Apple Airpods: ఆడియో మార్కెట్‌పై యాపిల్‌ కన్ను.. ₹8 వేలకే ఎయిర్‌ పాడ్స్‌!

Airpods under 10K: తక్కువ ధరలోనే ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావడంపై యాపిల్‌ పనిచేస్తోంది. దీని ద్వారా ఆడియో విభాగంలోనూ తన సేల్స్‌ పెంచుకునేందుకు ఆలోచన చేస్తోంది. 

Updated : 13 Jan 2023 14:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (Apple) ఉత్పత్తులేవైనా కాస్త కాస్ట్‌లీనే. ఐఫోన్‌, ఐప్యాడ్‌ ఇలా ఏదైనా రూ.వేలల్లో పెట్టాల్సిందే. చివరికి యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ (Airpods) కొనాలన్నా కనీసం రూ.15వేలు వెచ్చించాల్సిందే. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ జనరేషన్‌ 2 రూ.14,900కు లభిస్తోంది. యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌లో ఇదే అతి తక్కువ. గరిష్ఠ ధర రూ.50వేల పైమాటే. అయితే, ఈ స్థాయిలో ధరలు ఉండడంతో వినియోగదారులను అంతగా ఆకట్టుకోకపోతున్నామని యాపిల్‌ భావిస్తోంది. అందుకే తక్కువ ధరలో ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.

ప్రస్తుతం తక్కువ ధరలో ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావడంపై యాపిల్‌ పనిచేస్తోందని వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో దీన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. దీని ధర భారత్‌లో రూ.8000 ఉండొచ్చని సమాచారం. దీంతోపాటు ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌ పేరిట మరో హై ఎండ్‌ వేరియంట్‌నూ తీసుకొచ్చేందుకు యాపిల్‌ సన్నాహాలు చేస్తోందని తెలుస్తోంది. అయితే, బడ్జెట్‌లో వచ్చే ఎయిర్‌పాడ్స్‌లో యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ ఉండకపోవచ్చని అనలిస్టులు చెబుతున్నారు.

ఎయిర్‌పాడ్స్‌ను తక్కువ ధరలో తీసుకురావడం ద్వారా ఆడియో మార్కెట్‌లోనూ తమ సేల్స్‌పెంచుకోవాలన్నది యాపిల్‌ లక్ష్యంగా తెలుస్తోంది. ఒకవేళ రూ.8వేల ధరలో తీసుకొస్తే యాపిల్‌ సేల్స్‌ పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇంతకంటే తక్కువ ధరలోనే ఇతర కంపెనీల ఎయిర్‌పాడ్స్‌ మరిన్ని ఫీచర్లతో మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయినా యూత్‌లో యాపిల్‌కున్న క్రేజ్‌ అలాంటిది మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని