iPhone 14: యాపిల్‌ ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. ఐఫోన్‌ 14 రాక ఆలస్యం?

iPhone 14 delay: ఐఫోన్‌ 14 విడుదల కాస్త ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Updated : 12 Aug 2022 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ (Apple) సంస్థ నుంచి ఐఫోన్‌ కొత్త మోడల్‌ వస్తుందంటే ఎదురుచూస్తే టెక్‌ ప్రియులెందరో. ఇందులో కొత్త ఫోన్‌ కొనాలనుకునేవారు కొందరైతే.. కొత్త మోడళ్లు వస్తే పాత మోడళ్ల ధరలు తగ్గుతాయని ఎదురుచూసే వారు ఇంకొందరు. అలాంటి వారికి ఇది నిజంగా బ్యాడ్‌న్యూస్‌. యాపిల్‌ ఐఫోన్‌ 14 రాక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి సెప్టెంబర్‌లో ఈ ఫోన్‌ రావాల్సి ఉండగా.. విడుదల కాస్త ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చైనా- తైవాన్‌ మధ్య పరిస్థితులే దీనికి కారణంగా తెలుస్తోంది.

అమెరికాకు చెందిన ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ ఇటీవల తైవాన్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన చైనాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో తైవాన్‌పై డ్రాగన్‌ దేశం గుడ్లురుముతోంది. ఈ క్రమంలో తైవాన్‌ నుంచి దిగుమతయ్యే కంపోనెంట్స్‌పై ఆంక్షలు కఠినతరం చేసింది. ఆ దేశంలో తయారైన భాగాలకు ఇకపై ‘తైవాన్‌, చైనా’ అని గానీ.. ‘చైనీస్‌ తైపీ’ అని గానీ ముద్రించాలని చైనా సూచిస్తోంది. ఒకవేళ ఈ నిర్ణయాన్ని అమలుచేయకపోతే చైనా కస్టమ్స్‌ అధికారులు జరిమానా విధించడమో, తిరస్కరించే అవకాశం ఉంది. దీంతో అక్కడి నుంచి రావాల్సిన వస్తువుల రాక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

యాపిల్‌కు వచ్చిన ఇబ్బంది ఏంటి?

యాపిల్‌ మొబైళ్లలో వినియోగించే చిప్స్‌ తైవాన్‌ నుంచే చైనాకు దిగుమతి అవుతాయి. తైవాన్‌ సెమీకండక్టర్‌ మానుఫాక్చరింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (TSMC)తో యాపిల్‌ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇలా వచ్చిన చిప్పులతో ఇతర విడిభాగాలను కలిపి పెగట్రాన్‌ కంపెనీ ఐఫోన్లను అసెంబుల్‌ చేస్తుంది. దిగుమతుల విషయంలో చైనా కఠినంగా వ్యవహరిస్తుండడంతో వస్తువుల దిగుమతి ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో యాపిల్‌ తన కొత్త ఫోన్‌ లాంచ్‌ ఈవెంట్‌ను వాయిదా వేసే అవకాశం కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీనిపై యాపిల్‌ అధికారికంగా స్పందించలేదు. కొవిడ్‌, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చిప్పుల కొరతతో యాపిల్‌ సహా ఇతర కంపెనీలు అల్లాడాయి. అన్నీ సద్దుమణిగాయనే సరికి చైనా-తైవాన్‌ వివాదం చిప్పులపై ఆధారపడే తయారీ కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని