‌కు బయలుదేరారు. అక్కడి అధికారులతో చర్చలు జరిపారు. తమ దేశంలో వ్యాపారం ద్వారా యాపిల్‌ భారీగా లబ్ధి పొందుతోందని చైనా అధికారులు ఆయనకు చెప్పారు. కానీ, సంస్థ మాత్రం అందుకు ప్రతిఫలంగా దేశ ఆర్థిక పురోభివృద్ధికి తగిన సహకారం అందించడం లేదని అధికారులు టిమ్‌ కుక్‌ ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై యాపిల్‌ మాత్రం స్పందించలేదు.

దీంతో ఇరు పక్షాల మధ్య ఐదేళ్లకుగానూ 275 బిలియన్‌ డాలర్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం. లేదంటే 2016లో చైనా తీసుకున్న చర్యల వల్ల యాపిల్‌ యాప్‌ స్టోర్‌, యాపిల్‌ పే, ఐక్లౌడ్‌ కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉండేది. అప్పటికే ఐఫోన్‌ విక్రయాలు దెబ్బతినడంతో టిమ్‌ కుక్‌ పలుసార్లు బీజింగ్‌కు వెళ్లి ఈ మేరకు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఒప్పందంలో భాగంగా చైనాలో యాపిల్‌ భారీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ దేశ తయారీ రంగానికి అత్యాధునిక సాంకేతికతను సమకూర్చాలి. ఉద్యోగులకు నైపుణ్య శిక్షణను అందించాలి. యాపిల్‌ పరికరాలకు కావాల్సిన విడిభాగాలను చైనా సరఫరాదారుల నుంచి మరింత ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలి. ఆ దేశ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేయాలి. ఇప్పటికే చైనాలో యాపిల్‌ పెట్టుబడులను భారీగా పెంచాలి. అలాగే కొత్త రిటైల్‌ స్టోర్లు, పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను చేపట్టాలి. చైనా 13వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలైన ఐటీ, శాస్త్ర సాంకేతికత అభివృద్ధి, విద్య, పర్యావరణ పరిరక్షణకు యాపిల్‌ తోడ్పాటునందించాలి. అందుకు ప్రతిఫలంగా యాపిల్‌కు కావాల్సిన సహకారాన్ని చైనా అందిస్తుంది.

ఈ ఒప్పందం కంటే ముందు కూడా చైనా, యాపిల్‌ మధ్య మరో డీల్‌ కూడా కుదిరినట్లు తెలుస్తోంది. చైనా, జపాన్‌.. ఇరు దేశాలు తమవిగా పేర్కొంటున్న కొన్ని దీవులను యాపిల్‌ మ్యాప్స్‌లో మరింత పెద్దగా చూపించాలని డ్రాగన్‌ షరతు విధించినట్లు తెలుస్తోంది. లేదంటే యాపిల్‌ వాచ్‌ విక్రయాలకు అనుమతి నిరాకరిస్తామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో తప్పని పరిస్థితుల్లో యాపిల్‌ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఒప్పందంలోని చాలా అంశాలను యాపిల్‌ ఇప్పటికే అమలు చేసినట్లు తెలుస్తోంది. 2016లో పవన విద్యుదుత్పత్తికి సంబంధించి షింజియాంగ్‌ గోల్డ్‌విండ్‌ అనే కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొంది. అలాగే 2017లో ఐక్లౌడ్‌ కార్యకలాపాలను చైనాకు మార్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. చైనాలో స్వచ్ఛ ఇంధన రంగంలో 300 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ప్రకటించింది. అలాగే 11 కొత్త రిటైల్‌ స్టోర్లను ప్రారంభించింది.

అయితే, ఈ క్రమంలో యాపిల్‌ వ్యాపారం కూడా చైనాలో భారీగా వృద్ధి చెందింది. గత సెప్టెంబరుతో ముగిసిన 12 నెలల వ్యవధిలో 68 బిలియన్‌ డాలర్ల ఆదాయం ఆర్జించింది. యాపిల్‌ మొత్తం విక్రయాల్లో ఐదో వంతు వాటా చైనాదే కావడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని